Sunil Gavaskar: ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న (IND vs ENG) యంగ్ ఇండియా టీమ్ పై మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సిరీస్ లో సర్ఫరాజ్ ఖాన్, రజత్ పటీదార్, ఆకాశ్ దీప్, ధ్రువ్ జురెల్ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. కాగా తాము లేకపోతే ఇండియా టీమ్ గెలవలేదనుకునేవారికి బలమైన సందేశమన్నారు. అంతేకాదు కుర్రాళ్లు సాధించిన విజయం కొంతమందికి హెచ్చరిక అంటూ తన మనసులో మాట బయటపెట్టారు.
పెద్ద స్టార్లు అవసరం లేదు..
‘మూడేళ్ల క్రితం ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కొంతమంది సీనియర్ ప్లేయర్లు మిస్ అయ్యారు. అయినా భారత్ ఘన విజయం సాధించింది. కేవలం 36 పరుగులకే (అడిలైడ్) ఆలౌటైన తర్వాత మెల్‌బోర్న్ టెస్టులో విజయం.. సిడ్నీ మ్యాచ్‌ను డ్రా చేసుకోగలిగాం. సిడ్నీలోనూ రిషభ్ పంత్ మరో అర్ధ గంటపాటు క్రీజ్‌లో ఉంటే భారత్ గెలిచేదేమో. అప్పుడు యువ క్రికెటర్లు చూపించిన తెగువ.. ఇప్పుడు ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లోనూ కనిపిస్తోంది. అందుకే, నేనెప్పుడూ చెబుతూ ఉంటా.. కేవలం పెద్ద స్టార్లు అవసరం లేదు. ఇకనుంచి ఎవరైనా ‘స్టార్లు’ తాము లేకపోతే భారత్ గెలవడం కష్టమని భావించే వారికి ఇది హెచ్చరికలాంటిది. క్రికెట్ అనేది జట్టుగా పోరాడేది. కేవలం ఒకరిద్దరి మీదనే ఆధారపడి ఉండదు' అంటూ గావస్కర్ చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి : Calcutta: మహిళలను ‘డార్లింగ్’ అంటే లైంగిక వేధింపే.. హైకోర్టు సంచలన తీర్పు!
రోహిత్, ద్రావిడ్ చోరవతోనే..
అలాగే ఇంగ్లాండ్‌పై సిరీస్ విజయంలో కీలక పాత్ర కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు కోచ్ రాహుల్ ద్రవిడ్‌దే అన్నారు. వారిద్దరే కుర్రాళ్లకు అవకాశం ఇచ్చారని, వారికి తగ్గట్గుగా మార్చుకున్నారని చెప్పారు. ప్రోత్సాహం అందించి సహజసిద్ధమైన ఆటను బయటకు తీశారు. అందుకే, జట్టులో పెద్ద స్టార్లు లేకపోయినా.. పెద్ద మనసు ఉంటే చాలు విజయాలు సాధించడానికి అని నిరూపించారు. స్వదేశంలోనే సిరీస్ కాబట్టి గెలిచిందనే అభిప్రాయమూ కొందరిలో ఉంటుంది. కానీ, బజ్‌బాల్‌తో ప్రత్యర్థులను ఇరుకున పెట్టాలని భావించే ఇంగ్లాండ్‌ను అడ్డుకోవడం వంటి కఠిన సవాల్‌ను భారత యువ జట్టు తట్టుకోగలిగింది’’ అని గావస్కర్ వెల్లడించారు. భారత్ - ఇంగ్లాండ్ జట్ల మధ్య చివరి టెస్టు మ్యాచ్ మార్చి 7న మొదలుకానుంది.