Telangana Election 2023:తెలంగాణలో దుమ్ములేపిన కాంగ్రెస్.. గెలుపుకు 12 ముఖ్య కారణాలివే

తెలంగాణలో కాంగ్రెస్ మొత్తానికి గెలిచి చూపిస్తోంది. మార్పు కావాలి..కాంగ్రెస్ రావాలి అన్న నినాదానికి అనుగుణంగా తెలంగాణ ప్రజలు ఈసారి కాంగ్రెస్ కు పట్టం కట్టారు. తిరుగులేని విధంగా ఆధిక్యం సంపాదించుకుంటూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా దూసుకుపోతోంది.

Telangana Election 2023:తెలంగాణలో దుమ్ములేపిన కాంగ్రెస్.. గెలుపుకు 12 ముఖ్య కారణాలివే
New Update

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకుపోతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలయినప్పుడు కూడా తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్సే వస్తుందన్న భావన రాజకీయ వర్గాల్లో ఉంది. మెజార్టీ రాజకీయ విశ్లేషకులు, నాయకులంతా ఇదే అంచనా వేశారు. కానీ ఇప్పుడు లెక్క మారింది. అసలు ఎన్నికల హడావుడి మొదలయిన దగ్గర నుంచే కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది. సర్వేలు కూడా కాంగ్రెస్సే గెలుస్తుందని ఢంకా భజాయించి మరీ చెప్పాల్సిన పరిస్థితిని తీసుకువచ్చింది హస్తం పార్టీ. ఆఖరికి అదే నిజమైంది కూడా. అయితే కాంగ్రెస్‌ గెలుపునకు కారణాలు ఏంటి ? తెలంగాణలో హస్తం గాలి ఎలా వీచింది? మరోసారి ప్రజలు చేయి గుర్తు వైపు ఎందుకు టర్న్ అయ్యారు? అంటే దీనికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఇవి...

రేవంత్ రెడ్డి...
కాంగ్రెస్‌ గెలుపునకు ప్రధాన కారణం రేవంత్ రెడ్డి. మొత్తం పార్టీ అంతా తానై నడిపించారు. పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలకు చెక్ పెట్టారు. సీనియర్ల అలిగినా కూడా నచ్చ చెప్పారు. అందర్నీ తనదారికి తెచ్చుకున్నారు. పార్టీని ఏకం చేసి బలంగా ముందుకు తీసుకెళ్ళారు. అనేక నియోజకవర్గాలను చుట్టేసి ప్రచారాన్ని పరుగులు పెట్టించారు. ఏకంగా కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పైనే బరిలోకి దిగి పార్టీ కేడర్ లో జోష్ నింపారు. కేసీఆర్ ను వెనక్కు నెట్టి అక్కడ రెండో స్థానంలో నిలిచి సత్తా చాటారు రేవంత్. కాంగ్రెస్ వేవ్ లో కీలక పాత్ర పోషించారు.

కర్ణాటక...

కర్ణాటకలో  కాంగ్రెస్ గెలుపు కూడా తెలంగాణ ఎన్నికలపై పడింది. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపింది. కర్నాటకలో ప్రకటించిన పథకాల ఐడియానే తెలంగాణలో కూడా అమలు చేయడం కలిసి వచ్చింది. ఎన్నికల హామీలతో పాటు కాంగ్రెస్ నేతల మధ్య ఐక్యత కూడ ఆ పార్టీకి కలిసి వచ్చింది. ఎన్నికలు జరుగుతాయని తెలిసిన దగ్గర నుంచీ పార్టీ అంతా ఒక్కతాటి మీద నడిచింది. ఈ ఐకమత్యమే కాంగ్రెస్ కు చాలా కలిసి వచ్చింది. పెద్ద నేతలందరూ ఒక్క మాట మీదనే నిలబడ్డారు. పార్టీ గెలిచిన తర్వాతే ఇతర విషయాలపై ఫోకస్ పెట్టాలనే అభిప్రాయంతో సీనియర్లు ముందుకు కదిలారు. అదే సమయంలో ప్రత్యర్థులను ఆత్మరక్షణలో పడేసే వ్యూహంతో వెళ్లారు కాంగ్రెస్ నేతలు.ఈ వ్యూహం కాంగ్రెస్ కు మరింత కలిసి వచ్చింది. అభ్యర్ధులను ఎన్నుకోవడం, ప్రకటిండం అన్నింటిలోనూ కలిసి కట్టుగా పని చేశారు. ఇక ఎన్నికల ప్రచారంలో కూడా కలిసి ముందుకు సాగారు. ఇవన్నీ కూడా గెలుపును బాగా ప్రభావితం చేశాయి.

