Telangana: పదేళ్ల తెలంగాణ.. ఉద్యమ ఆకాంక్ష నెరవేరిందా?

తెలంగాణ అంటేనే ఉద్యమ దిక్సూచి. మరి అన్నివర్గాల కృషి ఫలితంగా సాధించుకున్న స్వరాష్ర్టంలో ఆశలు, ఆకాంక్షలు నెరవేరాయా? పదేండ్లకాలంలో తెలంగాణ సాధించిన ప్రగతి ఏంటీ? సాధించాల్సిందేంటీ? తెలుసుకునేందుకు సీనియర్ జర్నలిస్ట్ మధుకర్‌ వైద్యుల రాసిన ఆర్టికల్ లోకి వెళ్లండి.

Telangana: పదేళ్ల తెలంగాణ.. ఉద్యమ ఆకాంక్ష నెరవేరిందా?
New Update

Telangana formation day: తెలంగాణ అంటేనే ఉద్యమ దిక్సూచి. అది తెలంగాణ సాయుధ పోరాటమైనా, ప్రజా ఉద్యమాలైనా, నిన్నమొన్నటి ప్రత్యేక రాష్ర్ట సాధన ఉద్యమమైనా తెలంగాణకు ప్రత్యేకమైనవి. జగిత్యాల జైత్రయాత్ర మొదలు మిలియన్ మార్చ్ వరకు ప్రతి సందర్భంలోనూ ఇక్కడి ప్రజలు తమ ఉద్యమ స్ఫూర్తిని ప్రదర్శించారు. ప్రతిపోరాటంలోనూ పీడిత,తాడిత వర్గాలతోపాటు విద్యార్థులు, విద్యావంతులు, రైతులు, మేధావుల, కళాకారుల పాత్ర వెలకట్టలేనిది. మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ ఆయా వర్గాలు అదే లక్ష్యంతో కృషి చేశాయి. అన్నివర్గాల కృషి ఫలితంగా సాధించుకున్న స్వరాష్ర్టంలో అన్ని వర్గాల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాయా? పదేండ్లకాలంలో తెలంగాణ సాధించిన ప్రగతి ఏంటీ? సాధించాల్సిందేంటీ?

భాషా ప్రాతిపదికన ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్‌..
నిజాం పాలన నుంచి విముక్తి పొందిన తర్వాత భాషా ప్రాతిపదికన 1956లో ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణను కలిపారు. సుదీర్ఘ కాలంగా ప్రత్యేక రాష్ట్రసాధన కోసం తెలంగాణ ప్రాంతంలో ఉద్యమం సాగింది. ప్రజల మధ్య చారిత్రక, రాజకీయ, ఆర్ధిక, సాంస్కృతిక అసమానతలు, విభేదాలు, వివిధ ప్రాంతాల మధ్య నెలకొన్న భావోద్వేగాలు ఈ ఉద్యమానికి ఊపిరిలూదుతూ వచ్చాయి.ఆంధ్రప్రదేశ్ గా అర్ధ శతాబ్దం పాటు ఒక రాష్ట్రంగా కలిసి ఉన్నప్పటికీ, తెలుగు మాట్లాడే ప్రజల మధ్య సామాజికంగా, సాంస్కృతికంగా, భావోద్వేగాల పరంగా ఐక్యత ఏర్పడలేదు. ఒక్క తెలంగాణలోనే కాదు. రాయలసీమ ప్రాంతంలో కూడా ఈ పరిస్థితి నేటికి కనిపిస్తుంది.

