ఒక దేశం అభివృద్ధికి.ప్రజల సంక్షేమ కార్యక్రమాలకు పన్నులు ప్రధాన ఆదాయ వనరు.కానీ మన పొరుగు దేశం పాకిస్థాన్‌లో మాత్రం ఆదాయపు పన్ను కట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పాకిస్థాన్ ప్రజలు ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయకపోవడం ఆ దేశ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. దీన్ని చక్కదిద్దేందుకు పాక్ ప్రభుత్వం కొత్త వ్యూహాన్ని అనుసరించింది.
పాకిస్తాన్‌లోని ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్‌లో ప్రచురితమైన నివేదికల ప్రకారం, ఆదాయపు పన్ను రిటర్న్‌లను సకాలంలో దాఖలు చేయని వ్యక్తుల సిమ్ కార్డులను పాకిస్తాన్ ప్రభుత్వం బ్లాక్ చేస్తున్నట్లు వెల్లడైంది. ఇంకా ఇన్ కమ్ ట్యాక్స్ ఫైల్ చేయని 3,500 మంది సిమ్ కార్డులను బ్లాక్ చేసినట్లు తెలిపింది. 2023 సంవత్సరానికి ఐదు లక్షల మంది ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేసేలా ప్రభుత్వం ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వ రెవెన్యూ బోర్డు 5,000 మందికి SMS హెచ్చరికను కూడా జారీ చేసింది. మీరు మీ సిమ్ కార్డును ఉపయోగించడం కొనసాగించాల్సిన అవసరం ఉంటే, ఆదాయపు పన్ను రిటర్న్‌లను సరిగ్గా ఫైల్ చేయండి' అని హెచ్చరిక సందేశాన్ని పంపుతున్నట్లు కూడా పేర్కొంది.
దీనికి సంబంధించి పాకిస్థాన్‌లో పనిచేస్తున్న టెలికాం కంపెనీలు సమావేశం నిర్వహించి ఇప్పటి వరకు ఎంతమంది సిమ్‌కార్డులు డిజేబుల్ అయ్యాయో ఆ దేశ రెవెన్యూ బోర్డుకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. అలాగే పన్నులు సరిగా చెల్లించని వారి మొబైల్ బ్యాలెన్స్ నుంచి కట్ చేస్తామని పాకిస్థాన్ ప్రభుత్వం హెచ్చరించింది. ఆదాయపు పన్నును దాఖలు చేయని కారణంగా సిమ్ కార్డ్ డిసేబుల్ అయిన వ్యక్తులు కొత్త సిమ్ కార్డును కొనుగోలు చేయడానికి 90% అదనపు పన్ను చెల్లించాలని కూడా ఒక నియమం ప్రవేశపెట్టింది.
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేస్తే వారి సిమ్ కార్డులు ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతాయని ఆ దేశ రెవెన్యూ బోర్డు తెలిపింది. మార్చి 1వ తేదీ వరకు పాకిస్థాన్‌లో దాదాపు 42 లక్షల మంది తమ ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేశారు. కానీ 2022లో ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసిన వారి సంఖ్య 59 లక్షలు. ప్రజలు ఏటా ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పడం ద్వారా పన్ను దాఖలును పెంచేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్.. దీంతో నిత్యావసర వస్తువులను కూడా దిగుమతి చేసుకోలేని పరిస్థితి నెలకొంది. ద్రవ్యోల్బణం కూడా చాలా రెట్లు పెరిగింది.