/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-18T125847.762.jpg)
Raksha Bandhan Facts : హిందూ మతంలో రాఖీ పండగకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. తోబుట్టువుల ప్రేమ, అనుబంధానికి గుర్తుగా రక్షబంధన్ జరుపుకుంటారు. 'రక్ష' అంటే రక్షించడం, 'బంధన్' అంటే సూత్రం అని అర్థం. అక్కా చెల్లెల్లు సోదరుడి క్షేమాన్ని కోరుకుంటూ వారి చేతికి రక్షగా ఈ రాఖీని కడతారు. దానికి ప్రతిగా సోదరులు వారికి ఎల్లవేళలా తోడుగా, రక్షగా ఉంటామని ప్రమాణం చేస్తారు. ఈ పండగ రోజున తోబుట్టువులు ఎంత దూరంలో సరే.. వారి దగ్గరికి వెళ్లి రాఖీ కడతారు అక్కాచెల్లెళ్లు.
భర్తకు కూడా రాఖీ..
అయితే రక్షాబంధన్ అనేది కేవలం తోబుట్టువుల బంధాన్ని మాత్రమే సూచించేది కాదు. భార్యాభర్తలు కూడా రక్షాబంధన్ పండగను జరుపుకోవచ్చని పురాణాలు చెబుతున్నాయి. భార్యలు భర్త క్షేమాన్ని, పురోగతిని, తలపెట్టిన పనిలో విజయం సాధించాలని ఆశిస్తూ రాఖీని కట్టవచ్చు. అంతేకాదు మనం ప్రేమించే వారెవరికైనా వారి క్షేమాన్ని, సుఖసంతోషాలను కోరుకుంటూ రక్షగా ఈ రక్షాబంధనాన్ని కట్టవచ్చు. అయితే భర్తకు.. భార్య రాఖీ కట్టడం వెనుక ఉన్న ఓ పురాణ కథ కూడా ఉంది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..
భర్త కోసం శచీదేవి రక్ష
పురాణాల ప్రకారం.. పూర్వం దేవతలకు, రాక్షసులకు మధ్య 12 సంవత్సరాల భీకర యుద్ధం జరిగింది. ఆ సమయంలో యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై ఒక చోట తలదాచుకుంటాడు. భర్త నిస్సహాయతను గమనించిన ఇంద్రాణి యుద్ధంలో పోరాడడానికి భర్తలో ఉత్సాహాన్ని నింపుతుంది. పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజించి దేవేంద్రుడి చేతికి రక్ష కట్టి యుద్దానికి పంపుతుంది. అలా వెళ్లిన దేవేంద్రుడు సమరంలో గెలిచి తిరిగి త్రిలోకాధిపత్యాన్ని పొందుతాడు. సరిగ్గా ఆరోజు పౌర్ణమి కావడంతో.. శచీదేవి కట్టిన రక్షాబంధనాన్ని .. నేడు రాఖీ పౌర్ణమిగా జరుపుకుంటారని చెబుతారు. తోబుట్టువులు, ప్రేమించిన వారు విజయం దిశగా అడుగులు వేయాలని, అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని రక్షగా కట్టే బంధనమే ఈ రక్షాబంధన్.