South Korea : ఉత్తర కొరియా (North Korea) , దక్షిణ కొరియా ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకి పెరుగిపోతున్నాయి. రెండు దేశాలు సైనిక విన్యాసాలు, క్షిపణి ప్రయోగాలతో తమ సైనిక శక్తిని ప్రదర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా దక్షిణ కొరియా లైవ్ ఫైర్ డ్రిల్స్ (Live Fire Drills) చేపట్టింది. ఉత్తర కొరియా సరిహద్దులకు సమీపంలోని తమ దీవుల్లో ఈ డ్రిల్స్‌ను మొదలు పెట్టింది.
దీనిపై కిమ్ జోంగ్ ఉన్ సోదరి, ఉత్తర కొరియాలోనే అత్యంత శక్తిమంతమైన మహిళ కిమ్ యో జోంగ్ (Kim Yo Jong) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు దక్షిణ కొరియాకు గట్టి వార్నింగే ఇచ్చారు. సరిహద్దుల్లో సైనిక విన్యాసాలు చేపట్టడం తమ సార్వభౌమాధికారానికి భంగం కలిగించడమేనని మండిపడ్డారు. ఇలా చేయడం ఆత్మహత్యా సదృశ్యమేనని అన్నారు.
తమను రెచ్చగొడితే కనీవినీ ఎరుగని రీతిలో విధ్వంసం సృష్టిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. సౌత్ కొరియా డ్రిల్స్‌కు జవాబు చెప్పే పనిలో తమ సైనిక బలగాలు ఉన్నాయని పేర్కొన్నారు. కిమ్ యో జాంగ్ స్టేట్ మెంట్‌ను ఉత్తర కొరియా అధికారిక న్యూస్ ఏజెన్సీ విడుదల చేసింది.