Visakha SaradaPeetham: శారదాపీఠంలో అక్షర పండుగ.. మూలా నక్షత్రం సందర్భంగా పోటెత్తిన భక్తులు

భారతావనిలో శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు కొలువుదీరిన ఏకైక క్షేత్రం విశాఖ శ్రీ శారదాపీఠమేనని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి స్పష్టం చేశారు.

New Update
Visakha SaradaPeetham: శారదాపీఠంలో అక్షర పండుగ.. మూలా నక్షత్రం సందర్భంగా పోటెత్తిన భక్తులు

భారతావనిలో శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు కొలువుదీరిన ఏకైక క్షేత్రం విశాఖ శ్రీ శారదాపీఠమేనని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి స్పష్టం చేశారు. తమ పీఠంలో విరాజిల్లుతున్న అమ్మవారిని ఆరాధించి ఎందరో ఉన్నత స్థాయికి చేరారని తెలిపారు. ముఖ్యమంత్రుల నుంచి సామాన్యుల వరకు ఎంతోమంది రాజశ్యామల అనుగ్రహం పొందారని, కృతజ్ఞతగా పీఠానికి భక్తులుగా మారారని అన్నారు. శుక్రవారం మూలా నక్షత్రం సందర్భంగా చినముషిడివాడలోని పీఠ ప్రాంగణంలో నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాసాలకు విశేష స్పందన లభించింది. అక్షరాభ్యాసాలు, సరస్వతీ పూజకు పెద్ద ఎత్తున హాజరైన భక్తులనుద్దేశించి స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడారు.

ఇది కూడా చదవండి: మహిళ ప్రాణం తీసిన వివాహేతర సంబంధం…ఆఫీస్ లోనే హత్య చేసిన వ్యక్తి

పూర్వకాలం తరహాలోనే శాస్త్రీయంగా అక్షరాభ్యాసాలు, సరస్వతీ పూజలను తమ పీఠంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆలయాల్లో కన్నా పీఠ ప్రాంగణాల్లో ఈ పూజలు జరిపించుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయని వివరించారు. పీఠాల్లో అక్షరాభ్యాసాలు, సరస్వతీ పూజలు నిర్వహించడానికి ముహూర్తంతో పని లేదని, ఏ సమయంలోనైనా జరిపించవచ్చని స్పష్టం చేశారు. శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి అనుగ్రహంతో మేధావులు పెరగాలని, పిల్లల్లో విజ్ఞానం నిండి నిబిడీకృతం కావాలని స్వరూపానందేంద్రస్వామి ఆకాంక్షించారు. మూలా నక్షత్రం సందర్భంగా 784 మంది పిల్లలు సామూహిక అక్షరాభ్యాసాల్లో 432 మంది విద్యార్ధినీ విద్యార్ధులు సరస్వతీ పూజల్లో  పాల్గొన్నారు. పూజల్లో పాల్గొన్న బాల బాలికలకు రాజశ్యామల సన్నిధిలో పూజలందుకున్న పుస్తకాలను, పెన్నులను విశాఖ శ్రీ శారదాపీఠం బహుకరించింది.

సరస్వతీ మాత అవతారంలో రాజశ్యామల
శరన్నవరాత్రి ఉత్సవాలలో శుక్రవారం రాజశ్యామల అమ్మవారు సరస్వతీ దేవి అవతారంలో దర్శనమిచ్చారు. గోపూజ చేసి దేవతామూర్తుల ఆలయాలను సందర్శించిన అనంతరం సరస్వతీ దేవి అలంకరణకు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోపక్క లోక కళ్యాణార్ధం చేపట్టిన రాజశ్యామల యాగం కొనసాగింది. దేవీ భాగవత పారాయణ, నవావరణార్చన, సాంస్కృతిక ఆరాధన తదితర కార్యక్రమాలను యథావిధిగా నిర్వహించారు. పండిత రత్న డాక్టర్ ప్రభాకర కృష్ణమూర్తి శబరి వృత్తాంతంపై ప్రవచనం చేశారు.

Advertisment
తాజా కథనాలు