Yashasvi Jaiswal: 23వ పుట్టినరోజుకు ముందే రెండు ఐపీఎల్ శతకాలు!

రాజస్థాన్ రాయల్స్ యువఓపెనర్ యశస్వీ జైశ్వాల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ముంబై ప్రత్యర్థిగా రెండో సెంచరీతో తనకే సొంతమైన రికార్డు నెలకొల్పాడు. అయితే ఈ సెంచరీకి ఒక ప్రత్యేకత ఉంది.అదేంటో చూసేయండి!

New Update
Yashasvi Jaiswal: 23వ పుట్టినరోజుకు ముందే రెండు ఐపీఎల్ శతకాలు!

Yashasvi Jaiswal: రాజస్థాన్ రాయల్స్ యువఓపెనర్ యశస్వీ జైశ్వాల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ముంబై ప్రత్యర్థిగా రెండో సెంచరీతో తనకే సొంతమైన రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ 17వ (IPL 2024) సీజన్ లీగ్ లో మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ విజయపరంపర కొనసాగుతోంది. ప్రస్తుతసీజన్ మొదటి 8 రౌండ్లలో ఏడు విజయాలు సాధించిన తొలిజట్టుగా నిలిచింది. హోంగ్రౌండ్ సవాయి మాన్ సింగ్ స్టేడియం వేదికగా ఐదుసార్లు విజేత ముంబై ఇండియన్స్ తో జరిగిన 8వ రౌండ్ పోరులో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) 9 వికెట్లతో విజేతగా నిలవడమే కాదు..లీగ్ టేబుల్ టాపర్ గా తన పరిస్థితిని మరింత పటిష్టం చేసుకోగలిగింది.

ఐపీఎల్ చరిత్రలోని రెండు అత్యుత్తమ జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్ కి హార్థిక్ పాండ్యా నాయకత్వం ఏమాత్రం అచ్చివచ్చినట్లు కనిపించలేదు. మొదటి 8 రౌండ్లలో ఆరు పరాజయాలు చవిచూసిన తొలిజట్టుగా ఓ చెత్త రికార్డును మూటగట్టుకొంది. జైపూర్ వేదికగా జరిగిన ఈ కీలక సమరంలో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొని 20 ఓవర్లలో 9 వికెట్లకు 179 పరుగుల స్కోరు మాత్రమే సాధించగలిగింది. రాజస్థాన్ రాయల్స్ పేసర్ సందీప్ శర్మ 4 ఓవర్లలో 18 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టడం ద్వారా మ్యాచ్ వి్న్నర్ గా నిలిచాడు. యశస్వీ ధూమ్ ధామ్ సెంచరీ... మ్యాచ్ నెగ్గాలంటే 20 ఓవర్లలో 180 పరుగులు చేయాల్సిన రాజస్థాన్ రాయల్స్ కు ఓపెనింగ్ జోడీ యశస్వీ జైశ్వాల్- జోస్ బట్లర్ 74 పరుగుల భాగస్వామ్యంతో అద్దిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఆతరువాత కెప్టెన్ సంజు శాంసన్ తో కలసి రెండో వికెట్ కు109 పరుగుల భాగస్వామ్యంతో అలవోక విజయం అందించాడు.

Also Read: కొత్త వెహికిల్ కొనేవారికి రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. ఇక షోరూంలోనే రిజిస్ట్రేషన్లు!

కేవలం 60 బంతుల్లోనే 9 ఫోర్లు, 7 సిక్సర్లతో 104 పరుగులతో అజేయంగా నిలిచాడు. 22 సంవత్సరాల యశస్వీ కెరియర్ లో ఇది రెండో ఐపీఎల్ శతకం కావడం విశేషం. ముంబై ప్రత్యర్థిగానే యశస్వీ రెండు ఐపీఎల్ సెంచరీలు బాదడం విశేషం. 2023 సీజన్లో తొలిశతకం.. 2023 ఐపీఎల్ లో భాగంగా ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ తో జరిగిన పోరులో యశస్వీ 124 పరుగులతో తన తొలిశతకం సాధించాడు. 21 సంవత్సరాల 123 రోజుల వయసులో తన తొలి ఐపీఎల్ శతకం బాదిన యశస్వీ..2024 సీజన్లో సైతం ముంబై పైనే రెండోసెంచరీ సాధించడం ఓ అరుదైన రికార్డుగా నిలిచింది. అంతేకాదు..22 సంవత్సరాల 116రోజుల వయసులో రెండో ఐపీఎల్ శతకం సాధించడంతోనే ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకోగలిగాడు. ఐపీఎల్ 17 సీజన్ల చరిత్రలో..23వ పుట్టిన రోజుకు ముందే రెండు ఐపీఎల్ సెంచరీలు సాధించిన ఏకైక, తొలి బ్యాటర్ గా యశస్వీ చరిత్ర సృష్టించాడు.

ముంబై ప్రత్యర్థిగా మూడు ఐపీఎల్ శతకాలు బాదిన కెఎల్ రాహుల్ తర్వాతి స్థానంలో యశస్వీ నిలిచాడు. ప్రస్తుత సీజన్లో రాజస్థాన్ 3వ శతకం.. ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకూ జరిగిన 38 రౌండ్ల మ్యాచ్ ల వరకూ 7 శతకాలు నమోదైతే.. అందులో మూడు సెంచరీలు రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు సాధించినవే కావడం మరో రికార్డు. సీనియర్ ఓపెనర్ జోస్ బట్లర్ రెండు సెంచరీలు, యువఓపెనర్ యశస్వీ జైశ్వాల్ ఓ శతకమూ సాధించారు. మొదటి 8 రౌండ్లలో 7 విజయాలు సాధించిన జట్లలో రాజస్థాన్ రాయల్స్ సైతం చేరింది. గతంలో 2010 సీజన్లో ముంబై , 2014 సీజన్లో పంజాబ్ కింగ్స్, 2019లో చెన్నై, 2022 సీజన్లో గుజరాత్ టైటాన్స్ జట్లు 8 రౌండ్లలో 7 విజయాలు నమోదు చేసిన జట్లుగా ఉన్నాయి. అంతేకాదు..హోంగ్రౌండ్ సవాయి మాన్ సింగ్ స్టేడియం వేదికగా ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకూ ఆడిన 5 రౌండ్ల మ్యాచ్ ల్లో జైపూర్ 4 విజయాలు, ఓ ఓటమి రికార్డుతో నిలిచింది. మిగిలిన 6 రౌండ్ల మ్యాచ్ ల్లో రాజస్థాన్ ఒక్క గెలుపు సాధించినా 16 పాయింట్లతో ప్లే-ఆఫ్ రౌండ్ చేరుకోగలుగుతుంది. 2008 ఐపీఎల్ విజేతగా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ ఆ తరువాత ఒక్కసారి మాత్రమే రన్నరప్ గా నిలువగలిగింది.

Advertisment
తాజా కథనాలు