Moinabad Woman Murder Case : మొయినాబాద్‌ యువతి దహనం కేసులో సంచలన ట్విస్ట్‌

సంచలనం సృష్టించిన మొయినాబాద్ యువతి దహనం కేసులో అనేక ట్విస్ట్ లు నెలకొన్నాయి. ఆమెది హత్యకాదని ఆత్మహత్య అని పోలీసులు వెల్లడించారు.

New Update
Moinabad Woman Murder Case  : మొయినాబాద్‌ యువతి దహనం కేసులో సంచలన ట్విస్ట్‌

రంగారెడ్డి (Rangareddy) జిల్లా మొయినాబాద్‌ (Moinabad) లో సంచలనం సృష్టించిన యువతి దహనం కేసులో ఎట్టకేలకు మిస్టరీ వీడింది. అందరూ భావించినట్టుగా అది హత్య కాదని మృతురాలు పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది.

మొయినాబాద్‌ మండలంలోని బాకారం గ్రామంలో దహనమైన యువతిని మల్లేపల్లికి చెందిన తైసీల్‌గా గుర్తించారు. అయితే ఈ కేసులో బిగ్‌ ట్విస్ట్‌ నెలకొంది. అందరూ అనుకున్నట్టుగా ఆమెను ఎవరూ హత్య చేయలేదని, ఆమె పెట్రోల్‌ పోసుకుని బలవన్మరణానికి పాల్పడిందని పోలీసులు తేల్చారు. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు ఈ మృతిని ఆత్మహత్యగా నిర్దారించారు. గతంలోనూ పలుమార్లు తైసీల్‌ ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు వివరించారు.

చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం వెతుకుతున్న తైసీల్‌ పలుమార్లు కుటుంబసభ్యులతో గొడవపడి ఇంట్లోనుంచి వెళ్లిపోయిందని, ఆ తర్వాత తిరిగి ఇంటికి వచ్చేదని, ఈసారి కూడా అలాగే వస్తుందన్న ఉద్ధేశంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయలేదని కుటుంబసభ్యులు చెబుతున్నారని పోలీసులు వివరించారు. అయితే గతంలో లాగా తిరిగి రాకపోవడంతో అనుమానంతో పోలీసులకు అలస్యంగా ఫిర్యాదు చేసినట్టు వారు వివరించారు.

అయితే బాధిత కుటుంబ సభ్యుల వాదన మరోలా ఉంది. తైసీల్‌ సోదరుడు అజర్‌ ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు నిర్లక్ష్యం వహించడంతో పాటు ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేయలేదని తెలిసింది. ఈ విషయం హైదరాబాద్‌ సీపీ శ్రీనివాస్‌ రెడ్డి దృష్టికి రావడంతో ఆయన హబీబ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించడంతోపాటు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 8న తైసీల్‌ మల్లేపల్లిలోని తన ఇంటినుంచి బయటకు వెళ్లిపోయింది. రెండు రోజుల తర్వాత అంటే 10న ఆమె సోదరుడు అజర్‌ హబీబ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అయినా వారు కేసు నమోదు చేయలేదు.

ఆ రోజు ఏం జరిగిందంటే..

ఈ నెల 8న బాకారం గ్రామంలోని డ్రీమ్‌ వ్యాలీ రిసార్ట్‌ పక్కన గుర్తు తెలియని యువతి మృతదేహం మంటల్లో కాలిపోతున్నట్టు స్థానిక రైతులు గుర్తించారు. కొంతమంది యువకులు ఆమెను హత్యచేసి ఆటోలో అక్కడికి తీసుకువచ్చి దహనం చేశారని భావించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మంటలను ఆర్పినప్పటికి అప్పటికే 90శాతం శరీరం కాలిపోయింది. దీంతో ఆమె వివరాలు సేకరించడం కష్టమైంది. అయితే క్లూస్‌టీం సహయంతో ఆధారాలు సేకరించిన పోలీసులు యువతికి చెందిన పాక్షికంగా కాలిన మొబైల్‌ ఫోన్‌ను గుర్తించారు. దాన్ని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపి దర్యాప్తు ప్రారంభించారు.

సంఘటనకు ముందు అక్కడికి ఆటో వచ్చినట్టు గుర్తించిన పోలీసులు ఆటోడ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే తను ఆమెను అక్కడ దింపి వెళ్లిపోయినట్లు ఆటో డ్రైవర్‌ వెల్లడించడంతో పాటు తైసీన్‌ గతంలోనూ ఆత్మహత్య యత్నం చేసుకున్న కోణంలోనూ దర్యాప్తు చేసిన పోలీసులు ఆమెది ఆత్మహత్యగానే భావిస్తున్నారు.

హబీబ్ నగర్ ఎస్సై సస్పెన్స్

మొయినాబాద్ యువతి అదృశ్యం, దహనం కేసులో పోలీసుల నిర్లక్ష్యంపై సౌత్ జోన్ డీసీపీ సీరియస్ అయ్యారు. మిస్పింగ్ కేసు నమోదు చేయకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ విషయమై హబీబ్ నగర్ ఎస్సై శివను సస్పెండ్ చేశారు. అలాగే ఇన్స్ పెక్టర్ రాంబాబుకు మెమో జారీ చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు