Stock Market Trends : స్టాక్ మార్కెట్ పతనం నుంచి కోలుకుంటుందా? ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఏమి చేయాలి?

ఒక్కరోజులోనే స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ సంపద రూ.30.41 లక్షల కోట్ల రూపాయలు కరిగిపోయింది. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మార్కెట్ భారీగా పతనం అయింది. ఇటువంటి పరిస్థితిలో సాధారణ ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఏమి చేయాలి? నిపుణులు ఏమంటున్నారు? ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు 

New Update
Stock Market Trends : స్టాక్ మార్కెట్ పతనం నుంచి కోలుకుంటుందా? ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఏమి చేయాలి?

Stock Market : దేశ సార్వత్రిక ఎన్నికల్లో (General Elections) వచ్చిన అనూహ్య ఫలితాలు స్టాక్ మార్కెట్ ను కుదిపేశాయి. అంతకు ముందు రోజు ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) లో ఎన్డీయే ప్రభుత్వం (NDA Government) ఘన విజయం సాధించే అవకాశం ఉంది అనే అంచనాలు రావడంతో ఒక్కసారిగా పైకెగసిన సూచీలు.. మంగళవారం ఉదయం ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే వస్తున్న ట్రెండ్స్ తరువాత కుప్పకూలిపోయాయి. మంగళవారం ఉదయం నుంచి మార్కెట్లో స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ మొదలైంది. కొద్దిసేపటికే, సెన్సెక్స్ 4 సంవత్సరాలలో దాని అతిపెద్ద సింగిల్ డే పతనాన్ని చూసింది. అలాగే నిఫ్టీ 10 ఏళ్లలో క్షీణతను నమోదు చేసింది. దీంతో ఒక్కరోజులోనే ఇన్వెస్టర్స్ సంపద రూ.30.41 లక్షల కోట్ల రూపాయలు ఆవిరి అయిపోయింది. 

మార్కెట్ కోలుకుంటుందా?
Stock Market Trends: ఇప్పుడు అందరిలోనూ తలెత్తుతున్న పెద్ద సందేహం ఇది. నిజానికి ఎన్నికలకు.. స్టాక్ మార్కెట్ కు మధ్య విడదీయరాని సంబంధం ఉంటుంది. ఎన్నికల ఫలితారు ఎప్పుడూ మార్కెట్ ను ప్రభావితం చేస్తాయి. సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది అని నమ్మకం ఉంటేనే మార్కెట్ లో పెరుగుదల కనిపిస్తుంది. ఏ మాత్రం అనుమానం ఉన్నా ప్రాఫిట్ బుకింగ్ మొదలవుతుంది. ఇప్పుడు జరిగింది కూడా అదే. ముందురోజు ఎన్డీయే సర్కార్ పూర్తి స్థాయి మెజార్టీతో గెలవబోతోందని అంచనాలు రావడంతో పైకెగసింది. కానీ, తరువాత అసలు ఫలితాల్లో ఎన్డీయే అరకొర మెజార్టీతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని తెలియగానే.. మార్కెట్ పడిపోయింది. కొద్దిరోజుల పాటు మార్కెట్ ఇలా ఒడిదుడుకుల్లో ఉండే పరిస్థితి ఉంటుందనీ.. తరువాత అంతా సర్దుకుంటుందనీ నిపుణులు అంటున్నారు. మార్కెట్ ఇప్పటికే అధిక విలువతో ఉంది.. అందువల్ల ఈ కుదుపు లేదా కరెక్షన్ తప్పనిసరిగా జరుగుతుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.  మళ్ళీ మార్కెట్ పుంజుకుంటుందని వారంటున్నారు. 

ఇన్వెస్టర్స్ ఏం చేయాలి? నిపుణులు ఏమంటున్నారు?
ఇప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం ఇన్వెస్టర్ల మదిలో నెలకొంది. నా డబ్బు ఏమవుతుంది? అనే భయం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ప్రతి విపత్తు ఒక అవకాశానికి దారి తీస్తుందని నిపుణులు అంటున్నారు.  అందువల్ల పెట్టుబడిదారులు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సంపాదన అవకాశాలు ఉన్న అనేక రంగాల గురించి మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

మార్కెట్ నిపుణుడు పునీత్ కింరా జాతీయ బిజినెస్ మీడియాలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.  మార్కెట్ ఓవర్ వాల్యూడ్ గా మారింది. అటువంటి పరిస్థితిలో, ఈ కరెక్షన్ రావాల్సి ఉందని ఆయన అన్నారు. దీనికితోడు ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే ప్రభుత్వం 400 వైపు వెళ్లకపోవడాన్ని చూసి మార్కెట్‌లో స్పందన మొదలైంది. ఇది సాధారణంగా జరిగేదే. హంగ్ పరిస్థితులు వస్తాయి అనుకున్నపుడు మార్కెట్ కచ్చితంగా కిందికి పడుతుంది అని ఆయన అంటున్నారు. 

Also Read: ఏపీలో ఫైనల్ ఫలితాలు..ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే!

Stock Market Trends: అలాగే,  ప్రతి డిజాస్టర్ ఒక అవకాశాన్ని తెచ్చిపెడుతుందని పునీత్ కింరా అన్నారు. ఇలాంటి పరిస్థితిలో, పెట్టుబడిదారులు లార్జ్ క్యాప్ ఇండెక్స్‌లో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. పునీత్ కిన్రా ఎల్ అండ్ టి, రిలయన్స్ ఇండస్ట్రీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఆటో, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బిఐ వంటి కొన్ని స్టాక్‌లు దీర్ఘకాలికంగా భారీ లాభాలను ఆర్జించవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక బీఈఎల్, టాటా పవర్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఆర్‌ఇసి, పిఎఫ్‌సి వంటి స్టాక్‌లు రానున్న కాలంలో మంచి రాబడులను ఇవ్వగలవని మరో  మార్కెట్ నిపుణుడు వివేక్ మిట్టల్ అభిప్రాయపడ్డారు. 

ఏదిఏమైనా ప్రస్తుత పరిస్థితుల్లో కొంతకాలం వేచి చూసే ధోరణి మంచిదని నిపుణులు చెబుతున్నారు. రాజకీయ అనిశ్చిత పరిస్థితులు సర్దుకున్న తరువాత మార్కెట్లు మళ్ళీ నిలదొక్కుకుంటాయని వారు అంటున్నారు. 

గమనిక: ఈ ఆర్టికల్ నిపుణుల అభిప్రాయాల ఆధారంగా ఇచ్చినది. సాధారణ ఇన్వెస్టర్స్ ప్రాధమిక అవగాహన కోసం దీనిని ఇవ్వడం జరిగింది. RTV ఎటువంటి స్టాక్స్ కొనమని కానీ, అమ్మమమని కానీ రికమండ్ చేయడం లేదు. స్టాక్ మార్కెట్ ఎప్పుడూ రిస్క్ తో ఉంటుంది. అందువల్ల ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఆర్ధిక సలహాదారుల సూచనలు తీసుకోవడం మంచిది. 

Advertisment