విభేదాల మూలంగా తెలంగాణ ఉద్యమం..
భావోద్వేగాల మధ్య వచ్చిన విభేదాల మూలంగా తెలంగాణ ఉద్యమం ఊపరిపోసుకుంది. 1956లో అంధ్రప్రదేశ్ ఏర్పాటు సమయంలోనే వ్యతిరేకత వినిపించినప్పటికీ 1960 నాటి ఉద్యమం, 1990 తర్వాత వచ్చిన మలిదశ ఉద్యమం తెలంగాణ ఏర్పాటులో కీలక దశలు.అధికారంలో సరైన వాటా ఇవ్వకపోవడం, నిధుల కేటాయింపులో వివక్ష, ప్రాంతీయ వెనకబాటుతనం ఈ మూడు అంశాలు తెలంగాణ ఉద్యమానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం ఏర్పాటు సమయంలోనే దీనిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ''తెలంగాణ ప్రజల భయం ఏంటంటే...వారు ఆంధ్రాలో కలిసిపోయినా, ఆంధ్రులతో సరిసమానంగా వారు హక్కులను అనుభవించలేరు. ఈ ఒప్పందంలో ఆంధ్రులు తమ ప్రయోజనాలను సత్వరమే అందిపుచ్చుకుంటారు. చివరకు తెలంగాణ కోస్తాంధ్రులకు కాలనీగా మారిపోతుంది'' అని (పేజీ 105) ఎస్ఆర్‌సీ పేర్కొంది.

మలిదశ ఉద్యమం నీళ్లు,నిధులు, నియమకాలు అనే ప్రతిపాదికపై సాగింది. తెలంగాణ ఉద్యమం ప్రజాచైతనం, రాజకీయ చైతన్యం అనే రెండు అంశాల ఆధారంగా సాగింది. ఉద్యమ నేపథ్యంతో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) ప్రధాన రాజకీయ పార్టీగా ఆవిర్భవించగా, తెలంగాణ ప్రజలను చైతన్యపరచడంలో ప్రజాసంఘాలు కీలక పాత్ర పోషించాయి. రాష్ట్రం ఏర్పడి నేటికి పదేండ్లు పూర్తయ్యాయి. ఈ దశాబ్ధ కాలంలో తెలంగాణ ప్రజల ఆశలు నెరవేరాయా? ఉద్యమ ప్రాథమిక లక్ష్యాలు సాధించగలిగిందా? అన్నది ప్రధానంగా చర్చించాల్సిన అంశం.

తెలంగాణ ఉద్యమం యావత్తు సాంస్కృతిక నేపథ్యంగా సాగింది. తెలంగాణ ఉద్యమం అంతా పాటలు, కథలతో సాగింది. తెలంగాణ సాంస్కృతిక వైభవానికి బోనాలు, బతుకమ్మ పండుగలు ప్రతీకలుగా నిలిచాయి. ఉద్యమ ఫలితంగా సరిగ్గా ఇదే రోజున అంటే 2014 జూన్‌ 2న దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. భాషా ప్రాతిపదికన 1956లో ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్‌లో ఒకప్పుడు భాగంగా ఉన్న తెలంగాణ 58 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయింది.తొలిసారి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ర్ట సమితి రాష్ర్టంలో అధికారాన్ని చేపట్టింది.

ప్రధానంగా సాగునీరు మీదే..
తెలంగాణ ఉద్యమం ప్రధానంగా సాగునీరు మీదే సాగింది కనుక టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో సాగునీటి సౌకర్యాలను పెంపోదించేందుకు తెలంగాణ ప్రభుత్వం 'మిషన్‌ కాకతీయ'లాంటి ఇరిగేషన్‌ స్కీమ్‌లను ప్రారంభించింది. చెరువుల మీద ఆధారపడే వ్యవసాయానికి దన్నుగా నిలిచే క్రమంలో గ్రామీణ చెరువులను పూడిక తీయించడం, బాగు చేయించడంలాంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టింది. వ్యవసాయ ఉత్పత్తులలో భారీ పెరుగుదల రూపంలో వీటి ఫలాలు కనిపించాయి. రైతుబంధు, రైతుబీమాలాంటి పథకాలు అన్నదాతలకు ఊతమిచ్చాయి.ఒకవైపు వ్యవసాయరంగానికి వెన్నుదన్నుగా నిలుస్తూనే మౌలిక సదుపాయాల విస్తరణపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. హైదరాబాద్‌ నగరం ఐటీ రంగానికి వెన్నెముక కాగా, వీటితోపాటు ఫార్మా, టెక్స్‌టైల్‌ సిటీలు పారిశ్రామికాభివృద్ధికి చోదకాలుగా మారాయి. అయితే ఉద్యమ సమయంలో ఉపాధి అవకాశాలపై యువత పెట్టుకున్న అంచనాలకు తగ్గట్టు ఉపాధి కల్పన జరగలేదన్నది ఆయా రంగాల్లో ఉన్న ఉద్యోగార్థుల ఆరోపణ.

