Dorababu Pendem: ఎన్నికల్లో ఓటమితో నిరాశతో ఉన్న మాజీ సీఎం జగన్ కు మరో షాక్ తగిలింది. ఈరోజు వైసీపీకి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే తన రాజీనామాపై అనుచరులకు పెండెం దొరబాబు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నట్లు తెలుస్తోంది. కాగా గత కొన్ని రోజులుగా ఆయన పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ప్రచారం జరగగా.. తాజాగా ఆ ప్రచారానికి తెర దింపారు దొరబాబు.
టికెట్ రాకపోవడంతో…
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 175 కి 175 స్థానాల్లో విజయం సాధించాలని బరిలోకి దిగిన జగన్.. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే.. జగన్ తీసుకున్న ఆ నిర్ణయం ఆయనను కేవలం 11 సీట్లను పరిమితం చేసిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇదే తరహాలో పిఠాపురం నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దొరబాబుకు కాకుండా వంగ గీతకు టికెట్ ఇచ్చారు జగన్. దీంతో ఆ నాడు నుంచి దొరబాబు పార్టీపై అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందడంతో తాజాగా ఆయన ఆ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. త్వరలో జనసేనలో చేరనున్నారు. కాగా ఏ రోజు చేరుతారనే క్లారిటీ మాత్రం దొరబాబు ఇంకా ఇవ్వలేదు.
Also Read : అమరావతి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం