శబరికి వరద ఉధృతం
అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు నియోజకవర్గంలో శబరి నది నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. విలీన మండలాలలో వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెగని వానలతో మరోమారు గోదావరి వరద ఉధృతి పెరుగుతుంది. చింతూరు వద్ద వేగంగా శబరి నదికి వరద నీరు పెరుగుతుంది.
చింతూరు మండలం సోకులేరు వాగు పొంగడంతో మరోమారు కాజ్ వే పైకి వరదనీరు చేరింది. వీఆర్‌పురం మండలానికి రాకపోకలు నిలిచిపోయాయి. కూనవరం మండలంలో భారీ వర్షాలతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. కోండ్రాజుపేట కాజ్‌వేపైకి వరదనీరు చేరుకోగా.. పలు గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి. వీఆర్‌పురం మండలంలోనూ వరద ఉధృతి ఎక్కువగా ఉంది. అన్నవరం వంతెన వద్ద పైనుంచి వరద నీరు ప్రవహిస్తుంది. ఈ భారీ వరద నీరు వల్ల 38 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి.
మన్యం వాసుల ఇబ్బందులు
గోదావరి వరద తగ్గుతూ.. పెరుగుతూ దోబూచులాడుతోంది. చింతూరు వీలిన మండలంలో మరోసారి వరద నీరు పెరుతోంది.ఎగువ ప్రాంతాల్లోనూ వరద పెరుగుతుండటంతో మన్యం వాసులు కలవరపడుతున్నారు. ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కూడా కురుస్తోంది. కోండ్రాజుపేట కాజ్‌వేపై ఆరో రోజూ వరద ప్రవాహం కొనసాగడంతో రాకపోకలకు అంతరాయం తప్పలేదు. శబరి నదులకు సంభవించిన వరదలతో ఆరు రోజులుగా విలీన మండలాల్లో అలజడి చేసిన వరద ఇప్పుడు శాంతించింది. దీంతో పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సిబ్బంది సిద్ధంగా ఉండాలి
వరదల సమయంలో విద్యుత్తు అంతరాయాలు లేకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వీఆర్‌పురంలో విద్యుత్తు సౌకర్యం లేని తెల్లవారిగూడెంలోని మిడియంగుంపు వెళ్లి వారితో మాట్లాడారు. వారికి వెంటనే విద్యుత్తు సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. విద్యుత్తు ఉపకేంద్రాలు తనిఖీ చేశారు. వరదలను దృష్టిలో ఉంచుకుని అత్యవసర పరికరాలు సిద్ధంగా ఉంచుకోవాలని, సమస్య వచ్చిన వెంటనే పరిష్కరించేలా సిబ్బందిని సిద్ధంగా ఉంచాలన్నారు.