అనేక రకాల లోపాలు..
పాలనను వికేంద్రీకరణలో భాగంగా 10 జిల్లాలను తెలంగాణ ప్రభుత్వం 33 జిల్లాలుగా విభజించింది. కొత్త జిల్లాలు, మండలాలు, పంచాయతీలను ఏర్పాటు చేసి పాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. జిల్లా కేంద్రాల్లో సమీకృత కలెక్టరేట్లు, పోలీసు కార్యాలయాలను, ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులను నిర్మించింది. ఇక రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాల యాన్ని ఆధునిక హంగులతో నిర్మించింది. ఏడు నూతన పోలీస్‌ కమిషనరేట్లతో పాటు పోలీస్ స్టేషన్లను ఆధునీకరించింది. రాజధాని నగరంలో పోలీస్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేసింది. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి తో ఆయా మెరుగైన ఫలితాలను తీసుకొచ్చింది.ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం వంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించింది.అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అనేక అవకతవకలు జరిగాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తూనే వచ్చాయి. మొన్నటి ప్రాదేశిక ఎన్నికల సమయంలో మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడం ఆ ప్రాజెక్టు లోపాలను ఎత్తిచూపింది. తెలంగాణ వచ్చిన తర్వాత వైద్యరంగం చాలా వరకు మెరుగుపడింది. తెలంగాణ వచ్చేనాటికి 5 మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉండగా, రాష్ట్రం ఏర్పాటు ప్రతి జిల్లా కేంద్రంలోనూ మేడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేసింది. అలాగే పల్లె దవాఖాన, బస్తీ దవాఖానాల పేరుతో వైద్యాన్ని ప్రజల చెంతకు చేర్చింది. పదేండ్ల తెలంగాణలో మొన్నటివరకు కేసీఆర్‌ నేతృత్వంలో పాలన కొనసాగింది. వారి పాలనలో అనేక రంగాల్లో పురోగతి సాధించినప్పటికీ ఆయా రంగాల్లో అవినీతి జరిగిందనే ఆరోపణలు తీవ్రంగా వచ్చాయి. అనేక పథకాలు ప్రజలకు చేరువయినప్పటికీ ఆయా రంగాల్లో అనేక రకాల లోపాలున్నాయన్నది ప్రధాన ఆరోపణ. అదే బీఆర్‌ఎస్‌ను అధికారానికి దూరం చేసిందన్న ప్రచారం ఉంది.

ఇక ఉద్యమంలో రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాలు ప్రధాన భూమిక పోషించాయి. కానీ రాష్ట్ర సాధనతర్వాత ఆయా సంఘాలను కేసీఆర్ పక్కన పెట్టారనే ఆరోపణ ఉంది. ఆయా రంగాలకు చెందిన మేధావులు, విద్యావంతులు, సాంస్కృతిక సంఘాలు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాయి. అయితే రాష్ర్ట ఏర్పాటు తర్వాత వాటికి తగిన గుర్తింపు దక్కలేదన్నది ప్రధాన ఆరోపణ. దానితో ఆయా సంఘాలు ప్రభుత్వానికి దూరమయ్యాయి. స్వాతంత్ర తెలంగాణ రాష్ర్టంలో ప్రజాసంఘాల ఆశలు నెరవేరుతాయనుకుంటే అవన్ని అడి ఆశలయ్యాయి. ఇక ఉద్యమ పార్టీగా ఉద్యమాన్ని నడిపిన టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫక్తు రాజకీయ పార్టీగా రూపాంతరం చెందడంతో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో కలుపుకొవడంతో ప్రతిపక్షాల పాత్ర లేకుండా పోయింది. దీంతో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే రాజకీయ పార్టీ కరువైంది.

