Khammam: ఐఏఎస్ అధికారిని అంటూ నమ్మించి మ్యాట్రీమోనీలో యువతిని పెళ్లిచేసుకున్న ప్రబుద్ధుడు కట్నం పేరిట రెండు కోట్లు కొట్టేశాడు. అంతటితో ఆగకుండా తర్వాత ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు బ్యాంక్ ఖాతా సీజ్ చేశారని భార్యను భయాందోళనకు గురిచేసి భారీ మొత్తంలో రాబట్టాడు. ఇవేవి చాలవన్నట్లు అదనపు కట్నం కావాలంటూ వేధింపులకు పాల్పడటంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా అతని బాగోతం మొత్తం బయటపడిది. ఈ ఘటన హైదరాబాద్ బాచుపల్లిలో చోటుచేసుకోగా వివరాలు ఇలా ఉన్నాయి.
ఐఏఎస్‌ను అంటూ బయోడేటా పెట్టి..
ఈ మేరకు బాచుపల్లి సీఐ జె.ఉపేందర్ వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా రాజలింగాలకు చెందిన నల్లమోతు సందీప్‌కుమార్(38) అనే వ్యక్తి 2016లో కర్ణాటక ఐఏఎస్ క్యాడర్‌లో ఎంపికైనట్లు ప్రచారం చేసుకున్నాడు. ఓ మ్యాట్రీమోనీలో ఐఏఎస్‌ను అంటూ బయోడేటా పెట్టాడు. దీంతో బెల్జియంలో ఉద్యోగం చేస్తున్న కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన అరిమిల్లి శ్రావణి(34) పేరెంట్స్ రూ.50 లక్షల కట్నం, ఇతరత్ర ఖరీదైన వస్తువులు ఇచ్చి 2018లో పెళ్లి చేశారు. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే అసలు గేమ్ మొదలైంది. తనకు ఐఏఎస్ గా పనిచేయడం ఇష్టం లేదని రేడియాలజిస్టుగా ఉద్యోగం చేస్తానని భార్యను నమ్మించి ఆఫీసుకు వెళ్తున్నట్లు నమ్మించాడు.
బ్యాంకు ఖాతాను సీజ్ చేశారని..
ఈ క్రమంలోనే నెలవారి జీతం కావాలంటూ భార్య అడగటంతో నెలకు రూ.40 కోట్లు సంపాదించడంతో అధికారులు బ్యాంకు ఖాతాను సీజ్ చేశారని నమ్మించాడు. ఈ క్రమంలోనే మరోసారి అవి రావాలంటే రూ.2 కోట్లు చెల్లించాలని చెప్పడంతో భార్య సమకూర్చింది. యువతి తల్లి మాలతి(59) ఆభరణాలను బ్యాంకులో తనఖా పెట్టి డబ్బులు ఇచ్చింది. ఆ డబ్బును సందీప్‌కుమార్ తన తండ్రి విజయ్‌కుమార్(70), అమెరికాలో ఉంటున్న సోదరి మోతుకూరి లక్ష్మీసాహితి(35) ఖాతాలకు పంపించాడు. అయితే భర్త ఐఏఎస్ ధ్రువపత్రంతోపాటు రేడియాలజీ సర్టిఫికెట్ నకిలీవేనని శ్రావణి గుర్తించడంతో అసలు విషయం బయటపడింది. ఈ క్రమంలోనే శ్రావణి బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా కూపి మొత్తం లాగారు. సందీప్ తోపాటు అతని తల్లిదండ్రులపై కేసు నమోదుచేసి కోర్టులో హాజరు పరిచారు. పరారిలో ఉన్న లక్ష్మీసాహితీ కోసం గాలిస్తున్నారు.