ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ అశ్విని తానజీ వాకిడే పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లాలోని వర్దన్నపేట నియోజకవర్గం కేంద్రంలో శనివారం కలెక్టర్ పర్యటించారు. ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించేందుకు 5కే రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. జెండా ఊపి 5కే రన్‌ను ప్రారంభించారు. 5కే రన్‌లో ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు పెద్ద సంఖ్యలో యువతీ యువకులు పాల్గొన్నారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రతీ ఒక్కరికి ఓటు హక్కును కల్పించిందన్నారు. ప్రజలకు ఓటే అయుదమన్న ఆమె.. ఓటర్లు తమ ఆయుదం ద్వారానే అసలైన వారిని తమ నాయకుడిగా ఎన్నుకుంటారన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు. అదేవిధంగా ఓటు ప్రాముఖ్యత పైన అందరితో ప్రతిజ్ఞ చేయించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం జిల్లాలో పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తున్నామన్నారు.
మరోవైపు ఓటు హక్కు కలిగియున్న ప్రతి ఒక్కరు సక్రమంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ అశ్విని తానజీ వాకిడే పిలుపునిచ్చారు. ఓటర్లు రాజకీయ నేతల మాటలు నమ్మొద్దని, డబ్బులు తీసుకుంటే ఓట్లను అమ్ముకున్నట్లే అవుతుందన్నారు. ప్రజలు ఓట్లను అమ్ముకుంటే అది చట్ట విరుద్దం అయినట్లే అవుతుందన్నారు. ఎన్నికల సమయంలో డబ్బులు తీసుకుంటే వారికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.