Fuel Prices: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భౌగోళిక రాజకీయాల్లో స్థిరత్వం వచ్చిన తర్వాతే చమురు ధరల తగ్గింపు సాధ్యం అవుతుందన్నారు. నవంబర్ 2021, మే 2022 మధ్య రెండు సార్లు పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గించినట్లు గుర్తు చేశారు. ఈ తగ్గింపుతో దాదాపు రూ. 2.2 లక్షల కోట్ల ఆదాయాన్ని కోల్పోయినట్లు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ఇంధన ధరలను తగ్గించడానికి మోదీ సర్కార్ తీసుకుంటున్న చర్యల గురించి తెలిపారు.
కేంద్ర మంత్రి మాట్లాడుతూ..నవంబర్ 2021, మే 2022 మధ్య పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం వరుసగా రూ. 13, రూ. 16 తగ్గింది. తగ్గింపుల ఫలితంగా రూ. 2.2 లక్షల కోట్ల ఆదాయం కేంద్రం కోల్పోయింది. పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించే అవకాశంపై అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, భౌగోళిక రాజకీయ పరిస్థితులు, అంతర్జాతీయ చమురు ధరల స్థిరీకరణపై రిటైల్ ఇంధన ధరలను తగ్గించే నిర్ణయం ఆధారపడి ఉంటుందని చెప్పారు.భౌగోళిక పరిస్థితి స్థిరంగా ఉంటే, చమురు ధరలు స్థిరంగా ఉంటే, తగ్గించే అంశంపై ద్రుష్టిపెట్టవచ్చన్నారు.
భారత్ వెలుపల, ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ పరిస్థితులు మెరుగుపడాలి. అప్పుడే చమురు ధరల్లో స్థిరత్వం అనేది వస్తుంది. ఆ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై ఫోకస్ పెడతాం. అయితే ప్రపంచంలో ఎక్కడో ఒక చోట దాడులు జరిగినా సరుకు రవాణా, బీమా ధరలు పెరుగుతున్నాయని మంత్రి అన్నారు. దీంతో చమురు మార్కెట్లో అస్థిరతలు నెలకొంటున్నాయని కేంద్రమంత్రి తెలిపారు.
కాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎల్పీజీ ధరలను రూ.100 తగ్గిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. గ్యాస్ ధరలలో ఈ తగ్గింపు గత ఏడాది రక్షా బంధన్ సందర్భంగా ప్రకటించిన రూ.200 కోత ఎక్కువగా ఉంది. ఉజ్వల లబ్ధిదారులకు రూ.300 ఎల్‌పిజి సబ్సిడీని వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రభుత్వ చర్యలతో, ప్రామాణిక 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్‌పిజి సిలిండర్ ధర ఇప్పుడు ఢిల్లీలో రూ. 803, ముంబైలో రూ. 802.50, కోల్‌కతాలో రూ. 829 చెన్నైలో రూ. 818.50. ఉజ్వల వినియోగదారులకు ఎల్పీజీ సిలిండర్ ధర - సబ్సిడీ ప్రయోజనంతో సహా - ఢిల్లీలో రూ. 503, ముంబైలో రూ. 502.50, కోల్‌కతాలో రూ. 529 చెన్నైలో రూ. 518.50గా ఉంది.
ఇది కూడా చదవండి: ఎన్నికల వేళ బీజేపీ పొత్తుల క్రీడ.. ఏమిటో ఆ వ్యూహం!