/rtv/media/media_files/2025/02/15/3Nkn6ct7mUZceM0Antwi.jpg)
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు శుభారంభం చేసింది. గుజరాత్ జెయింట్స్ (GG)తో జరిగిన తొలి మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. వడోదరలోని కోటంబి స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ జట్టు నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని 9 బంతులు మిగిలి ఉండగానే సాధించింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఒక జట్టు 200 కంటే ఎక్కువ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
చెలరేగిన రిచా-పెర్రీ జోడీ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయంలో వికెట్ కీపర్-బ్యాట్స్ మన్ రిచా ఘోష్ కీలక పాత్ర పోషించింది. రిచా 27 బంతుల్లో నాలుగు సిక్సర్లు, ఏడు ఫోర్లతో 64 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఆమెకు తోడుగా అలిస్సా పెర్రీ 34 బంతుల్లో 57 పరుగులు చేసింది. పెర్రీ తన ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టింది. కనికా అహుజా 30 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. కనికా, రిచా ఘోష్ కలిసి ఐదో వికెట్‌కు అజేయంగా 93 పరుగులు జోడించారు. గుజరాత్ జెయింట్స్ తరఫున ఆష్లే గార్డనర్ రెండు వికెట్లు పడగొట్టగా.. . డియాండ్రా డాటిన్, సయాలి సత్ఘారే తలో వికెట్ తీశారు.
అంతకుముందు, టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. గుజరాత్ కెప్టెన్ ఆష్లీ గార్డనర్ కేవలం 37 బంతుల్లో 79 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఇందులో ఎనిమిది సిక్సర్లు, మూడు ఫోర్లు ఉన్నాయి. WPL మ్యాచ్‌లో 8 సిక్సర్లు కొట్టిన రెండవ బ్యాట్స్‌మన్ గార్డనర్ కావడం విశేషం. ఓపెనర్ బెత్ మూనీ కూడా అద్భుతంగా 56 పరుగులు చేసింది. ఆర్సీబీ తరుపున రేణుకా సింగ్ అత్యధికంగా రెండు వికెట్లు పడగొట్టగా.. . కనికా అహుజా, జార్జియా వేర్‌హామ్, ప్రేమా రావత్ తలో వికెట్ తీశారు.
Also read : వల్లభనేని వంశీ అరెస్ట్..ఏపీ హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు!