నిండుకుండల్లా..
అంతేకాకుండా హైదరాబాద్ శివార్లలోని జంట జలాశయాలు ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్‌లకు వరద పోటెత్తుతోంది. రెండు జలాశయాలు నిండుకుండల్లా మారాయి. దీంతో హిమాయత్ సాగర్ రెండు గేట్లు ఎత్తి 700 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. హిమాయత్ సాగర్‌కు 1600 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. ఈ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 1761.20 అడుగులుగా ఉంది. ఉస్మాన్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 1784.70 అడుగులుగా ఉంది. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తివేయడంతో మూసీ నదికి వరద పెరిగింది. మూసీ పరీవాహక ప్రాంత ప్రజలను, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు.
ఇళ్లలోకి వరద నీరు
స్థానిక కొత్తకుంట బ్యాక్‌వాటర్ ఇళ్లలోకి చేరడంతో ఆ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుండిగల్ పోలీసులు ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టి..పుట్టీలను తెప్పించి 60 కుటుంబాలను బయటకు తీసుకొచ్చారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పునరావాసం కల్పించారు. వర్షాలు, వరదలతో జీహెచ్ఎంసీకి 500కుపైగా ఫిర్యాదులు వచ్చాయి. ఏదైనా అత్యవసరమైతే హైల్ప్ లైన్ నంబర్ 040-21111111, డీఆర్ఎఫ్ బృందాల సాయం కోసం 9000113667 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని అధికారులు సూచించారు. ఇక సరూర్‌నగర్ చెరువు నుంచి కూడా నీరు విడుదల చేయడంతో కాలనీల్లోకి వరద వచ్చింది. మూసాపేట్‌లోని ఐడీఎల్ చెరువులో నీటిమట్టం డేంజర్ లెవల్‌కు చేరుకుంది. కుత్బుల్లాపూర్‌లో సూరారం చెరువు ఉప్పొంగి, గాజులరామారం డివిజన్లోని ఓక్షిత్ ఎన్క్లేవ్ కాలనీ నీట మునిగింది. మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీలో కాలనీలు నీట మునిగాయి. మల్లంపేటలోని బతుకమ్మకుంట, బౌరంపేటలోని సింహపురి కాలనీలు వరద నీరుతో నదుల కనిపిస్తున్నాయి.
ఇంకా 4 రోజులు భారీ వర్షాలు
తెలంగాణలో మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, కామారెడ్డి, సూర్యాపేట, మహబూబాబాద్, హైదరాబాద్, సూర్యాపేట, సిద్దిపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని అధికారులు అంచన వేస్తున్నారు. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ వాతావరణశాఖ జారీ చేసింది. ప్రజలందరూ బయటకు రాకుండా ఇంట్లోనే ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.