దీపావళి పండుగ అంటే కేవలం దీపాల వెలుగులే కాదు క్రాకర్స్ మోత కూడా ఉంటుంది. నిశ్శబ్దంగా ఈ వేడుకను జరుపుకోవడం అసాధ్యం. కానీ తమిళనాడులోని ఓ ఏడు గ్రామాల్లో మాత్రం నిశ్శబ్దంగా పండుగను చేసుకుంటారు. ఇక్కడి స్థానికులు కేవలం దీపాలకు మాత్రమే పరిమితమైపోతారు. ఎందుకంటే దీనికి కూడా ఓ కారణం ఉంది. అదేంటంటే ఈ గ్రామాలకు సమీపంలోని ఓ పక్షుల కేంద్రం ఉంది. వివిధ దేశాల నుంచి వలస వచ్చే పక్షులుకు టపాసుల మోతతో వాటికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా చేసేందుకే ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇది ఈసారి మాత్రమే కాదు. గత 22 సంవత్సరాల నుంచి ఈ పద్ధతినే పాటిస్తున్నారు.
Also Read: మొబైల్ నెంబర్ తో మీ ఓటర్ ఐడీ తెలుసుకోవచ్చు.. ఇలా చెక్ చేయండి..
ఈరోడ్ అనే జిల్లాలోని సెల్లప్పంపాళయం, వడముగమ్ వెల్లోడ్, సెమ్మందంపాళయం, కరుక్కనకట్టు వాలాసు, తదితర ఏడు గ్రామాలు పక్షుల సంరక్షణ కేంద్రానికి దగ్గర్లో ఉంటాయి. అక్టోబరు నుంచి జనవరి మధ్య కాలంలో దేశవిదేశాలకు చెందిన వేలాది పక్షులు ఇక్కడ ఉన్న సంరక్షణ కేంద్రానికి వలస వచ్చి, గుడ్లు పెట్టి పొదుగుతాయి. అందుకే పక్షులకు అనువైన వాతావరణం కల్పించడానికి.. వాటిని భయపెట్టకుండా ఉండేందుకు బాణాసంచాలు కాల్చరు. పక్షుల కేంద్రానికి చుట్టుపక్కల నివసించే దాదాపు 900 లకుపైగా కుటుంబాలు బాణసంచా పేల్చొద్దని నిర్ణయం తీసుకున్నాయి. గత 22 ఏళ్లుగా వీళ్లు ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు. దీపావళికి ఇక్కడి కుటుంబాలు తమ పిల్లలకు కొత్త బట్టలు కొనివ్వడమేకాక.. టపాకాయలకు బదులుగా కాకరపువ్వొత్తుల వంటి వాటిని మాత్రమే కాల్చేందుకు అనుమతిస్తారు. ఈ ఏడాది కూడా ఇక్కడి గ్రామస్థులు తమదైన రీతిలో దీపావళిని ఆనందంగా చేసుకుని తమ ‘నిశ్శబ్ద’ సంప్రదాయాన్ని కొనసాగించారు.