Supreme Court Judgement : ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు(Supreme Court)లో విచారణ జరిపిన ధర్మాసనం సంచలన తీర్పునిచ్చింది. పార్లమెంటు నిర్ణయాన్ని కొట్టివేయలేమని.. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాగంబద్ధమే అంటూ స్పష్టం చేసింది. కేంద్ర నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని.. ఆర్టికల్ 370 అనేది యుద్ధ నేపథ్యంలో కుదుర్చుకున్న తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని తెలిపింది. జమ్మూ కశ్మీర్‌కు సార్వభౌమాదికారం లేదని.. భారత రాజ్యాంగమే ఫైనల్ అని జమ్ము కశ్మీర్ రాజు కూడా ఆనాడు ఒప్పందం చేసుకున్నారని వివరించింది. అలాగే ఆర్టికల్ 370ని రద్దు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అవసరం లేదని చెప్పింది. ఆర్టికల్ 370 రద్దుపై రాష్ట్రపతి ఉత్తర్వులు సమర్ధనీయమే అంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తేల్చిచెప్పింది.
Also Read: ప్రజా దర్బార్ కు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు
ఇదిలాఉండగా... జమ్మూకశ్మీర్‌కు గతంలో కల్పించిన ప్రత్యేక హోదాను ఉపసంహరిస్తూ.. 2019లో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలవురు పిటీషన్లు దాఖలు చేశారు. దీంతో ఈ ఏడాది ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ వరకు సుప్రీంకోర్టు దీనిపై విచారణ చేపట్టింది. అయితే సెప్టెంబర్ 5న రిజర్వులో ఉంచిన ఈ తీర్పును సుప్రీం ధర్మాసనం తాజాగా వెలువరించింది. అయితే 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా రద్దు చేసింది. ఆ తర్వాత జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. అయితే కేంద్రం నిర్ణయాన్ని అక్కడి స్థానిక రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే తాజాగా కీలక తీర్పు వెలువడిన తురణంలో ఇప్పటికే అధికార యంత్రాంగం భద్రతా చర్యలు చేపట్టింది. గత రెండు వారాలుగా కశ్మీర్ లోయలోని 10 జిల్లాల్లో భద్రతా ఏర్పాట్లపై పోలీసులు సమీక్షలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు నాయకుల్ని గృహ నిర్బంధలో ఉంచారు.
అలాగే ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న జమ్ముకశ్మీర్‌లో రాష్ట్రహోదాను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. అంతేకాదు 2024 సెప్టెంబర్ 30 లోగా జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.
Also read: తాను సీఎం అభ్యర్ధిని కానని ప్రకటించిన బాబా బాలక్ నాథ్.. కారణాలు ఇవేనా?