ఆరు గ్యారెంటీలు...
తెలంగాణలో కాంగ్రెస్ గెలుపులో ఆ పార్టీ మేనిఫెస్టో కీలక పాత్ర పోషించింది. కర్ణాటక మాదిరిగానే ఆరు గ్యారెంటీలను ప్రకటించడం...బీఆర్ఎస్ కన్నా ముందే మేనిఫెస్టో తో ప్రజల్లోకి వెళ్ళాడం ఆపార్టీకి బాగా కలిసి వచ్చింది. ఈ మేనిఫెస్టో ప్రజల్లోకి వెళ్లింది. మహాలక్ష్మీ పథకం, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, చేయూత, రైతు భరోసా స్కీంలు ప్రజల్ని కాంగ్రెస్ వైపు ఆకర్షించేలా చేశాయి. వీటికి తోడు ప్రస్తుత కేసీఆర్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కూడా కాంగ్రెస్‌కు కలిసి వచ్చింది. కాంగ్రెస్ గెలుపునకు కారణం అయ్యింది. ఇవే కాకుండా తెలంగాణ యువత అత్యంత అసంతృప్తిగా ఉన్న ఉద్యోగాల విషయం కాంగ్రెస్ అనుసరించిన వ్యూహం అద్భుతంగా పని చేసిందనే చెప్పాలి. అధికారంలోకి వచ్చాక ఎప్పుడెప్పుడు ఏఏ ఉద్యోగాల నోటిఫికేషన్లను విడుదల చేస్తామన్నది డేట్లతో సహా ఎన్నికలకన్నా ముందే చెప్పడం తెలంగాణ ప్రజలను ఆకట్టుకుందనే చెప్పాలి. మెజారిటీ యువత కాంగ్రెస్ వైపుకు మొగ్గడానికి ప్రధాన కారణం ఇదేనని చెప్పొచ్చు.

నేతల చేరిక...
మరో వైపు ఎన్నికల సమయంలో బీజేపీ, బీఆర్ఎస్ ల నుండి కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడం కూడ ఆపార్టీకి మరింత ఊపును తీసుకు వచ్చింది. కాంగ్రెస్ లో చేరిన నేతలు కూడ బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని చేసిన ప్రచారం కూడ కాంగ్రెస్ కు మరింత కలిసి వచ్చింది. పొంగులేటి, తుమ్మల, జూపల్లి, కసిరెడ్డిలాంటి గెలుపు గుర్రాలు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ కు రావడం పెద్ద ప్లస్ అయింది. దీంతో పాటూ రూల్స్ ను పక్కన పెట్టేశారు. పాత సంప్రదాయాలను, ఒకే కుటుంబంలో ఇద్దరుకు సీట్లు ఇవ్వకూదన్న నియమాన్ని పక్కన పెట్టేసి విజయమే లక్ష్యంగా పనిచేశారు. కీలక నేతల అనుచురులకు కూడా టికెట్లు ఇవ్వలేదు. సీపీఐతో పోత్తు పెట్టుకున్నా ఒక్కటే సీటుకు ఒప్పించగలిగారు. సీపీఎం వెళ్ల పోతా అన్నా పట్టించుకోలేదు. గెలవరు అని అనుకున్న పొన్నాల లక్ష్మ య్య, వనపర్తి చిన్నారెడ్డిలాంటి వారిని నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేశారు.

కాన్ఫిడెన్స్...
ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాలా నమ్మకంగా పని చేసింది. ఆరు పథకాలను ప్రకటించడం దగ్గర నుంచీ ముందు నుంచీ గెలుపు తమదే అని ప్రచారం చేయడం వరకు అన్నీ కాన్ఫిడెన్స్ గా చేసింది. ఇది వారికి బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. ఇది ప్రజల్లో కాంగ్రెస్ పట్ల పాజిటివిటీని పెంచింది. దీంతో పాటూ డిసెంబర్ 9న ముఖ్యమంత్రి ప్రమాణం స్వీకారం ఉంటుందని రేవంత్ రెడ్డి ప్రకటించడం కూడా ఆ పార్టీ గెలుపు నమ్మకాన్ని తెలంగాణ ప్రజలకు చూపించింది.

సోషల్ మీడియా...
కాంగ్రెస్ గెలవడానికి సోషల్ మీడియా కూడా కారణమయ్యిందనే చెప్పాలి. వీటిల్లో ఇచ్చిన యాడ్ లు, పాటలు లాంటివి కాంగ్రెస్ ను ప్రజల్లోకి విపరీతంగా తీసుకువెళ్ళాయి. 'మార్పు కావాలి..కాంగ్రెస్ రావాలి' అన్న నినాదం చిన్న పిల్లల నోట్లో కూడా వినిపించింది అంటే అర్ధం చేసుకోవచ్చు సోషల్ మీడియాలో కాంగ్రెస్ ఎంత పాపులర్ అయిందో. అంతేకాకుండా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఇచ్చిన యాడ్స్ కూడా ఆకట్టుకున్నాయి.

కాంగ్రెస్ గెలుపుకు ముఖ్య కారణాలు...
➼ఆరు గ్యారెంటీలు
➼కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడంతో పాజిటీవ్ వేవ్
➼టికెట్ల కేటాయింపుతో అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహారించారు..
➼గెలవని వారిని నిర్థాక్షణ్యంగా పక్కన పెట్టడం
➼నిరుద్యోగులను తమ వైపునకు తిప్పుకోవడం
➼సోషల్‌మీడియాలో వినూత్న ప్రచారం
➼ఐకమత్యంగా వెళ్ళడం
➼సీపీఐతో పొత్తు పెట్టుకున్నా ఒక్క సీటే ఇవ్వడం
➼సీపీఎం వెళ్ళిపోయినా ఆపకపోవడం
➼గెలుస్తామన్న కాన్ఫిడెన్స్
➼ఇతర పార్టీల నుంచి గెలుపు గుర్రాలు కాంగ్రెస్ లోకి రావడం

➼పాత సంప్రాదాయాలను, రూల్స్ ను పక్కన పెట్టడం

#congress #telangana-elections-2023 #win #reasons
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe