Eagle Movie Review : తుపాకీ రెక్కలతో.. మాస్ రచ్చ.. రవితేజ ఈగల్ 

మాస్ మహారాజా రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈగల్ సినిమా ఈరోజు ఫిబ్రవరి 9న విడుదలైంది. ఈగల్ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులకు మజా ఇచ్చిందా లేదా తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. 

New Update
Eagle Movie Review : తుపాకీ రెక్కలతో.. మాస్ రచ్చ.. రవితేజ ఈగల్ 

Eagle Movie Review : మాస్ మహారాజా రవితేజ(Ravi Teja).. ఈ మధ్యకాలంలో సరైన మాస్ మేజిక్ మిస్ అవుతూ వస్తున్నాడు. రవితేజ ఉంటే యాక్షన్ ప్లస్ ఫన్ గ్యారెంటీ అని భావించే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. అయితే, రవితేజ నుంచి అలాంటి ఫన్ మిక్స్ యాక్షన్ మూవీ వచ్చి చాలాకాలం అయింది. ఇక మన సినిమా వేరే టర్న్ తీసుకుంది ఈ మధ్య. ఫుల్ ఆఫ్ యాక్షన్.. నో లాజిక్.. హాలీవుడ్ రేంజ్ పేరుతొ విపరీత పోకడలు పోతోంది. ఆ సినిమాలలు బాక్సాఫీసు దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్నాయి కూడా. దీంతో ఇప్పుడు రవితేజ అదే తరహా సినిమాని ఎంచుకున్నాడు. ఈగల్(Eagle Movie Review) అంటూ థియేటర్లలోకి వచ్చేశాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఈగల్ నిజానికి పండక్కి ప్రేక్షకులను పలకరించాలి. కానీ, థియేటర్ల సమస్య తో కొద్దిగా వెనక్కి తగ్గి ఈరోజు అంటే ఫిబ్రవరి 9న విడుదలైంది. మరి మాస్ మహారాజా రవితేజకి ఈ సినిమా మరో హిట్ ఇచ్చిందా? కార్తీక్ ఘట్టమనేని పూర్తి యాక్షన్ సినిమాని ఎలా హ్యాండిల్ చేశాడు? ఈగల్ సినిమా ఆకట్టుకుంటుందా? అన్ని విషయాలు చెప్పేసుకుందాం. 

ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే.. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని(Karthik Ghattamaneni) తో మొదలు పెట్టాలి. ఈ మధ్య వస్తున్న యాక్షన్ సినిమాలను చూసి బాగా ఇన్స్పైర్ అయి ఈ సినిమా కార్తీక్ సిద్ధం చేశాడు అనిపిస్తుంది. కథలో చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. చాలా మామూలు కథ.. అచ్చం కేజీఎఫ్(KGF) లా. ఒక వ్యక్తిని హీరోగా ఎలివేట్ చేయడం.. దానికోసం సీన్స్ అల్లుకోవడం.. ఆ సీన్స్ ని అన్నిటినీ.. ఒక మూడుగంటలు సరిపడా కొట్టేసి.. వాటికి బీజీఎం.. ఎఫెక్ట్స్ యాడ్ చేసి సినిమా రెడీ చేయడం. ఈ సినిమా కూడా అంతే. హీరో ఎలివేషన్ విషయంలోనే కొత్తదనం చూపించే ప్రయత్నం చేశాడు కార్తీక్. మామూలుగా అయితే.. హీరో ఎంట్రీ ఓ ఫైట్.. హీరోయిన్.. రొమాన్స్.. ఓ పాట అంతేకదా సినిమా అంటే. కానీ, హీరో గురించి ఇచ్చే ఎలివేషన్స్ అన్నీ వేరే పాత్రల కోణంలో కనిపిస్తాయి. అంటే.. హీరో చేతిలో దెబ్బతిన్నవారు.. హీరో వలన మంచి జరిగిన వారు.. హీరో ఎవరో తెలుసుకోవాలని చేసే ప్రయత్నంలో తాము తెలుసుకున్న విషయాలు చెప్పడం..  ఇలా రకరకాల పాత్రలు హీరోని ఎలివేట్ చేస్తూ పోతుంటారు. ఆ సీన్స్ అన్నీ వరుసగా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా వచ్చేస్తూ ఉంటాయి ఫస్టాఫ్ లో. ఒక జర్నలిస్ట్ హీరో గురించి తెలుసుకోవాలి అనుకోవడంతో మొదలైన సినిమా  క్రమంగా రకరకాల పాత్రలు.. అవన్నీ హీరో కోసం ఇచ్చే ఎలివేషన్స్ తో గందరగోళంగా కనిపిస్తుంది. అయితే ఇదంతా ఫస్టాఫ్ వరకే. ఒక్కసారి అంతా ట్రాక్ ఎక్కాకా.. సెకండ్ హాఫ్ లో హీరో విశ్వరూపం కనిపించేస్తుంది. అక్కడి నుంచి అంతా మారిపోతుంది. చివరి అరగంట సినిమా చూస్తే మనం అంతకు ముందు ఏమి చూశామో కూడా మర్చిపోతాం. బయటకు వచ్చేటప్పుడు చివరిలో చూసిన యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రమే గుర్తుంటాయి. ఇక్కడ కార్తీక్ ప్రతిభను కచ్చితంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే, సినిమాకి ఎడిటింగ్ కూడా కార్తీక్ చేశాడు. 

