IND Vs PAK: భారత్ చేతిలో పాకిస్తాన్ మరో ఓటమి.. ఉతికారేసిన ఉతప్ప

టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఆసియా కప్, మహిళల వన్డే ప్రపంచ కప్ తర్వాత.. తాజాగా హాంకాంగ్ సిక్సెస్ 2025లో భారత్, పాకిస్తాన్ మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ మరోసారి పాకిస్తాన్‌ను ఓడించింది.

New Update
Hong Kong Sixes 2025

Hong Kong Sixes 2025


టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఆసియా కప్, మహిళల వన్డే ప్రపంచ కప్ తర్వాత.. తాజాగా హాంకాంగ్ సిక్సెస్ 2025లో భారత్, పాకిస్తాన్ మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ మరోసారి పాకిస్తాన్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీం ఇండియా 6 ఓవర్లకు గానూ 4 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. ఈ పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ బోల్తా పడింది. 

Hong Kong Sixes 2025

పాకిస్తాన్ 3 ఓవర్లలో 1 వికెట్‌ కోల్పోయి కేవలం 41 పరుగులు చేసింది. అయితే మ్యాచ్ సమయంలో వర్షం పడటంతో డక్‌వర్త్ లూయిస్ నియమం (DLS) ప్రకారం.. టీం ఇండియా 2 పరుగుల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించడంలో భారత్ స్టార్ బ్యాట్సమన్ రాబిన్ ఉతప్ప కీలక పాత్ర పోషించాడు. 28 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనకు ఉతప్ప ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. 

భారత్ బ్యాటింగ్

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 6 ఓవర్లలో 4 వికెట్లకు 86 పరుగులు చేసింది. రాబిన్ ఉతప్ప 11 బంతుల్లో 28 పరుగులతో జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడు 3 సిక్సర్లు, 2 ఫోర్లు బాది విధ్వంసకరంగా బ్యాటింగ్ చేశాడు. భరత్ చిప్లి 13 బంతుల్లో 24 పరుగులు చేయగా, కెప్టెన్ దినేష్ కార్తీక్ 6 బంతుల్లో 17 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక పాకిస్తాన్ తరఫున మహ్మద్ షహజాద్ ఒక ఓవర్‌లో 15 పరుగులకు 2 వికెట్లు పడగొట్టాడు.

పాకిస్తాన్ బ్యాటింగ్

పాకిస్తాన్ జట్టుకు లక్ష్యఛేదనలో మంచి ఆరంభం లభించలేదు. రెండో ఓవర్లోనే మొదటి వికెట్ కోల్పోయింది. ఖవాజా నఫే, అబ్దుస్ సమద్ తో కలిసి ఇన్నింగ్స్ ను మరింత ముందుకు తీసుకెళ్లి మూడు ఓవర్లలో 41 పరుగులు చేశారు. అప్పటికి ఖవాజా 18, సమద్ 16 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. కానీ జోరుగా వర్షం పడటంతో కొద్దిసేపటికే భారత్ ను విజేతగా ప్రకటించారు. భారత్ తరఫున బౌలింగ్ వేసిన స్టూవర్ట్ బిన్నీ ఒక ఓవర్లో నాలుగు పరుగులకు ఒక వికెట్ తీసుకున్నాడు.

2025 హాంకాంగ్ సిక్సెస్‌లో టీం ఇండియాకి ఇది మొదటి మ్యాచ్. టీమిండియా ఈ టోర్నీని తొలి విజయంతో ప్రారంభించింది. టోర్నమెంట్‌లో పాకిస్తాన్‌కి ఇది రెండవ మ్యాచ్. మొదటి మ్యాచ్ కువైట్‌తో జరిగ్గా.. అందులో 4 వికెట్ల తేడాతో పాక్ గెలిచింది. కానీ రెండవ మ్యాచ్‌లో భారతదేశం చేతిలో ఓడిపోయింది.

Advertisment
తాజా కథనాలు