ప్రతి సంవత్సరం లక్షలాది మంది అభ్యర్థులు UPSC పరీక్షకు హాజరవుతారు. వీరిలో కొంతమంది మాత్రమే విజయం సాధిస్తారు. జీవితంలో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటూ ఈ గమ్యాన్ని చేరుకున్న వారిలో కొందరే ఉంటారు. అలాంటి అధికారుల్లో 2021 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ దివ్య తన్వర్ ఒకరు.
దివ్య తన్వర్...1997లో హర్యానాలో దేవేంద్రఘడ్ లో జన్మించారు. దివ్యకు 15ఏళ్ల వయస్సులోనే తండ్రి మరణించాడు. అప్పటి నుంచి ముగ్గురు కూతుళ్ల బాధ్యతను తల్లి బబిత చూసుకుంది. కూలీ పనులు చేస్తూ ముగ్గురు కూతుళ్లను చదివించింది. దివ్య తన్వార్ విద్యాభ్యాసం అంతాకూడా మహేంద్రఘడ్ లోనే సాగింది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బీఏ పూర్తి చేసిన దివ్య తన్వార్..సిస్రాలోని చౌదరిదేవిలాల్ విశ్వవిద్యాలయం నుంచి పొలిటికల్ సైన్స్ లో ఎంఏ పూర్తి చేసింది.
అప్పటికే ఎన్నో కష్టాలు పడుతున్న తన కుటుంబానికి తనవంతు సాయం చేయాలని నిర్ణయించుకుంది. దీంతో స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్ గా చేరింది. పిల్లలకు చదువు చెబుతూ...తాను సొంతంగా యూపీఎస్సీ పరీక్షకు ప్రిపేర్ అయ్యింది. ప్రతిరోజూ పది గంటలపాటు దివ్య తన్వార్ చదువుకునేది. 24ఏళ్ల వయస్సులోనే 2021లో మొదటిసారిగా యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరయ్యింది. మొదటి ప్రయత్నంలోనే ఆల్ ఇండియాలో 438 ర్యాంక్ సాధించింది. తనకు వచ్చిన ర్యాంకుకు ఐపీఎస్ కేడర్ దక్కింది. ఐపీఎస్ ట్రైనింగ్ తీసుకుంటూనే...2022లో మరోసారి రెండోసారి మళ్లీ పరీక్ష రాసింది. ఈసారి 105వ ర్యాంకు సాధించింది. ఐఏఎస్ గా సెలక్ట్ అయ్యింది. పేదరికంలో పుట్టిన తనలాంటి ఎంతోమందికి దివ్యతన్వార్ స్పూర్దిదాయకంగా నిలుస్తోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దివ్య తన్వార్ కు ఇన్ స్టాగ్రామ్ లో లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. పేద పిల్లలకు ఆమె ఫ్రీగానే మోటివేషన్ ఇస్తున్నారు. సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదని మరోసారి నిరూపించింది దివ్యతన్వార్.