Chahal Dhana shree: రెండో నెలకే నన్ను మోసం చేశాడు.. ధనశ్రీ ఆరోపణలపై చాహల్ బహిరంగ ప్రకటన

భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ తన మాజీ భార్య ధనశ్రీ వర్మ చేసిన మోసం ఆరోపణలపై తొలిసారిగా స్పందించాడు. తాను క్రీడాకారుడినని, మోసం చేయనని ఆరోపణలను ఖండించాడు. తమ వివాహం నాలుగున్నరేళ్లు కొనసాగిందని, తాను జీవితంలో ముందుకు సాగానని తెలిపాడు.

New Update
Yuzvendra Chahal breaks silence on Dhanashree allegations

టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మలు 2020 డిసెంబర్‌లో వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ జంట వార్తల్లో నిలుస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా వీరు తమ విడాకుల ప్రకటనతో అందరినీ షాక్‌కు గురిచేశారు. తరచూ ఏదో ఒక ఆరోపణలతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నారు. 2025 మార్చిలో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్న ఈ జంట అప్పటి నుంచి వైరల్‌ అవుతూనే ఉన్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ హాట్‌టాపిక్‌గా మారుతున్నారు. ఇటీవల ధనశ్రీ మరోసారి పరోక్షంగా చాహల్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. 

చాహల్ రెండో నెలకే మోసం చేశాడు

దీంతో చాహల్ తన మాజీ భార్య ధనశ్రీ వర్మ చేసిన ఆరోపణలపై ఎట్టకేలకు మౌనం వీడారు. ఇటీవల ఒక రియాలిటీ షోలో ధనశ్రీ మాట్లాడుతూ.. తమ వివాహం జరిగిన రెండో నెలలోనే చాహల్ మోసం చేశాడని ఆమె పరోక్షంగా ఆరోపించారు. ఈ నేపథ్యంలో చాహల్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఒక నేషనల్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాహల్ మాట్లాడుతూ.. తాను క్రీడాకారుడినని, మోసం చేసే అలవాటు తనకు లేదని స్పష్టం చేశారు. 

‘‘ఒకవేళ పెళ్లయిన రెండు నెలల్లోనే మోసం చేస్తే, ఆ బంధం నాలుగున్నర సంవత్సరాలు ఎలా కొనసాగుతుంది?. ఈ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదు. నేను కూడా ఏదో ఒకటి చెప్పొచ్చు. అది సోషల్ మీడియాలో బాగా వ్యాపిస్తుంది. కానీ ప్రతి విషయానికి ఒక నిజం ఉంటుంది.’’ అని చాహల్ అన్నారు. ఈ ఆరోపణలు నిరాధారమైనవని చాహల్ పేర్కొన్నారు. తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ.. ‘‘నా వరకు ఈ చాప్టర్ ఎప్పుడో ముగిసింది. నేను నా జీవితంలో ముందుకు సాగిపోయాను. అందరూ అదే చేస్తే మంచిది’’ అని అన్నారు. 

వారి ఇల్లు నా పేరు మీదే నడుస్తోంది

అలాగే గతాన్ని పట్టుకుని వేలాడుతున్న వారిపై పరోక్షంగా విమర్శించారు. ‘‘నేను గతంలోనే చెప్పాను. నేను నా గతం నుంచి బయటపడ్డాను. కానీ కొంతమంది ఇప్పటికీ అక్కడే ఆగిపోయారు. ఇప్పటికీ వారి ఇల్లు నా పేరు మీదే నడుస్తోంది. కాబట్టి వారు అలా కొనసాగించవచ్చు. దాని గురించి నేను పట్టించుకోను. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు.’’ అని వ్యాఖ్యానించారు. ఇదే తన చివరి ప్రకటన అని, ఇకపై ఈ అంశం గురించి మాట్లాడదలుచుకోలేదని చాహల్ స్పష్టం చేశారు. ప్రస్తుతం తన దృష్టి అంతా తన వ్యక్తిగత ఎదుగుదల, ఆట మీదే ఉందని తెలిపారు. తాను ప్రస్తుతానికి సింగిల్‌గా ఉన్నానని, కొత్త బంధం కోసం చూడడం లేదని కూడా ఆయన వెల్లడించారు. 

ఇదిలా ఉంటే చాహల్ చాలా కాలంగా భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. చివరిసారిగా 2023లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా జెర్సీలో ఆడాడు. ఆ మ్యాచ్ తర్వాత చాహల్ భారత వన్డే లేదా టీ20 జట్టులోకి తిరిగి రాలేకపోయాడు. చాహల్ భారతదేశం తరపున మొత్తం 72 వన్డేలు ఆడి 121 వికెట్లు పడగొట్టాడు.

Advertisment
తాజా కథనాలు