నీళ్లు, నిధులు, నియమకాల ప్రతిపాదికన జరిగిన ఉద్యమంలో నీళ్లకోసం కట్టిన ప్రాజెక్టుల్లో అవినీతి మూలంగానే ప్రాజెక్టులు కుప్పకూలే పరిస్థితి వచ్చిందన్నది నేటి పాలకు ప్రధాన ఆరోపణ. ఇక నిధుల వినియోగంలోనూ తెలంగాణ ప్రజానీకానికంతటికి సమాన పంపిణీ జరగలేదన్నది కూడా ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఇక నియమకాల విషయంలోనూ గత ప్రభుత్వం తొలి ఐదేండ్లు పూర్తి నిర్లక్షంగా వ్యవహరించిందనే ఆరోపణలు ఉన్నాయి. తరువాతి కాలంలో ఎన్నికల సమయంలో ఉద్యోగ నోటిఫికేషన్లు వేసినప్పటికీ పేపర్‌ లీకుల పేరుతో జరిగిన పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఉద్యోగ కల్పనలో విఫలమైందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ మూడు అంశాల్లో నెలకొన్న లోటుపాట్లే బీఆర్‌ఎస్ ను అధికారానికి దూరం చేశాయన్నది అన్ని వర్గాల అభిప్రాయం.

ఇక మొన్నటి ఎన్నికల్లో అనేక అంశాల్లో హామీలిచ్చి ధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆయా హామీలను నిలబెట్టుకోవడంలో తడబడుతోంది. మహిళలకు ఉచితబస్సు, 500 వందలకే గ్యాస్‌, ఉచిత విద్యుత్ వంటి అంశాల్లో కొంత వరకు మెరుగైన ఫలితాలు సాధించినప్పటికీ రైతుబంధు (భరోసా), సాగునీటి సరఫరా, రుణమాఫీ, ఉద్యోగ కల్పన వంటి అంశాల్లో ముందడుగు పడాల్సి ఉంది. ఒకవైప ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం రాష్ర్ట లోగోమార్పు, విగ్రహాల మార్పు, గీతం ఏర్పాటు వంటి అంశాల్లో తలదూర్చి అబాసుపాలవుతోంది. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇలాంటి చిన్నచిన్న విషయాలకు ప్రాధాన్యతనిస్తూ ముఖ్యమైన విషయాలను విస్మరించడం వల్ల గత ప్రభుత్వపు తప్పిదాల మార్గంలోనే నడిచే ప్రమాదం ఉంది. తన పాలన మార్కును ప్రదర్శించాలంటే గతంలోని లోపాలను బేరీజు వేసుకొని మంచిదైన పాలనను అందించాలి. అప్పుడే ప్రజలు హర్షిస్తారు. ఆనందిస్తారు. మరోసారి అవకాశం ఇస్తారు.

పద్నాలుగేళ్ల మలిదశ ఉద్యమంలో ప్రజలు ఆశించిన తెలంగాణ ఇంకా సాకారం కాలేదన్నది అన్ని వర్గాల అభిప్రాయం. రాష్ర్టంలో విద్య, వైద్య, ఉద్యోగ కల్పన రంగాల్లో పురోగతి సాధించాల్సి ఉంది. ముఖ్యంగా వ్యవసాయరంగానికి ఊతమిచ్చే నీటిపారుదల రంగాన్ని మెరుగుపరచి అన్నదాతలను ఆదుకోవాలి. ఉద్యమకాంలో ఇచ్చిన హామీలు, చేసిన పనులు, ప్రజల ఆకాంక్షలు, లక్ష్యాలను మరోసారి అవలోకనం చేసుకోవడం ద్వారా ఆయా రంగాల్లో పురోగతి సాధించినప్పుడే సాధించుకున్న తెలంగాణకు సార్థకత లభిస్తుంది. ఆ దిశగా అడుగులు పడాల్సి ఉంది. పాలకులను సన్మార్గంలో నడిపించడానికి ఆయా రంగాలకు చెందిన మేధావులు, విద్యావంతులు, సాంస్కృతిక సంఘాలు, సామాజిక సంస్థలు తమదైన పాత్రను పోషించాల్సి ఉంది.

(తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా)
-మధుకర్‌ వైద్యుల, సీనియర్ జర్నలిస్ట్

#10-years-of-telangana #special-article
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe