తిరుమలలో ఇటీవల సెలవులు కావడంతో భక్తుల రద్దీ భారీగా పెరిగిన విషయం తెలిసిందే. తాజాగా సమాచారం ప్రకారం రెండు రోజుల నుంచి రద్దీ భారీ తగ్గింది. టోకెన్లు లేని భక్తులు ఐదు నుంచి ఆరు గంటల్లోనే శ్రీవారి సర్వ దర్శనం అవుతోంది. కంపార్ట్‌మెంట్లలో భక్తుల రద్దీ కూడా అంతంతమాత్రంగానే ఉంటోంది. పెరటాసి మాసం.. మూడో శనివారం అయినప్పటికీ భక్తుల రద్దీ తగ్గటం గమనార్హం. ఇదిలాంటే.. మరోవైపు 2023 అక్టోబర్ 9న (సోమవారం) రేపు తేదీన టీటీడీ పాలకమండలి సమావేశం జరగనున్నది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అధ్యక్షతన జరగబోయే ఈ సమావేశంలో పలు కీలక అంశాలతో పాటు... నవరాత్రి బ్రహ్మోత్సవాలపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఈనెల14వ తేదీన అంకురార్పణ జరుగుతుంది. 15 నుంచి 23 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
చక్రస్నానంతో ముగింపు
తిరుపతిలో ఈనెల 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అక్టోబర్ 14వ తేదీన అంకురార్పణ, 15వ తేదీన పెద్ద శేష వాహనం, 16వ తేదీన చిన్న శేష, హంస వాహనం, 17వ తేదీన సింహ వాహనం, ముత్యపు పందిరి, 18న కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం మొదలగునవి ఉన్నాయి. అయితే.. ఈనెల 19న మోహినీ అవతారం, గరుడ వాహన సేవ, 20న హనుమంత వాహనం, పుష్పక విమానం, రాత్రి గజవాహనం, 21న సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం, 22న స్వర్ణ రథం, అశ్వవాహనం ఉంటుందని టీడీపీ అధికారులు తెలిపారు. అక్టోబర్ 23న (సోమవారం) చక్రస్నానంతో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.
ఆలయ మాడ వీధుల్లో స్వామివారు ఊరేగింపు
ఈ సంవత్సరం తిరుమల శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలను టీటీడీ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిసిన విషయం తెలిసిందే. కాగా.. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా వైభవంగా జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల సమయంలో ఉదయం వాహనసేవ 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుంచి 9 గంటల వరకు జరుగుతాయి. గరుడవాహన సేవ రాత్రి 7 నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వైశిష్ట్యం ఇలా ఉంటే.. వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు ముందుగా అంకురార్పణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి సేనాధిపతి అయిన శ్రీవిష్వక్సేనులవారిని ఆలయ మాడ వీధుల్లో స్వామివారు ఊరేగింపు చేపడతారు. ఆ తరువాత అంకురార్పణం, యాగశాలలో వైదిక కార్యక్రమాలు చేస్తారు. అయితే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారు బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షిస్తారని నమ్మకం.
ఇది కూడా చదవండి: ఆ హక్కు బండారుకు ఎవరిచ్చారు..? రోజాకు అండగా నటి మీనా సంచలన వ్యాఖ్యలు