Also Read : Brahmamudi Serial: దుగ్గిరాల ఇంటి బాధ్యతలను కోడలికి అప్పగించిన అపర్ణ.. కావ్య ను దోషిగా నిలబెట్టాలని రుద్రానీ, అనామికల కుట్ర

కథగా..
కథగా చెప్పుకోవాలంటే.. ఈగల్ గా ప్రపంచాన్ని గడగడలాడించిన వ్యక్తి.. ఒక మారుమూల అడివిలో పెద్ద కోటలో సహదేవ్ గా ఎందుకు ఉన్నాడు అనే పాయింట్ చుట్టూ కథ తిరుగుతుంది. సహదేవ్ గురించి వెతుకులాట మొదలు పెట్టిన లేడీ జర్నలిస్ట్ కి ఎటువంటి విషయాలు తెలిశాయి? అసలు ఈగల్ సహదేవ్ గా మారడం వెనుక కథేమిటి? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈగల్ సినిమా. 

నటనాపరంగా..
ఇక నటన పరంగా మాట్లాడుకుంటే.. రవితేజ ఫస్ట్ హాఫ్ లో కనిపించేది తక్కువ. కానీ.. సహదేవ్.. ఈగల్ అంటూ అతని గురించి వినిపించే సౌండ్ ఎక్కువ. ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి లవ్.. సెంటిమెంట్.. యాక్షన్ అన్నిటిలోనూ కనిపిస్తాడు. మొత్తం సినిమాని తన భుజాల మీదకు తీసేసుకున్నాడు. ప్రతి సీన్ లోనూ ఎక్కడా తగ్గలేదు. ఎలివేషన్స్ సీన్స్ అన్నీ చాలా బాగా వచ్చాయి. వాటిలో రవితేజ మార్క్ కనబడింది. ఇక సినిమా అంతా కనిపించేది మాత్రం నవదీప్, అనుపమా పరమేశ్వరన్. ఇద్దరూ కూడా సినిమాకి చాలా ప్లస్ అని చెప్పాలి. నవదీప్ చాలా సెటిల్డ్ గా చేశాడు. అనుపమ ఆ పాత్రకు సరిగ్గా సరిపోయింది. ఇంకా రవితేజ ప్రియురాలిగా కొన్ని సీన్స్ లో కనిపించిన కావ్యా థాపర్ ఫర్వాలేదనిపించింది. మధుబాల, అవసరాల శ్రీనివాసరావు.. ఇంకా చాలామంది ఉన్నారు. అందరూ హీరో ఎలివేషన్ కోసం బాగానే చేశారు. 

టెక్నీకల్ గా..
టెక్నీకల్ గా సినిమా(Eagle Movie Review) విషయానికి వస్తే.. కార్తీక్ ఘట్టమనేని, కమిల్ ప్లాకీ, కర్మ్ చావ్లా ఫొటోగ్రఫీ అదిరిపోయిందని చెప్పాలి. సినిమాకి దావ్‌జాంద్ బీజీఎం ప్రాణం పోసింది. సినిమాలో పాటలు పెద్దగా చెప్పుకునే పని లేదు. ఇక కార్తీక్ ఎడిటింగ్ బావుంది. కారణం మణిబాబు మాటలు ఫర్వాలేదనిపిస్తాయి. ఇక దర్శకుడిగా కార్తీక్ ఘట్టమనేని గురించి చెప్పాలంటే.. పూర్తి  యాక్షన్ మూవీగా సినిమాని మలచడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. రవితేజ అభిమానులను అలరించే విధంగా సినిమాని నడిపించడంలో కార్తీక్ కి మంచి మార్కులే పడతాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టీజీ విశ్వప్రసాద్ ఎక్కడా ఖర్చుకు వెనకాడలేదనేది సినిమా క్వాలిటీ చెబుతుంది. 

