అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సత్యసాయి నీటి పథకం ఉద్యోగులు ఆందోళనకు దిగారు. గత ఐదు నెలలుగా తమకు వేతనాలు చెల్లించడం లేదని చెబుతూ అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. త ఐదారు నెలలుగా వేతనాలు చెల్లించక పోవడంతో తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని వాపోయారు. వెంటనే పాత బకాయిలను చెల్లించి తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ సమ్మెలోకి వెళ్లారు.
దీంతో అనంతపురం జిల్లాలోని వందలాది గ్రామాలకు నీటి సరఫరా పూర్తిగా ఆగిపోయింది. తాజాగా కళ్యాణదుర్గం సత్యసాయి నీటి పథకానికి సంబంధించిన పంపు హౌస్ ఎదుట ఉద్యోగులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. తమను శాశ్వత ఉద్యోగులుగా ప్రకటించాలని, వెంటనే తమ బకాయిలు చెల్లించకపోతే సమ్మె ఇలాగే కొనసాగిస్తూ గ్రామీణ ప్రాంతాలకు నీటిని వదలబోమని హెచ్చరించారు.
ఇది ఇలా వుంటే గత నెలలుగా తమకు బాకీ వున్న వేతనాలు చెల్లించి, తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సత్యసాయి తాగునీటి పథకం కింద పనిచేస్తున్న సమారు 575 మంది కార్మికులు సమ్మె బాట పట్టారు. సత్యసాయి నీటి పథకానికి సంబంధించిన మోటార్ పంపులను కార్మికులు ఆఫ్ చేశారు. దీంతో సుమారు 1200 పైగా గ్రామాలకు తాగునీటి సమస్య ఏర్పడింది.
కార్మకుల సమ్మె విషయాన్ని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో కార్మిక నేతలతో చర్చలు జరిపి సమస్య పరిష్కారం చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. దీంతో కార్మిక నేతలను పిలిచి అధికారులు వారితో చర్చించారు. కానీ చర్చలు విఫలం కావడంతో కార్మికులు తమ సమ్మె కొనసాగించనున్నట్టు వెల్లడించారు. తాగు నీటి సరఫరా కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని అధికారులు ఇటీవల వెల్లడించారు.