Suryapet Crime News: రెండు హత్యల కేసుల్లో సూర్యపేట జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు విధించింది. మైనర్ బాలిక అత్యాచారం కేసులో నిందితునికి 34 సంవత్సరాల జైలు శిక్షతోపాటు రూ. 60వేల జరిమానా విధించింది.పెనపహడ్, మద్దిరాల పోలీస్ స్టేషన్ లలో నమోదైన హత్యకేసులలో నిందితులకు జీవిత ఖైదీ విధిస్తూ జిల్లా కోర్టు ఉత్తర్వులు ఇవ్వడం, మోతె పోలీస్ స్టేషన్ లో నమోదైన మైనర్ బాలిక అత్యాచారం కేసులో నిందితునికి 34 సం.రాల శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు ఉత్తర్వులు ఇవ్వడం పై జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే న్యాయవాదులను, దర్యాప్తు పోలీసు అధికారులను, కోర్టు డ్యూటీ పోలీసు సిబ్బందిని అభినందించారు. వారం రోజుల్లో మూడు ప్రధాన కేసుల్లో నిందితులకు శిక్షలు విధిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇస్తూ శిక్షలు అమలు అవడంవల్ల అలవాటుగా నేరాలకు పాల్పడే వారు నేరాలు చేయడానికి భయపడతారు అని, ప్రజల్లో చట్టాల పట్ల గౌరవం పెరుగుతుంది అని ఎస్పీ అన్నారు.
పెనపహడ్ PS హత్య కేసు :
జలమలకుంట తండాలో లునావత్ బిఖ్యా ను కొడుకు లునావత్ స్వామి హత్యచేయడం పై పెనపహడ్ PS నందు నేరం సంఖ్య 48/2020 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి కేసు అభియోగం పత్రాలు కోర్టుకు అందజేయడం జరిగినది. దీనిపై విచారించిన జిల్లా కోర్టు న్యాయమూర్తి బాధితులను, సాక్షులను విచారించి నిందితుడు నేరానికి పాల్పడినట్లు గుర్తించి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది.
మద్దిరాల PS హత్య కేసు:
పోలుమల్ల గ్రామంలో 22/7/2016 రోజున వివాహిత అయిన రాగిణి లావణ్యను తన భర్త రాగిణి లింగయ్య హత్య చేసినట్లు తండ్రి పిర్యాదు మేరకు మద్ధిరాల పోలీస్ స్టేషన్ నందు నేరం సంఖ్య 133/2016 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి కేసు అభియోగం పత్రాలు కోర్టుకు అందజేసింది. దీనిపై విచారించిన జిల్లా కోర్టు న్యాయమూర్తి బాధితులను, 14 మంది సాక్షులను విచారించి నిందితుడు లింగయ్య నేరానికి పాల్పడినట్లు నిర్ధారించి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది.
మోతే PS పొక్సో కేసు:
మండల పరిధిలో గల ఒక తండాకు చెందిన తన కూతురుని కిడ్నాప్ చేసినట్లు తల్లి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి అపహరణకు గురైన మైనర్ బాలికను గుర్తించి, నేరానికి పాల్పడినది గంట మహేష్ గా గుర్తించి నిందితునిపై మోతె PS నందు నేరం సంఖ్య 231/2021 ప్రకారం పోక్సో కేసు నమోదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి కేసు అభియోగం పత్రాలు కోర్టుకు అందచేసింది. దీనిపై విచారించిన జిల్లా కోర్టు న్యాయమూర్తి బాధితులను, 10 మంది సాక్షులను విచారించి నిందితుడు మహేష్ నేరానికి పాల్పడినట్లు నిర్ధారించి 34 సం.రాల జైలు శిక్ష, 60 వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు తీర్పు ఇచ్చింది.
ఇది కూడా చదవండి: తెలంగాణను కీలక స్థావరంగా ఎంచుకున్న నేవి…దేశంలోనే రెండో స్టేషన్ ఏర్పాటు..!!