Pakistan-Afghanistan war 2025: పాకిస్తాన్ దాడిపై రషీద్ ఖాన్ సహా స్టార్ క్రికెటర్ల షాకింగ్ రియాక్షన్

పాక్ వైమానిక దాడుల్లో ముగ్గురు ఆఫ్ఘన్ క్రికెటర్లు మరణించడంపై రషీద్ ఖాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఇది అమానుషం, క్రూరత్వం అని మండిపడ్డారు. నబీ కూడా బాధ వ్యక్తం చేశారు. నిరసనగా ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు పాక్ తో జరగాల్సిన ట్రై సిరీస్ నుండి తప్పుకుంది.

New Update
Pakistan attacked Afghanistan cricketers

Pakistan attacked Afghanistan cricketers

ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ వైమానిక దాడుల్లో ముగ్గురు ఆఫ్ఘన్ దేశీయ క్రికెటర్లతో సహా మొత్తం ఎనిమిది మంది మరణించినట్లు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) వెల్లడించింది. మరో ఏడుగురు గాయపడ్డారు. పాక్తికా ప్రావిన్స్‌లోని ఉర్గున్ జిల్లాలో పాకిస్థాన్ వైమానిక దాడులు జరపగా.. ఈ విషాదం చోటుచేసుకుంది.

రషీద్ ఖాన్ షాకింగ్ రియాక్షన్ 

దాడుల్లో మరణించిన వారిలో కబీర్ ఆఘా, హరూన్, సిబ్ఘతుల్లా అనే ముగ్గురు క్రికెటర్లు ఉన్నారని ACB తెలిపింది. వీరు షరానాలో స్నేహపూర్వక మ్యాచ్ ఆడి తిరిగి వస్తుండగా, ఒకచోట ఉన్న సమయంలో ఈ దాడి జరిగింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాకిస్తాన్ ఈ 'పిరికి దాడి' చేసిందని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) ఆరోపించింది. 

 ఈ ఘోరమైన దాడులను అంతర్జాతీయ క్రికెటర్లు రషీద్ ఖాన్, మహ్మద్ నబీ తీవ్రంగా ఖండించారు. పాకిస్తాన్ దాడిపై రషీద్ ఖాన్ మాట్లాడుతూ.. ''ఆఫ్ఘనిస్తాన్ పై జరిగిన పాకిస్తాన్ వైమానిక దాడుల్లో పౌరుల ప్రాణనష్టం నన్ను తీవ్రంగా బాధించింది. ప్రపంచ వేదికపై తమ దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కలలు కన్న మహిళలు, పిల్లలు, ఆశావహ యువ క్రికెటర్ల ప్రాణాలను బలిగొన్న విషాదం ఇది. పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం పూర్తిగా అనైతికమైనది, అనాగరికమైనది.

ఈ అన్యాయమైన, చట్టవిరుద్ధమైన చర్యలు మానవ హక్కుల ఉల్లంఘన, విస్మరించకూడదు. విలువైన అమాయక ప్రాణాలను కోల్పోయిన తర్వాత, పాకిస్తాన్‌తో జరగబోయే మ్యాచ్‌ల నుండి వైదొలగాలని ACB తీసుకున్న నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో నేను మా ప్రజలతో నిలబడతాను. మన జాతీయ గౌరవం ముందుండాలి." అని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. 

అదే సమయంలో ఈ దాడిపై ఆఫ్ఘనిస్తాన్ లెజెండ్ మహ్మద్ నబీ మాట్లాడుతూ.. "ఈ సంఘటన పాక్టికాకు మాత్రమే కాదు.. మొత్తం ఆఫ్ఘన్ క్రికెట్ కుటుంబానికి, మొత్తం దేశానికి విషాదం." అని రాసుకొచ్చారు. అలాగే జట్టు ఫాస్ట్ బౌలర్ ఫహల్హాక్ ఫరూఖీ కూడా ఫేస్‌బుక్‌లో ఒక పోస్టు పెట్టారు. "ఈ అణచివేతలు అమాయక పౌరులు, మన దేశీయ క్రికెటర్లను ఊచకోత కోయడం దారుణమైన, క్షమించరాని నేరం." అని తెలిపారు. 

ఇంకా ఈ దాడిపై వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ రహ్మానుల్లా గుర్బాజ్ మాట్లాడుతూ.. "పాక్తికా ప్రావిన్స్‌లోని అర్ఘున్ జిల్లాలో మన దేశానికి చెందిన అనేక మంది ఆటగాళ్ళు క్రూరమైన శత్రువుల చేతిలో అమరులయ్యారనే వార్త మాకు చాలా బాధగా ఉంది. జన్నత్-ఉల్-ఫిర్దాస్‌లో వారికి స్థానం కల్పించాలని, సర్వశక్తిమంతుడైన దేవుడు మన దేశ శత్రువులకు గుణపాఠం నేర్పాలని నేను సర్వశక్తిమంతుడైన దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఈ పోస్ట్ పక్తికా ప్రావిన్స్‌లోని అర్ఘున్ జిల్లాలో జరిగిన సంఘటనలో మరణించిన మన దేశానికి చెందిన ఆటగాళ్లైన బాధితులకు సంతాప సందేశం" అని రాసుకొచ్చారు. 

Advertisment
తాజా కథనాలు