Special Package: కేంద్రం నుంచి ఏపీకి మంచి బహుమతి లభిస్తుందా? అది ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ కావచ్చా?

కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువు తీరనుంది. అందులో ఏపీ నుంచి తెలుగుదేశం పార్టీ కీలకం కానున్న నేపథ్యంలో కేంద్రం ఏపీకి ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ పేరుతో వరాల వర్షం కురిపించవచ్చని అంచనా. ప్రత్యేక హోదా.. ప్రత్యేక ప్యాకేజీ ఈ రెండిటి గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు 

New Update
Special Package: కేంద్రం నుంచి ఏపీకి మంచి బహుమతి లభిస్తుందా? అది ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ కావచ్చా?

Special Package: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బిజెపి ఢిల్లీ, దాని పాలిత రాష్ట్రాలు, కూటమి భాగస్వామ్య పక్షాలతో హడావిడిగా సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా వివిధ ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఎన్డీయే లోని మిత్రపక్షాలు చేస్తున్న డిమాండ్ల గురించి రాజకీయ వర్గాల్లో విపరీతంగా చర్చ నడుస్తోంది. బీజేపీ మిత్రపక్షాల్లో ముఖ్యంగా జనతాదళ్ యునైటెడ్ - జెడి(యు) అదేవిధంగా తెలుగుదేశం పార్టీ (టిడిపి) ముందుకు తెచ్చే ఆ డిమాండ్ 'ప్రత్యేక వర్గం హోదా' (SCS) కావచ్చని అంచనాలు వేస్తున్నారు. అయితే, ఇప్పటికే ఈ స్పెషల్ స్టేటస్ అంశం గత పదేళ్లుగా చాలాసార్లు ప్రస్తావనకు వచ్చింది. అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం బీహార్, ఏపీలకు స్పెషల్ స్టేటస్ ముగిసిన అంశం అని ఎప్పటికప్పుడు చెబుతూ వచ్చింది. అయితే, ఏపీకి స్పెషల్ స్టేటస్ బదులుగా స్పెషల్ ఆర్ధిక ప్యాకేజీ ఇస్తామని చెప్పింది.  అసలు SCS అంటే ఏమిటి, రాష్ట్రానికి ఈ హోదా ఎలా లభిస్తుంది? దాని ప్రయోజనాలు ఏమిటి? ఒకసారి చూద్దాము.

ప్రత్యేక కేటగిరీ హోదా (SCS) అంటే ఏమిటి?

  • ఏదైనా రాష్ట్రం వెనుకబడి ఉంటే దానిని అభివృద్ధి బాటలోకి తీసుకురావడం కోసం ప్రత్యేక కేటగిరీ హోదా (SCS) కేటాయిస్తారు. 
  • ఆ రాష్రాలు భౌగోళిక, సామాజిక-ఆర్థిక ప్రతికూలతలను ఎదుర్కొంటే వారి వృద్ధి రేటును పెంచడం కోసం హోదా ఇస్తారు. 
  • రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి రాజ్యాంగంలో ప్రత్యేక హోదాను కేటాయించే నిబంధన ఏదీ లేనప్పటికీ, 1969లో ఐదవ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ప్రత్యేక కేటగిరీ హోదాను ప్రదానం చేసేందుకు తర్వాత నిబంధనను రూపొందించారు.

ఏ రాష్ట్రాలు మొదటిసారిగా ప్రత్యేక హోదా పొందాయి?  

  • జమ్మూ కాశ్మీర్ (ప్రస్తుతం ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్ర పాలిత ప్రాంతం), అస్సాం - నాగాలాండ్‌లు 1969లో ప్రత్యేక హోదా పొందిన మొదటివి.
  • తర్వాత, అస్సాం, నాగాలాండ్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, సిక్కిం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, ఉత్తరాఖండ్ - తెలంగాణతో సహా పదకొండు రాష్ట్రాలు ప్రత్యేక కేటగిరీ రాష్ట్ర హోదాను పొందాయి.
  • 2014 ఫిబ్రవరి 18న అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వంలో పార్లమెంటు బిల్లును ఆమోదించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయిన తర్వాత తెలంగాణకు ప్రత్యేక హోదా ట్యాగ్ వచ్చింది.
  • 14వ ఆర్థిక సంఘం ఈశాన్య - మూడు కొండ రాష్ట్రాలు మినహా రాష్ట్రాలకు 'ప్రత్యేక కేటగిరీ హోదా'ను రద్దు చేసింది.  పన్నుల పంపిణీ ద్వారా అటువంటి రాష్ట్రాల్లో వనరుల అంతరాన్ని 32% నుండి 42%కి పెంచాలని సూచించింది.
  • ప్రత్యేక కేటగిరీ రాష్ట్రం, శాసనసభ, రాజకీయ హక్కులను పెంచే ప్రత్యేక హోదాకు భిన్నంగా ఉంటుంది. SCS అనేది ఆర్థిక అంశాలతో మాత్రమే వ్యవహరిస్తుంది.

ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాన్ని పొందడానికి ఏ రాష్ట్రానికైనా ఉండాల్సి పరిస్థితులు ఏమిటి అనేది చూద్దాం..  

  • ఒక రాష్ట్రం కొండ భూభాగాన్ని కలిగి ఉంటే 
  • తక్కువ జనాభా సాంద్రత లేదా గిరిజన జనాభాలో గణనీయమైన వాటా కలిగి ఉంటే.. 
  • పొరుగు దేశాలతో సరిహద్దుల వెంట వ్యూహాత్మక స్థానం ఉంటే.. 
  • ఆర్థికంగా, మౌలిక సదుపాయాల్లో రాష్ట్రం వెనుకబడి ఉన్నట్లయితే.. 
  • రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ.. అసమంజసమైన స్వభావం కలిగి ఉన్నట్లయితే.. ఆ రాష్ట్రాలకు స్పెషల్ స్టేటస్ హోదా కల్పిస్తారు. 

ప్రత్యేక కేటగిరీ హోదా వల్ల ప్రయోజనాలు?
ఒక రాష్ట్రానికి 'ప్రత్యేక కేటగిరీ హోదా' లభిస్తే, ఇతర రాష్ట్రాలలో 60 శాతం లేదా 75 శాతంతో పోలిస్తే కేంద్ర ప్రాయోజిత పథకాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులను ఇవ్వాలి. మిగిలిన నిధులు రాష్ట్ర మద్దతుతో ఉంటాయి.

  • కస్టమ్స్, ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్నుతో సహా పన్నులు, సుంకాలలో రాష్ట్రం గణనీయమైన రాయితీలను కూడా పొందుతుంది.
  • కేంద్రం స్థూల బడ్జెట్‌లో 30 శాతం భాగం ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు వెళుతుంది.

ఆంధ్ర ప్రదేశ్ విషయంలో ఏం జరిగింది?
Special Package: రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి స్పెషల్ స్టేటస్ హోదా కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అయితే, తరువాత కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ప్రత్యేక హోదాను ఇవ్వడానికి నిరాకరించింది. అయితే, అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చింది. ఏపీతో పాటు మరో మూడు రాష్ట్రాలు (గోవా, మణిపూర్, నాగాలాండ్) కూడా స్పెషల్ స్టేటస్ కోసం పట్టుపట్టాయి. అప్పుడు ఈ నాలుగు రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ ఇస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. 

Also Read:  పవన్ కళ్యాణ్ అంటే పవనం కాదు.. ఒక సునామీ.. మోదీ పవర్ ఫుల్ డైలాగ్స్..!

ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ..
Special Package: విభజన చట్టంలోని సెక్షన్‌ 46(2), 46(3), 94(2)ల్లో ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ హామీని పొందుపరిచారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలు కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం అలాగే ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని బిల్లులో ఇస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. అప్పుడు ఏపీలోని టీడీపీ ప్రభుత్వం మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ లోను బుందేల్ ఖండ్ కోసం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీ తరహాలో ఉన్నట్టుగా ఏపీలోని 7 జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కింద 24,350 కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రణాళికా సంఘానికి నివేదిక ఇచ్చింది. అయితే, నీటి ఆయోగ్ సిఫారసుల ప్రకారం ఒక్కో జిల్లాకు 50 కోట్ల రూపాయల చొప్పున ఏడేళ్ల పాటు మొత్తం 350 రూపాయల మేర మొత్తం రూ.1,750 కోట్లను ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీగా ఇచ్చింది. అయితే, బుందేల్ ఖండ్ ప్యాకేజీ కింద తలసరి లెక్కలో 4,115 కోట్లను కేటాయించిన కేంద్రం.. ఏపీకి మాత్రం 426 కోట్ల రూపాయలను మాత్రమే ఇచ్చింది. 

ఇప్పుడు ఏమి జరగవచ్చు..
Special Package: కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో బీజేపీ తరువాత ఎక్కువ సీట్లు ఏపీ నుంచి టీడీపీ, జనసేన పార్టీలవే (18) ఉన్నాయి. దీంతో ఏపీ మద్దతు బీజేపీకి చాలా అవసరం. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా నిధులను ఏపీకి కేటాయించే అవకాశం కనిపిస్తోంది. అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోరినట్టుగా బుందేల్ ఖండ్ ప్యాకేజీ తరహాలో ప్యాకేజీ ఇచ్చే అవకాశం ఉంది. కచ్చితంగా ఏపీ మంచి బహుమతిని కేంద్రం నుంచి అందుకోవడం ఖాయం అనే అంచనాలు ఉన్నాయి. రాజధాని, పోలవరం ప్రాజెక్టులకు కూడా కేంద్రం నుంచి మద్దతు లభించే పరిస్థితి కనిపిస్తోంది. వీటికి ప్రత్యేకంగా ప్యాకేజీని ప్రకటించే అవకాశం ఉంది. ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే ఏపీకి అద్భుతమైన బహుమతి దొరకడం గ్యారెంటీ అని రాజకీయ పరిశీలకులు అంచనాలు వేస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు