నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుగా ఉంది యూరో ఎగ్జిమ్ బ్యాంకు తీరు. రూ.8 కోట్లు కూడా విలువలేని ఆ బ్యాంకు వేల కోట్ల ప్రభుత్వ కాంట్రాక్టులకు ఫేక్ గ్యారెంటీలు ఇచ్చిన వైనంపై ఆర్టీవీ వరుస కథనాలు ప్రసారం చేసిన విషయం తెలిసిందే. దీనికి సమాధానం చెప్పకపోగా.. తిరిగి RTVపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసి పరువు తీసుకుంది. ఆ బ్యాంక్ విలువ కేవలం రూ.8 కోట్లు మాత్రమే కాగా.. పరువు నష్టం దావా వేయడం కోసం రూ. కోటి ఫీజు కట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంత డబ్బు ఆ బ్యాంకుకు ఎవరు ఇచ్చారన్న అంశంపై కూడా సర్వత్రా చర్చ జరుగుతోంది.
అయితే.. తమ కథనాలకు కట్టుబడి ఉన్నామని RTV, రవిప్రకాష్ ప్రకటించారు. తాము జర్నలిజాన్నే నమ్ముకున్నామని.. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నిజం చెప్పేందుకు మేం ఎంతవరకైనా పోరాటం చేస్తామని RTV తెలిపింది. యూరో ఎగ్జిమ్ బ్యాంకు కేసు విషయంలో న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించింది. యూరో ఎగ్జిమ్ బ్యాంకు ఫేక్ గ్యారెంటీలపై RTV కథనాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. తాము పెద్ద కాంట్రాక్టర్లమంటూ ఫోజులు కొట్టే వారి అసలు బాగోతం ఆర్టీవీ కథనాలతో బట్టబయలైంది.
ఆర్టీవీ వద్ద ఆధారాలు:
ఈ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఫేక్ గ్యారెంటీలకు సంబంధించి అన్ని ఆధారాలను సంపాదించింది ఆర్టీవీ. ఆ బ్యాంక్ ప్రతినిధి తాము ఫేక్ గ్యారెంటీలను ఎలా ఇస్తారో వివరించిన ఆడియో సైతం ఆర్టీవీ వద్ద ఉంది. ఈ ఫేక్ గ్యారెంటీ స్కామ్‌లో SBI పాత్రను బహిర్గతం చేసే ఫోన్ వివరాలు కూడా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడో ప్రజల ముందు ఉంచింది ఆర్టీవీ. ఈ వార్తలకు వివరణ ఇవ్వకుండా పరువు నష్టం దావా వేసి.. నవ్వుల పాలైంది యూరో ఎగ్జిమ్ బ్యాంక్. తమ దందా బయటపడే సరికి ఉక్కిరిబిక్కిరైన ఆ బ్యాంక్ పరువు నష్టం దావాతో తనపై ఆరోపణలను కవర్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఇన్నాళ్లు ఆ బ్యాంక్ ఫేక్ గ్యారెంటీలతో ప్రజల సంపదను దోచుకున్న కాంట్రాక్టర్లు సహకరిస్తున్నట్లు స్పష్టం అవుతోంది.
అడ్డంగా దొరికిన మేఘా:
ఇక కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అక్రమాలపై ఇప్పటికే అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న మేఘా ఇంజినీరింగ్ సంస్థ కూడా ఈ దొంగ బ్యాంక్ గ్యారెంటీల ద్వారానే లబ్ధి పొందింది. ఈ కంపెనీ 432 కోట్ల బ్యాంక్ గ్యారెంటీని మేఘా ఇంజినీరింగ్ ఇన్ ఫ్రా లిమిటెడ్‌కు ఇచ్చింది. మహారాష్ట్రలోని MMRDA ప్రాజెక్టులో భాగంగా థానే నుంచి బోరివలి వరకు సొరంగం నిర్మించడానికి గ్యారంటీ ఇచ్చారు. ప్రతీ ప్రాజెక్టులో బ్యాంక్ గ్యారంటీగా 10 శాతం తీసుకుంటుంది. ఈ ప్రాజెక్టు విలువ 4,320 కోట్లు. ఇన్ని వేల కోట్ల ప్రాజెక్టును అక్రమ బ్యాంకు గ్యారంటీలతో తమ ఖాతాలో వేసుకున్నారన్న విషయాలు ఆర్టీవీ ఇన్‌వెస్టిగేసన్‌లో తేలాయి.
వారి ఆమోద ముద్ర..
ఏపీ విద్యుత్ శాఖలో కొందరు అవినీతి తిమింగళాలు ఈ ఫేక్ బ్యాంక్ గ్యారంటీలకు ఆమోద ముద్ర వేశాయన్న ఆరోపణలుఉన్నాయి. ఆంధ్రాలో ఫేక్ బ్యాంక్ గ్యారెంటీలు సమర్పించిన వారిలో తెలంగాణ మంత్రి పొంగులేటి తదితరుల కంపెనీలు కూడా ఉన్నాయని ఆర్టీవీ ఇన్‌వెస్టిగేషన్‌లో తేలింది. ఆంధ్రప్రదేశ్ మైన్స్ అండ్ జియాలజీ విభాగం కూడా ఈ దొంగ బ్యాంక్ గ్యారంటీలను ఆమోదించింది. అటు కర్ణాటక డిస్కంలు కూడా ఈ నకిలీ బ్యాంక్ గ్యారెంటీలకు స్వాగతం పలికాయి. మరోవైపు మహారాష్ట్రలో MMRDA లాంటి ప్రభుత్వ సంస్థలు భారీ ప్రాజెక్టులకు ఈ దొంగ బ్యాంక్ గ్యారెంటీల ద్వారా కుంభకోణానికి లైన్ క్లీయర్ చేశాయి.