వైసీపీ ఓటమితో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేశారు. దేవులపల్లి అమర్, విజయకుమార్, హేమచంద్ర రెడ్డి తదితర సలహాదారులు సైతం తమను రిలీవ్ చేయాలంటూ సీఎస్‌కు లేఖ రాశారు. జగన్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించారు. ప్రభుత్వంలో ఆయనే నంబర్-2 అన్న చర్చ సైతం సాగింది. ప్రభుత్వ నిర్ణయాలను ప్రకటించడంతో పాటు, మంత్రివర్గంలో మార్పులు చేర్పులు తదితర కీలక అంశాలను ఆయనే మీడియాకు వివరించేవారు. ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం సీఎంను కలవాలంటే ముందుగా సజ్జలనే సంప్రదించాలన్న అభిప్రాయం ఉండేది.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్లు సైతం సజ్జలపై విమర్శలు చేస్తూ పార్టీని వీడారు. ప్రస్తుతం పార్టీ దారుణ పరాజయం పాలవ్వడానికి సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ కు ఇచ్చిన తప్పుడు సమాచారమే కారణమన్న విమర్శలు సైతం సొంత పార్టీ నేతల నుంచి వస్తున్నాయి. ఆయన సలహాలతోనే జగన్ ప్రజలకు, నాయకులకు దూరం అయ్యాడన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో జగన్ సజ్జలను దూరం పెడతారా? లేక గతంలో మాదిరిగా సజ్జలకు ఫ్రీ హ్యాండ్ ఇస్తారా? అన్న అంశం ఇప్పుడు వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.