Shake Hand : ఏమండోయ్.. వింటున్నారా? ఒక్క షేక్ హ్యాండ్ మన అనారోగ్యాన్ని చెప్పేస్తుంది!

పూర్వం నాడి చూసి రోగం చెప్పేసేవారు వైద్యులు. ఇప్పుడు షేక్ హ్యాండ్ తో మన అనారోగ్యాన్ని చెప్పేసే వీలుందని చెబుతున్నాయి తాజా పరిశోధనలు. గుండె జబ్బులు.. చిత్తవైకల్యం.. కాలేయ వ్యాధులు ఇలా గుర్తించవచ్చట. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో ఉన్నాయి. 

Shake Hand : ఏమండోయ్.. వింటున్నారా? ఒక్క షేక్ హ్యాండ్ మన అనారోగ్యాన్ని చెప్పేస్తుంది!
New Update

Shake Hand : మీరు పాత సినిమాలు అంటే బ్లాక్ అండ్ వైట్ లో వచ్చినవి చూశారా? ఆ సినిమాల్లో హీరోయిన్ కళ్ళు తిరిగి పడిపోతుంది. వెంటనే ఒక డాక్టర్ పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చిన వెంటనే ఆమె చేయి పట్టుకుని ఒక నిమిషం కళ్ళు మూసుకుని తల ఊపుతూ చూస్తాడు. తరువాత మెల్లగా కళ్ళు తెరుస్తాడు. భయపడాల్సింది ఏమీ లేదు.. ఈమె గర్భవతి అని శుభవార్త చెబుతాడు. ఇలాంటి సీన్స్ పాత సినిమాలు చూసినవారు చాలా చూసి ఉంటారు. అంతేకాదు.. అప్పట్లో వైద్యులు ఇలా చేయి పట్టుకుని.. సరిగ్గా చెప్పాలంటే నాడి చూసి రోగం చెప్పేసేవారు. ఇప్పటి తరానికి నాడి చూడటం అంటే పల్స్ చెక్ చేస్తున్నారు అనే తెలుసు కానీ.. అప్పట్లో మరి ఇంత టెక్నాలజీ.. నాలెడ్జ్ లేదు కదా.. అయినా చేయి పట్టుకుని.. నాడి కొట్టుకునే విధానాన్ని బట్టి రోగి ఏ ఇబ్బందితో ఉన్నాడో కనిపెట్టేసేవారు. మరి ఇప్పుడో.. ఎంఆర్ఐ.. స్కానింగ్ ఇలా చాలా రకాల ఆధునిక పద్ధతులు వచ్చేశాయి. ఇప్పుడు దాదాపుగా ఎక్కడో తప్పితే డాక్టర్స్ చేయి పట్టుకుని.. నాడి  చూడటం జరగటం లేదు. కరోనా తరువాత అసలు డాక్టర్లు పేషేంట్స్ ని ముట్టుకోవడమే (అత్యవసరం అయితే తప్ప) గగనం అయిపోయింది.  మన ఇబ్బందులు చెప్పేస్తే.. రెండు మూడు టెస్ట్ లు చేయించి.. మన వ్యాధి నిర్ధారణ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తున్నారు. కానీ.. చరిత్ర గుండ్రంగా తిరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ డాక్టర్స్ మన చేయి పట్టుకుని చూసే రోజులు రాబోతున్నాయి. కాదు.. అది తప్పనిసరి కూడా కావచ్చు. ఆశ్చర్యం వద్దు. ఇటీవల జరిపిన పరిశోధనల్లో మన షేక్ హ్యాండ్(Shake Hand) మన ఆరోగ్యాన్ని లేదా మనలో ఉన్న అనారోగ్యాన్ని యిట్టె చెప్పేస్తుందని తేలింది. ఇదేమీ ఆషామాషీగా చెబుతున్న మాట కాదు. లండన్‌లోని క్వీన్ మేరీ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలు తేల్చిన విషయం. షేక్ హ్యాండ్ తో ఎలా తెలిసిపోతుంది అనే కదా మీ అనుమానం. దానికి ఈ శాస్త్రవేత్తలు చెప్పిన వివరణలు ఏమిటో ఇప్పుడు చెప్పేసుకుందాం. ఇవన్నీ చదివితే.. అబ్బో షేక్ హ్యాండ్ లో ఇంతుందా అనిపిస్తుంది. 

Shake Hand ప్రతీకాత్మక చిత్రం

షేక్ హ్యాండ్ ఇచ్చినపుడు మన హ్యాండ్ గ్రిప్ ను బట్టి మన అనారోగ్యం తెలిసిపోతుంది అనేది ఆ శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలిందట. అది ఎలా అంటే.. 

