/rtv/media/media_files/2025/11/12/rashid-khan-second-marriage-2025-11-12-21-56-05.jpg)
Rashid Khan Second Marriage
అఫ్గానిస్థాన్ క్రికెటర్, స్టార్ లెగ్-స్పిన్నర్ రషీద్ ఖాన్ రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇదే విషయాన్ని అతడు తాజాగా తన ఇన్‌స్టా వేదికగా చెప్పుకొచ్చాడు. గత కొంత కాలం నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న గాసిప్స్‌కు అతడు క్లారిటీ ఇచ్చాడు. ఇందులో భాగంగా తాజాగా ఒక అమ్మాయితో కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలపై అసలు విషయం బయటపెట్టాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Rashid Khan Second Marriage
క్రికెటర్ రషీద్ ఖాన్‌కు గత ఏడాది అంటే 2024 అక్టోబర్‌లో మొదటి వివాహం జరిగింది. ఇది కాబుల్‌లో అత్యంత అంగరంగ వైభంగా.. అతి కొద్ది మంది సమక్షంలో జరిగింది. అదే రాత్రే అతని ముగ్గురు సోదరులు.. అమీర్ ఖలీల్, జకియుల్లా, రజా ఖాన్‌లు కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
కానీ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ అతడి వైవాహిక జీవితానికి సంబంధించి పుకార్లు పుట్టుకొచ్చాయి. రషీద్ ఖాన్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగింది. దానికి తోడు ఇటీవల సంప్రదాయ అఫ్గాన్ దుస్తుల్లో ఒక మహిళ పక్కన రషీద్ కూర్చుని ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
దీంతో వీటిపై అనేక ఊహాగానాలు చెలరేగాయి. ఇలా రెండో వివాహంపై పుకార్లు జోరందుకున్న నేపథ్యంలో రషీద్ ఖాన్ స్వయంగా రంగంలోకి దిగి క్లారిటీ ఇచ్చాడు. తాను ఆ మహిళను వివాహం చేసుకున్నానని, ఆమె తన భార్యేనని స్పష్టం చేశాడు. దీనిపై మరింత మందికి క్లారిటీ ఇచ్చేందుకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టాడు.
‘‘ఆగస్టు 2, 2025 న నా జీవితంలో ఒక కొత్త, అర్థవంతమైన అధ్యాయాన్ని ప్రారంభించాను. నా నిక్కాను పూర్తి చేసుకున్నాను. నేను ఎల్లప్పుడూ ఆశించిన ప్రేమ, శాంతి, భాగస్వామ్యాన్ని ప్రతిబింబించే స్త్రీని వివాహం చేసుకున్నాను.’’ అని రషీద్ ఖాన్ తన పోస్టులో రాసుకొచ్చారు.
అదే సమయంలో తనతో కలిసి ఉన్న మహిళ గురించి మాట్లాడారు. ‘‘నేను ఇటీవల నా భార్యను ఒక ఛారిటీ ఈవెంట్‌కు తీసుకువెళ్ళాను. ఇది చాలా సాధారణ విషయం. దీనిపై ఊహలు అత్యంత దురదృష్టకరం. నిజం సూటిగా ఉంటుంది. ఆమె నా భార్య. మేము దాచడానికి ఏమీ లేకుండా కలిసి నిలబడతాం. ఈ విషయంలో మాపై దయ, మద్దతు, అవగాహన చూపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.” అని రషీద్ ఖాన్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఛారిటీ ఫౌండేషన్ ప్రారంభోత్సవం
కాగా వైరల్ అయిన ఫొటోలు, వీడియోలు నెదర్లాండ్స్‌లో రషీద్ ఖాన్ ఛారిటీ ఫౌండేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా తీసినవి. అఫ్గాన్ కమ్యూనిటీల కోసం విద్య, ఆరోగ్యం, శుభ్రమైన నీటి ప్రాజెక్టుల కోసం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఏది ఏమైనా తనపై వచ్చిన పుకార్లకు రషీద్ ఖాన్ స్వయంగా వివరణ ఇవ్వడంతో అందరిలోనూ గందరగోళం తొలగిపోయింది.
Follow Us