Rajampeta MLA : అజ్ఞాతంలోకి మేడా.. ఆ పార్టీలోకే జంప్‌..

అన్నమయ్య జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డిని కాదని అమర్నాథ్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడంతో మేడా అజ్ఞాతంలోకి వెళ్లారు.

New Update
Rajampeta MLA : అజ్ఞాతంలోకి మేడా.. ఆ పార్టీలోకే జంప్‌..

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయం దగ్గర పడుతున్నకొద్ది రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పలువురు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను మార్చనున్నట్టు ముందుగానే క్లారిటీ ఇచ్చింది. ఇదే క్రమంలో అన్నమయ్యజిల్లా రాజంపేట జిల్లాకు చెందిన మేడా మల్లికార్జున రెడ్డికి ముందు టికెట్‌ అని ప్రకటించి ఆ తర్వాత కాదని చెప్పడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. తన అనుచరులకు సైతం అందుబాటులో లేకుండా పోయారని తెలుస్తుంది.

అమర్నాథ్‌ రెడ్డి పేరు ప్రకటనతో....

మేడా 2014లో టీడీపి నుంచి రాజంపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత ఎన్నికల సమయంలో వైసీపీలో చేరి రెండవసారి విజయం సాధించారు. ఈసారి కూడా ఆయనకే సీటని మొదట ప్రకటించిన వైసీపీ ఆ తర్వాత రాజంపేట ఇంఛార్జ్‌గా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పేరుని ప్రకటించింది. దీంతో ఆయనకు సీటు ఇవ్వడం లేదనే సంకేతాలు పంపింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన మల్లికార్జునరెడ్డి వెంటనే ఫోన్ స్విచ్ అఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మేడాను కాదని జడ్పీ ఛైర్మన్‌ అమరనాథ్ రెడ్డిని ప్రకటించడంతో మనస్థాపం చెందిన మేడా వర్గీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినా..

ఇటీవల మల్లికార్డున రెడ్డిని పిలిచిన సీఎం జగన్‌ టికెట్‌ నీకే అంటూ చెప్పారట. ఈ లోపు రాజంపేట ఎంపీ మిథున్‌ రెడ్డి ఈ విషయమై చర్చించి రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చాలంటూ ఒత్తిడి తెచ్చినట్టు మేడా అనుచరులు ఆరోపిస్తున్నారు. దీంతో మేడాను మరోసారి పిలిపించిన అధిష్టానం వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి కూడా ఇస్తామని హామీ ఇచ్చినట్టు ప్రచారం సాగుతుంది. ఈ విషయంలో అసంతృప్తితో ఉన్న మేడా అలకవహించి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

జిల్లా ప్రకటన నాటినుంచే

ఇటీవల ఎపీ ప్రభుత్వం ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటించింది. దీనిప్రకారం రాజంపేట జిల్లా కావలసి ఉంది. కాని రాజంపేటను కాదని రాయచోటి(అన్నమయ్య)ని జిల్లాగా ప్రకటించింది. ఈ విషయంలో ప్రజలు ఆందోళనలు నిర్వహించిన ప్రభుత్వం స్పందించలేదు. ఆ సమయంలో మేడా సైతం రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్‌ చేశారు. అయినా అధిష్ఠాన పట్టించుకోలేదు. అప్పటినుంచే మేడా పార్టీ విషయంలో అంటిముట్టనట్టు ఉంటున్నారు. వాస్తవానికి ఆ సమయంలోనే పార్టీకి రాజీనామా చేస్తారని ప్రచారం సాగింది. కానీ ఆయన సైలెంట్‌గా ఉండిపోయారు.

వైసీపీ టికెట్‌ రాకపోవడంతో మేడా మల్లికార్జునరెడ్డి తన అనుచరులతో చర్చించి టీడీపీలో చేరుతారన్న ప్రచారం సాగుతుంది. మేడా అజ్ఞాతం వీడితే తప్ప ఆయన నిర్ణయం ఏంటీ అనేది తేలదు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు