Andhra Pradesh: జులై 1 నుంచి 'స్టాప్ డయేరియా' కార్యక్రమం

జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 'స్టాప్ డయేరియా' అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏపీ వైద్యారోగ్య శాఖ సిద్ధమైంది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఏపీ వైద్యారోగ్య శాఖ నిర్వహిస్తోంది.

New Update
Andhra Pradesh: జులై 1 నుంచి 'స్టాప్ డయేరియా' కార్యక్రమం

జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 'స్టాప్ డయేరియా' అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏపీ వైద్యారోగ్య శాఖ సిద్ధమైంది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఏపీ వైద్యారోగ్య శాఖ నిర్వహిస్తోంది. ఐదేళ్ల లోపు చిన్నారుల్లో ప్రాణాంతకంగా మారుతున్న డయేరియా వ్యాధిని నిరోధించి మరణాల బారిన పడకుండా ఉండేందుకు కేంద్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ 'స్టాప్ డయేరియా' ప్రచార కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ మేరకు జూన్ 14 నుంచి సన్నాహక చర్యల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టగా.. జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అన్ని ఏర్పాట్లూ చేసింది.

డయేరియా (నీళ్ళ విరోచనాలు) కారణంగా సంభవిస్తున్న చిన్నారుల మరణాలను నిరోధించడమే లక్ష్యంగా దీన్ని రూపొందించారు. ఇప్పటికే అమలులో ఉన్న డయేరియా నివారణ కార్యక్రమంలో ఐదేళ్లలోపు పిల్లలకు ఓఆర్ఎస్ ఇవ్వడంతో పాటు రెండు వారాల పాటు జింక్ ట్యాబ్లెట్లు ఇస్తున్నారు. దీన్ని మరింత విస్తరించి కొత్తగా రూపొందించిన స్టాప్ డయేరియా కార్యక్రమంలో ఐదేళ్లలోపు పిల్లలకు 2 ఓఆర్ఎస్ ప్యాకెట్లతో పాటు 14 రోజులకు సరిపడా జింక్‌ ట్యాబ్లెట్లను కూడా అందజేస్తారు. అంతేకాకుండా డయేరియా వ్యాధి నిరోధానికి పూర్తి స్థాయిలో తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించేందుకు గాను 2 నెలల పాటు సుదీర్ఘ ప్రచార కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం అమలులో వైద్యారోగ్యశాఖతో పాటు గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, గ్రామీణ నీటి సరఫరా, పట్టణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమం , గిరిజన సంక్షేమం వంటి పలు ప్రభుత్వ శాఖలు భాగస్వామ్యమయ్యేలా వైద్యారోగ్య శాఖ స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

Also Read: కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం.. క్లారిటీ ఇచ్చిన డీకే శివకుమార్

2014లో ప్రారంభమైన ఈ కార్యక్రమం, డయేరియా సమస్యను నిరోధించడం, దాని నుండి చిన్నారులను రక్షించడం, చికిత్స అందించడం వంటి చర్యలు తీసుకుంటోంది. తాజాగా ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్)తో పాటు జింక్ ట్యాబ్లెట్ల వినియోగాన్ని పెంచడంపై దృష్టి సారించింది. కాగా కొత్తగా చేపట్టిన ఈ కార్యక్రమంలో డయేరియా, వ్యక్తిగత, పరిసరాల పారిశుద్ధ్య నిర్వహణ, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, టాయిలెట్ల నిర్వహణ, చిన్నారులకు ఓఆర్ఎస్ అందించడం వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ రెండు దశల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. మొదటి దశలో స్టాప్ డయేరియా సన్నాహక కార్యక్రమం జూన్ 14 నుండి 30 వరకు వరకు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టగా.. రెండో దశ కార్యక్రమాన్ని జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది.

ఈ సమయంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఆశా వర్కర్లు , ఎఎన్‌ఎం, సీహెచ్‌వోల ద్వారా పంపిణీ చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. ఐదేళ్లలోపు పిల్లలున్న ఇళ్లకు వీళ్లు వెళ్లి డయేరియా బారిన పడకుండా ఉండాలంటే ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి, డయేరియా బారిన పడ్డాక ఏంచేయాలి అనే అంశాలపై అవగాహన కల్పిస్తారు. డయేరియా సోకిన వెంటనే ఓఆర్ఎస్ ద్రావణాన్ని తయారు చేయడం, వాడడం వంటి విషయాల్ని వివరించడమే కాకుండా డయేరియా ఉన్నట్లు సమాచారమందిస్తే 14 రోజులకు సరిపడా జింక్ ట్యాబ్లెట్లను కూడా అందించేలా చర్యలు తీసుకుంటారు. స్టాప్ డయేరియా సన్నాహక కార్యక్రమాన్ని జూన్ 24న కేంద్ర వైద్యారోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి జె.పి.నడ్డా న్యూఢిల్లీలో ప్రారంభించిన విషయం తెలిసిందే.

Also Read: జులై 1 నుంచి అమల్లోకి కొత్త నేర చట్టాలు.. పూర్తి వివరాలు

స్టాప్ డయేరియా ప్రచారంలో ప్రధానాంశాలు
1. ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఆరోగ్య వసతుల్లో సరైన నిర్వహణ, అవసరమైన వైద్య సామాగ్రి (ఓఆర్ఎస్, జింక్) లభ్యతను నిర్ధారించడం.
2. స్వచ్ఛమైన నీటిని అందుబాటులోకి తేవడం, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం. సురక్షితమైన తాగునీరు, మెరుగైన పారిశుద్ధ్యాన్ని అందించడానికి పటిష్ఠమైన నాణ్యతా నియంత్రణ చర్యలు, స్థిరమైన పద్ధతుల్ని అమలు చేయడం.
3. పోషకాహార కార్యక్రమాల్ని మెరుగుపరచడం, మెరుగైన పోషకాహార కార్యక్రమాల ద్వారా అతిసార వ్యాధులకు ప్రధాన కారణమైన పోషకాహార లోపాన్ని పరిష్కరించడం.
4. పరిశుభ్రతకు సంబంధించి అవగాహన కార్యక్రమాల్ని ప్రోత్సహించడం, సమగ్ర పరిశుభ్రత విద్యా కార్యక్రమాల ద్వారా పిల్లల్లో అవగాహన కల్పించేందుకు పాఠశాలల్ని సన్నద్ధం చేయడం, అలాగే ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించడం వంటి కార్యక్రమాల్ని చేపట్టేలా స్టాప్ డయేరియాను రూపొందించారు.

Advertisment
తాజా కథనాలు