/rtv/media/media_files/2026/02/21/shikhar-2026-02-21-20-10-26.jpg)
టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ మరోసారి పెళ్లి పీటలెక్కాడు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న తన గర్ల్‌ఫ్రెండ్ సోఫీ షైన్‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు. చాలా ప్రైవేట్‌గా జరిగిన ఈ వివాహ వేడుకకు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. వీరిద్దరూ గత ఏడాది కాలంగా డేటింగ్లో ఉండగా, గత మే నెలలో తమ బంధం గురించి ధావన్ బయటపెట్టారు.
ఈ జంట పెళ్లికి సంబంధించిన ఫోటోలను టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. "మేరే యార్ కీ షాదీ హై" (నా దోస్తు పెళ్లి) అంటూ మురిసిపోయారు. కాగా దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో సోఫీ షైన్, ధావన్ కలిసి మొదటిసారి కెమెరా కంటికి చిక్కారు. ఆ తర్వాత పలు సందర్భాల్లో ధావన్ మాట్లాడుతూ.. తన జీవితంలోకి మళ్ళీ ప్రేమ ప్రవేశించిందని హింట్ ఇచ్చారు. జనవరి 12న వీరిద్దరికీ నిశ్చితార్థం కూడా జరగడంతో, ఈ పెళ్లి కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు.
కాగా ధావన్ గతంలో అయేషా ముఖర్జీని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 11 ఏళ్ల బంధం తర్వాత, అనేక మనస్పర్థల కారణంగా వీరిద్దరూ అక్టోబర్ 2023లో విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో ధావన్ మానసిక వేదనకు గురయ్యారని కోర్టు కూడా అభిప్రాయపడింది. ముఖ్యంగా తన కొడుకు జోరావర్‌ను చూసేందుకు, మాట్లాడేందుకు కూడా అవకాశం లేక ధావన్ చాలా ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం కోర్టు ధావన్‌కు తన కొడుకుని కలిసే హక్కు కల్పించినప్పటికీ, వారి మధ్య కమ్యూనికేషన్ సరిగ్గా లేదని ధావన్ గతంలో ఆవేదన వ్యక్తం చేశారు. ధావన్ రెండో పెళ్లి చేసుకోవడంతో క్రికెట్ అభిమానులు ఆయనకు సోషల్ మీడియా ద్వారా కంగ్రాట్స్ చెబుతున్నారు.
భారత్ తరపున అత్యధిక పరుగులు
టీమిండియాలో అత్యంత విజయవంతమైన ఓపెనర్లలో ఒకరిగా శిఖర్ ధావన్ తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేశారు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో 'గోల్డెన్ బాట్' గెలవడంతో పాటు, ఐసీసీ టోర్నమెంట్లలో భారత్ తరపున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఆయనకు మంచి పేరుంది. టెస్టు అరంగేట్రంలోనే అతివేగంగా సెంచరీ (85 బంతుల్లో) బాదిన రికార్డు ఇప్పటికీ ధావన్ పేరు మీదనే ఉంది.
తన సుదీర్ఘ కెరీర్లో 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20లు ఆడి మొత్తం 10,000కు పైగా అంతర్జాతీయ పరుగులు సాధించారు. ఐపీఎల్లో కూడా వరుసగా రెండు సెంచరీలు బాదిన మొదటి ఆటగాడిగా చరిత్ర సృష్టించిన ధావన్ 2024 ఆగస్టులో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
Follow Us