సినిమా ఎలా ఉంది అంటే..
ఇక సినిమా ఎలా ఉంది  అని చెప్పుకోవాలంటే.. యాక్షన్ సినిమాలు ఇష్టపడేవారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ముందే చెప్పినట్టు ఫస్ట్ హాఫ్ లో చాలా గందరగోళం అనిపిస్తుంది. దానికి తగ్గట్టే అనుపమ తో ఈగల్ గురించి అర్ధం చేసుకోవాలంటే చాలా ఇంటిలిజెంట్ అయి ఉండాలి అని ఒక పాత్రతో అనిపిస్తారు. సినిమా చూడాలంటే.. అర్థం చేసుకునే తెలివితేటలు కూడా ప్రేక్షకులకు ఉండాలని చెప్పినట్టు అనిపించింది. థియేటర్ లో కూడా ఈ డైలాగ్ దగ్గర అందరూ ఒక ఓ వేసుకున్నారు. ఇలాంటి కొన్ని సీన్స్ ఉన్నాయి. లాజిక్ లేకుండా చూసేయడమే. ముఖ్యంగా అడవిలో ఉన్న అనుపమ చక్ మని పోలెండ్ వెళ్ళిపోతుంది. మళ్ళీ అంతే స్పీడ్ లో అడివిలోకి వచ్చేస్తుంది. సరే ఇదీ ఒకరకమైన ఎంటర్టైన్మెంట్ అని సరిపెట్టేసుకోవచ్చు. ఇక సినిమా మొత్తం కేజీఎఫ్ ప్రభావం కార్తీక్ మీద చాలా ఉంది అనిపించేలా ఉంది. అంతేకాదు.. సెకండ్ హాఫ్ సినిమా అంతా పెద్ద స్క్రీన్ మీద పబ్జీ(PUBG) చూస్తున్నట్టుగానే ఉంటుంది. ఇక్కడ కూడా ఒక మాట చెప్పుకోవాలి. దర్శకుడిగా కార్తీక్ ప్రేక్షకులకు చాలా గౌరవం ఇచ్చాడు. ముందుగానే సినిమాలోని పాత్రలతో అన్ని విషయాలు చెప్పించేస్తాడు. ఇప్పుడు ఉంటాది.. అసలైన పబ్జి అనీ.. ఇదంతా పబ్జీ గేమ్ లా ఉంటుంది అని డైలాగులు చెప్పి మనకు ముందే హింట్ ఇస్తాడు. అందువల్ల పబ్జీ గేమ్ అంటే ఇష్టం ఉన్నవాళ్లకి ఇది బాగా నచ్చుతుంది. ఇక రవితేజను చాలాబాగా ఎలివేట్ చేశాడు కార్తీక్. 

Also Read: హనుమాన్ డైరెక్టర్ ట్వీట్.. రూమర్స్ కి ప్రశాంతంగా చెక్.. 

మొత్తంగా చూసుకుంటే రవితేజ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తుంది ఈ సినిమా. లాజిక్ పట్టించుకోకుండా సినిమా చూసే ప్రేక్షకులకు సినిమా బావుంది అనిపిస్తుంది. యాక్షన్ ఉంటే  చాలు అనుకునేవారికి చివరి అరగంట తప్పితే సినిమా నచ్చకపోవచ్చు. సినిమా ఎలా ఉంది అని కచ్చితంగా చెప్పాలంటే ఇది రవితేజ మాస్ ఊచకోత. ఫర్వాలేదు.  చూడొచ్చు అని చెప్పవచ్చు. 

చివరిగా ఒక్కమాట.. మీరు కనుక పబ్జీ గేమ్ అభిమాని అయితే ఈ సినిమా చూడండి.. ఒక లెవెల్ లో ఉంటుంది. ఒకవేళ మీరు పబ్జీ గేమ్ తో పాటు రవితేజకి వీరాభిమానులు అయితే ఈగల్ సినిమా చూసి గాలిలో తేలిపోవడం గ్యారెంటీ. 

Watch this interesting Video: 

Advertisment
తాజా కథనాలు