విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందుపై కొందరు వ్యక్తులు ఇటీవల సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న విషయం తెలిసిందే. చంద్రబాబుకు రిమాండ్ విధించిన తర్వాత జడ్జి హిమబిందును టార్గెట్ చేస్తూ జడ్జిని కొందరు ట్రోల్ చేస్తున్నారు. విషయం జడ్జి దృష్టికి వెళ్లడంతో ఆమె రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. తన మార్ఫింగ్ ఫొటోలతో అసభ్యకర పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఈ విషయంపై రాష్ట్రపతి భవన్ సీరియస్ అయ్యింది.
జడ్జిపై పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ సీఎస్‌కు రాష్ట్రపతి కార్యదర్శి పీసీ మీనా నుంచి ఆదేశాలు అందాయి. ఇలా పోస్టులు పెడుతున్న వారిపై తీసుకున్న చర్యలను జడ్జికి వివరించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాష్ట్రపతి భవన్ నుంచి లేఖ అందింది. దీంతో జడ్జిపై సోషల్ మీడియాలో పోస్టులు చేసిన వారిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉంది.
జస్టిస్ హిమ బిందు ఎవరు?
జస్టిస్ బొక్క సత్య వెంకట హిమ బిందు.. చంద్రబాబు కేసులో తీర్పు ఇచ్చిన ఏసీబీ న్యాయమూర్తి పూర్తి పేరు ఇది. ప్రస్తుతం రెండు తెలుగురాష్ట్రాల్లో మారుమోగుతున్న పేరు కూడా జస్టిస్ హిమబిందుదే. 2016లో తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా పనిచేశారు జస్టిస్ హిమబిందు. అంతకు ముందు ఆమె ఏసీబీ కోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుపై జస్టిస్ హిమ బిందు ఇచ్చిన రిమాండ్ తీర్పు అందరి దృష్టినీ ఆకర్షించింది. గతంలో కూడా ఆమె అనేక సంచలన తీర్పులు ఇచ్చారు.
ఇదిలా ఉంటే.. జడ్జి హిమబిందుపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను పశ్చిమ గోదావరి జిల్లా గౌడ సమస్య సంఘం నాయకులు ఇటీవల ఖండించారు. న్యాయపరంగా తీర్పు ఇచ్చిన జడ్జిపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా వస్తున్న పోస్ట్‌ల ను గుర్తించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే గౌడ, శెట్టిబలిజ, శ్రీశైన, ఈడిగ, యాత కులాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా రోడ్లమీదకు వచ్చి ధర్నాలు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
Read This:
Chandrababu Custody: చంద్రబాబుకు సీఐడీ 15 ప్రశ్నలు.. సమాధానం చెప్పేనా?