గుండె జబ్బులు..
ఎవరికైనా షేక్ హాండ్(Shake Hand) ఇచ్చినపుడు వారి హ్యాండ్ గ్రిప్ తక్కువ ఉంటే వారికి గుండెజబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. తక్కువ పట్టు శక్తి ఉన్నవారు బలహీనమైన హృదయాలను కలిగి ఉన్నారని, వాటికి  శరీరం చుట్టూ రక్తాన్ని పంప్ చేయగల సామర్థ్యం తక్కువగా ఉందనీ కనుగొన్నారు. దీనికోసం 5000 మందిపై అధ్యయనం చేశారు. ఈ అధ్యయనం, గుండె - ఆరోగ్యకరమైన గుండె కండరాల ద్వారా పంప్ చేసిన రక్తం అధిక వాల్యూమ్‌లు - నిష్పత్తులతో మెరుగైన చేతి బలం ముడిపడి ఉందని తేల్చింది. 

క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్ నుండి ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన ప్రొఫెసర్ స్టెఫెన్ పీటర్సన్, గుండె జబ్బులు(Heart Diseases) వచ్చే ప్రమాదం ఉన్నవారిని గుర్తించడానికి గ్రిప్ టెస్ట్‌ల ప్రాముఖ్యతను స్పష్టంగా చెప్పారు.  

Heart Diseases ప్రతీకాత్మక చిత్రం

హ్యాండ్ గ్రిప్(Shake Hand) బలం చెక్ చేయడం అనేది చవకైనది, మళ్ళీ మళ్ళీ  చేయదగినది అలాగే  అమలు చేయడానికి సులభమైన కొలత అని ఆయన అంటున్నారు. గుండె జబ్బులు(Heart Diseases) ఎక్కువగా ఉన్న వ్యక్తులను గుర్తించడానికి - గుండెపోటు వంటి ప్రధాన జీవితాన్ని మార్చే సంఘటనలను నిరోధించడానికి సులభమైన మార్గంగా మారవచ్చు" అని ఆయన చెప్పారు.

చిత్తవైకల్యం..
స్టీరింగ్ వీల్‌ను పట్టుకోవడం లేదా స్క్రూడ్రైవర్‌ను తిప్పడం కోసం కష్టపడడం వల్ల తర్వాతి జీవితంలో చిత్తవైకల్యం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని మరో పరిశోధనలో తేలింది. 190,000 కంటే ఎక్కువ మంది చిత్తవైకల్యం లేని మధ్య వయస్కులైన పురుషులు - మహిళలు పాల్గొన్న ఒక అధ్యయనంలో చిన్న వయస్సులో బలహీనమైన పట్టు ఉన్నవారు చిత్తవైకల్యం(Dementia) తో సహా పెద్దయ్యాక ఆలోచన - జ్ఞాపకశక్తి సమస్యలను కలిగి ఉంటారని కనుగొన్నారు.  

కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు తమ పరిశోధనా పాత్రలలో ఈ విషయాన్ని వెల్లడించారు. వీరు బలహీనమైన చేతి పట్టు శరీరంలో సాధారణ కండరాల నష్టాన్ని ప్రతిబింబిస్తుందని సూచించారు. దాదాపు 944,000 మంది బ్రిటిషర్లు  ప్రస్తుతం చిత్తవైకల్యంతో జీవిస్తున్నారు. దశాబ్దం చివరి నాటికి ఈ సంఖ్య ఒక మిలియన్‌కు మించి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Depression ప్రతీకాత్మక చిత్రం

డిప్రెషన్.. 
దక్షిణ కొరియా పరిశోధకులు బలహీనమైన హ్యాండ్ గ్రిప్ ఉన్నవారు  గుర్తించబడని డిప్రెషన్‌తో బాధపడే అవకాశం మూడు రెట్లు ఎక్కువగా ఉందని కనుగొన్నారు. డిప్రెషన్‌లో మానసిక స్థితి తక్కువగా ఉండటం లేదా విషయాలపై ఆసక్తి, ఆనందాన్ని కోల్పోవడం జరుగుతుంది. 

ఇది ప్రపంచవ్యాప్తంగా 350 మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేస్తుందని అంచనా వేస్తున్నారు.  ప్రపంచ ఆరోగ్య సంస్థ 2030 నాటికి, ఇతర ఆరోగ్య సమస్యల కంటే ఎక్కువ మంది డిప్రెషన్‌కు గురవుతారని అంచనా వేసింది.

