Ram Charan Tweet: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు, ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం గురించి చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతోంది. రాజకీయ ప్రముఖులు ఉదయనిధి వ్యాఖ్యలను తప్పుపడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌చరణ్ గతంలో చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 2020 సెప్టెంబర్ 11న చెర్రీ తల్లి సురేఖ ఇంట్లో తులసి మొక్కకు పూజా చేస్తున్న ఫోటోని షేర్ చేసిన చరణ్.. 'మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవడం మనందరి బాధ్యత' అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ని నెటిజన్లు రీట్వీట్ చేస్తూ ఉదయనిధిపై మండిపడుతున్నారు.
చెన్నైలో ఇటీవల జరిగిన ఓ రచయితల సమావేశంలో ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని కేవలం ప్రతిఘటిస్తే సరిపోదని పూర్తిగా నిర్మూలించాలని పిలుపునిచ్చారు. సనాతన ధర్మం దోమ లాంటిదని, డెంగ్యూ, మలేరియా, కరోనాలతో పోలుస్తూ వాటిని వ్యతిరేకించలేం.. నిర్మూలించాల్సిదేనని అభిప్రాయపడ్డారు. సనాతన అనేది సంస్కృత పదమని.. సామాజిక, సమానత్వానికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలో ఇతర పార్టీల నేతలు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. సనాతన ధర్మాన్ని అవమానించేలా ముఖ్యమంత్రి కుమారుడు మాట్లాడుతున్నారని అమిత్ షా విపక్షాలపై మండిపడ్డారు. మరోవైపు పలు రాష్ట్రాల్లోని నేతలు ఉదయనిధిపై కేసులు కూడా పెడుతున్నారు.
Also Read: సచిన్ చేతుల మీదుగా ముత్తయ్య బయోపిక్ ట్రైలర్
అలాగే తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి’ అంటూ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్‌లోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి పిచ్చి మాటలు ఆయనకు మంచిది కాదంటూ హితవు చెప్పారు. ‘తమిళనాడు సీఎం కుమారుడు, ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ ప్రకటన చూశాం. క్యాబినెట్ మంత్రిగా, రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్నారు. ఆయన ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. సనాతన ధర్మం గురించి ఆయనకు ఏం తెలుసని మాట్లాడుతున్నారు. ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలంటూ హితవు పలికారు.
తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని ఉదయనిధి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ‘‘సనాతన ధర్మం కారణంగా ఇబ్బందులు పాలైన బడుగు, అణగారిన వర్గాల తరుపునే నేను మాట్లాడా. పేరియార్, అంబేద్కర్ వంటి మహోన్నత వ్యక్తులు ఈ అంశంపై లోతైన పరిశోధనలతో పలు రచనలు చేశారు. సమాజంపై సనాతన ధర్మం ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించిందో చెప్పారు. అవన్నీ తెలిపిందేకు నేను సిద్ధంగా ఉన్నా. నా ప్రసంగంలోకి కీలక భాగాన్ని ఇక్కడ మరోసారి ప్రస్తావిస్తున్నా. దోమల కారణంగా కరోనా, డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు ఎలా వ్యాపిస్తాయో అదే విధంగా సనాతన ధర్మం సామాజిక రుగ్మతలకు దారి తీసింది. న్యాయస్థానంలోనైనా.. ప్రజాకోర్టులో అయినా సరే.. ఎలాంటి సవాల్‌కైనా సరే సిద్ధంగా ఉన్నా. తప్పుడు వార్తల వ్యాప్తిని మానుకోండి’’ అంటూ ట్వీట్ చేశారు.
ఇది కూడా చదవండి: స్టాలిన్ సనాతన ధర్మపై ఆగని మాటల మంటలు.. పొలిటికల్ రియాక్షన్స్ ఇవే!