Revanth Reddy: భారీ వర్షాలు, వరదల కారణంగా వాటిల్లిన నష్టాన్ని జాతీయ విపత్తుగా పరిగణించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టం, సహాయక చర్యలపై ఆయన ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. ఈ సమీక్షలో వెంటనే చేపట్టాల్సిన సహాయక చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. వెంటనే వరద నష్టంపై కేంద్రానికి సమగ్రమైన నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
ప్రధాని పర్యటనకు రావాలి..
Revanth Reddy: పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరుతూ లేఖ రాయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమయంలో ప్రధాని వచ్చి స్వయంగా పరిస్థితిని పరిశీలించాలని, ఈ వరదల నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరుతూ లేఖ రాయనున్నారు. అలాగే వరద బాధితులను ఆదుకునేందుకు తక్షణ సహాయం అందించాలని సమావేశంలో విజ్ఞప్తి చేశారు.
తక్షణ సహాయంగా 5 కోట్లు..
Revanth Reddy: వరదల ప్రభావిత ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట తదితర ప్రాంతాల్లో తక్షణ సహాయంగా 5 కోట్ల రూపాయలు విడుదల చేశారు. అలాగే మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు. చనిపోయిన పశువులు, మేకలు, గొర్రెలకు పరిహారం పెంచాలని కూడా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సహాయ కార్యక్రమాల కోసం ప్రతి కలెక్టరేట్‌లో కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో విపత్తులు ఎదుర్కునే వ్యవస్థను సన్నద్ధం చేయాలని సూచించారు. అత్యవసర సేవల కోసం రాష్ట్రంలోని 8 పోలీస్ బెటాలియన్లకు ఎన్డీఆర్ఎఫ్ తరహాలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.
పరిహారం పెంపు . .
చని పోయిన పాడి గేదెలు ఒక్కో దానికి ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ. 30 వేల నుంచి రూ. 50 వేలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు . మరణించిన మేకలు, గొర్రెలకు ఒక్కోదానికి ఇచ్చే రూ. 3 వేల సాయం రూ.5 వేలకు పెంచాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు . తక్షణం బాధిత కుటుంబాలకు అందించాలని, అలాగే వర్షాలు, వరదల కారణంగా పూర్తిగా దెబ్బతిన్న పంటలకు ఒక్కో ఎకరానికి రూ. 10 వేల చొప్పున పంట నష్ట పరిహరం అందించేందుకు తక్షణ ఏర్పాట్లు చేయలని రేవంత్ రెడ్డి ఆదేశాలు జరీ చేశారు .
హైదరాబాద్ ట్రాఫిక్..
Revanth Reddy: వర్షాలు, వరదల కారణంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా కమిషనర్లు చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి చెప్పారు. దెబ్బతిన్న రోడ్లను తక్షణమే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా విద్యుత్ సరఫరాలో తలెత్తే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలనీ, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అప్రమత్తంగా ఉంది చర్యలు తీసుకోవాలనీ అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణా సీఎస్ శాంతి కుమారి, తెలంగాణా డీజీపీ జితేందర్ లతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.