Sarpanch Protest in Guntur District: గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కాట్రపాడులో సర్పంచ్ శివశంకర్ ప్రభుత్వంపై వినూత్నంగా నిరసన తెలిపారు. 15వ ఆర్ధిక సంఘం నిధులు రూ. 600 కోట్లను ప్రభుత్వం దొంగిలించిందని హరిదాసు వేషధారణలో ఇంటింటికి వెళ్లి భిక్షాటన చేశారు. వాటిని తిరిగి పంచాయతీ ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేస్తూ హరిలో రంగ హరి అంటూ ఇంటింటికి తిరిగారు. కాట్రపాడులో 15వ ఆర్ధిక సంఘం నిధులు కేవలం రూ.1198 మాత్రమే ఇచ్చారన్నారు.
Also Read: మురారి ఇంట్లో అపచారం.. ఆదర్శ కోసం కృష్ణ తిప్పలు..నటిస్తోన్న ముకుంద..!
వీధుల్లో కనీసం ఒక్క లైట్ వేసేందుకు కూడా నిధులు లేవంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మురుగుకాల్వ పూడిక కూడా తీసుకోలేని దుస్థితిలో ఉన్నామని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశాడు. రూ.1198 డబ్బులతో గ్రామంలో అభివృద్ధి పనులు ఎలా చేయలని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇచ్చిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం తమ అవసరాలకు వినియోగిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గ్రామ ప్రజలకు కూడా తెలియజేయాలనే గ్రామ వీధుల్లో వార్డు సభ్యులతో కలిసి భిక్షాటన చేసినట్లు వివరించారు.