వైద్యులు 51,000 మంది పాల్గొనేవారి గ్రిప్ స్కోర్‌లను రికార్డ్ చేశారు. వారి మానసిక ఆరోగ్యం అంచనాను సిద్ధం చేశారు.  పరిశోధకులు ఫలితాలను విశ్లేషించినప్పుడు, బలహీనమైన హ్యాండ్‌షేక్‌లు ఉన్నవారు "నాకు సాధారణంగా చింతించని విషయాల వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను" అలానే  "నేను చేసినదంతా ప్రయత్నమేనని నేను భావించాను"  ప్రకటనలతో గట్టిగా ఏకీభవించే అవకాశం వంటి దాదాపు మూడు రెట్లు ఎక్కువగా ఉందని వారు కనుగొన్నారు. ఇది డిప్రెషన్ కు సూచికగా వారు చెప్పారు. 

దీని గురించి ఇంకా స్పష్టమైన అంచనాలకు రాకపోయినప్పటికీ.. ఒక సిద్ధాంతం ఏమిటంటే, మృదువైన పట్టును కలిగి ఉండటం అనేది శారీరక శ్రమ లేకపోవడం వల్ల కలిగే మొత్తం శారీరక బలానికి గుర్తుగా ఉంటుంది - ఇది మానసిక ఆరోగ్యం క్షీణించడం విలక్షణమైన లక్షణంగా పరిశోధకులు చెబుతున్నారు.  

Faty Liver ప్రతీకాత్మక చిత్రం

Also Read : ఇంటి రెంటల్ ఎగ్రిమెంట్ 11 నెలలకే ఎందుకు చేస్తారు?

ఫ్యాటీ లివర్.. 
NAFLD (ఫ్యాటీ లివర్)అనేది కాలేయంలో కొవ్వు(Faty Liver) పేరుకుపోవడం.  ఇది సాధారణంగా అనారోగ్యకరమైన ఆహారం.. కదలకుండా ఒకేచోట కూచుని పనిచేసే లైఫ్ స్టైల్(Life Style) వలన వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. అధికంగా మద్యం సేవించేవారికీ ఫ్యాటీలివర్ ప్రమాదం ఎక్కువే. దీనిని ముందుగా గుర్తించకపోయినా.. గుర్తించిన తరువాత నిర్లక్ష్యం చేసినా ఇది కాలేయ క్యాన్సర్.. వైఫల్య ప్రమాదం పెంచుతుంది. యూరోపియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లోని ఒక అధ్యయనం దాదాపు 4,000 మంది పురుషులు.. స్త్రీల కాలేయాలు.. చేతి బలాన్ని(Shake Hand) పరిశీలించింది. 

బలహీనమైన పట్టు ఉన్నవారిలో వారి కాలేయంలో కొవ్వు ఉండే అవకాశం దాదాపు రెండింతలు ఉన్నట్లు వారు కనుగొన్నారు. అంటే బలహీనమైన పట్టు ఉన్నవారిలో  అధిక కొవ్వు స్థాయిలు కనిపించాయి. ఆక్లాండ్ బృందం లెక్క ప్రకారం కొవ్వు కాలేయాలు తక్కువ-స్థాయి మంటను కలిగించడం, కండరాలను బలహీనం చేయడం అలాగే  వాటి డెన్సిటీని తగ్గించడం ద్వారా పట్టు బలాన్ని దెబ్బతీస్తాయని భావిస్తోంది. 

అదండీ విషయం.. షేక్ హ్యాండ్ తో అనారోగ్యాన్ని చెప్పేయవచ్చు అని ఇందాక చెబితే నమ్మలేదు కదా.. ఇప్పుడు ఈ పరిశోధనల వివరాలు వింటే కాస్త నమ్మకం వచ్చిందా? అన్నట్టు.. ఇలా పట్టు బలంగా లేదు అంటే నాకు గుండె నొప్పి ఉందేమో అని బెంగ పెట్టుకోకండి. చేతిలో పట్టు లేకపోవడం అనేది ఒక లక్షణం కావచ్చు అంతే. ఏదైనా అనుమానం ఉంటే మీ డాక్టర్ ని కలిసి అనుమానాన్ని నివృత్తి చేసుకోండి. అంతేకానీ.. అనుమానం పెట్టుకుని మీలో మీరు కుంగిపోకండి. ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం.. పరిశోధనా ఫలితాలను మీకు తెలియచెప్పడం కోసం మాత్రమే మీకు అందించాం. 

Watch This Interesting Video :

#health #shake-hand #medical-research #health-diseases
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe