Railway Recruitment: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డుకు (RRB) సంబంధించి ప్రశ్న పత్రం లీకేజీ కేసులో హైదరాబాద్ సీబీఐ (CBI Court) కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. 2010లో సహాయ స్టేషన్ మాస్టర్, సహాయ లోకోపైలట్ పోస్టుల కోసం రైల్వే బోర్డు నిర్వహించిన పరీక్ష ప్రశ్నపత్రాలు లీకైన విషయం తెలిసిందే. కాగా నిందితులు మధ్యవర్తుల ద్వారా అభ్యర్థుల నుంచి రూ.3.5 లక్షల నుంచి రూ.4.5 లక్షల దాకా వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
అన్యాయం జరిగింది..
అయితే ఈ ఇష్యూను సీరియస్ గా తీసుకున్న అధికారులు.. కష్టపడి చదివిన అభ్యర్థులకు అన్యాయం జరిగినట్లు ఆరోపణలు రావడంతో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు అప్పటి ఛైర్మన్‌తోపాటు ప్రైవేటు వ్యక్తులపై 2010 జూన్ 15న సీబీఐ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో బుధవారం తుది విచారణ చేపట్టిన హైదరాబాద్ సీబీఐ కోర్టు ముంబై మాజీ ఛైర్మన్ సతేంద్రమోహన్, హసన్-మంగళూరు రైల్వే అభివృద్ధి మండలి మాజీ సీఈవో ఎ.కె.జగన్నాథం సహా మరో 8 మందికి 5 ఏళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.7.87 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది.
ఇది కూడా చదవండి : TSPSC: రేవంత్ ఇది కరెక్టు కాదు.. సీబీఐని ఆశ్రయిస్తానంటున్న ఆర్ఎస్ పీ
15 మంది నిందితులు..
ఈ మేరకు కేసు దర్యాప్తు సమయంలో 15 మందిని అరెస్టు చేయగా పలువురు బెయిలు పొందారు. 2010 సెప్టెంబరు 13న 15 మందిని నిందితులుగా పేర్కొంటూ సీబీఐ అభియోగపత్రం దాఖలు చేసింది. ఇరుపక్షాల వాదనలను విన్న సీబీఐ కోర్టు పది మంది నిందితులకు 5 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. నలుగురిని నిర్దోషులుగా విడుదల చేయగా, ఒకరు కేసు విచారణలో ఉండగానే మృతిచెందారు. శిక్ష పడినవారిలో అప్పటి రిక్రూట్‌మెంట్ బోర్డు ఛైర్మన్, సీఈవోలతోపాటు మధ్యవర్తులుగా ఉన్న జగన్నాథం షరీన్ కుమార్, పి.అశోక్‌కుమార్; జగన్నాథం రమేష్, జగన్నాథం తిరుపతయ్య, ఎం.శేషు నారాయణమూర్తి, వివేక్ భరద్వాజ్, సృజన్ జగన్నాథం, శ్రీరామ విజయశంకర్ ఉన్నారు. నిందితుల ఇళ్లు, కార్యాలయాల్లో నిర్వహించిన సోదాల్లో రూ.36.9 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు.