AP News: ఏపీ ప్రజలను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. బుడమేరుకు గండిపడి ఎన్నో ఇల్లు వరద నీటిలో మునిగిపోయాయి. ఈ ఘటన మరువక ముందే కాకినాడలో ఏలేరు కాలువకు గండి పడింది. దీంతో నాలుగు నియోజకవర్గాలలోని 86 గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా ఏపీలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. దీంతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.
ఈ రోజు కాకినాడ జిల్లాలో వరద బీభత్సం సృష్టించింది. భారీ వర్షం కారణంగా ఏలేరు ప్రాజెక్టుకు వరదనీరు పెరిగింది. దీంతో రాజుపాలెం వద్ద ఏలేరు కాలువకు గండి పడింది. దీంతో రాజుపాలెం కాలనీ వాసులు ఎప్పుడు ఏం జరుగుతుందోన్న టెన్షన్ తో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 4 నియోజకవర్గాల్లోని 86 గ్రామాలపై వరద ప్రభావం ఉన్నట్లు తెలుస్తోంది. కలువకు గండి పడటంతో లోతట్టు ప్రజలు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోటనందూరు సమీపంలో ఉన్న వెదుళ్లగడ్డ వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది.
తుని - నర్సీపట్నం ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు రావటంతో రాకపోకలు బంద్ అయ్యాయి. తాండవ జలాశయానికి ఒక్కసారిగా వరద పెరగటంతో కోటనందూరు, తుని, పాయకరావుపేట ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జిల్లా కలెక్టర్ షాన్ మెహన్ సీఎం, డిప్యూటీ సీఎంకు ఎప్పటికప్పుడు పరిస్థితి వివరిస్తున్నారు.