/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/Rains-in-AP-from-tomorrow.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/Rains-in-AP-from-tomorrow.jpg)
ఎప్పుడూ లేని రీతిలో నైరుతి రుతుపవనాలు అటు అన్నదాతలను, ఇటు సాధారణ ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి. ఒక్క కేరళనే కాదు, ఏకంగా దక్షిణ భారతదేశం అంతటా వర్షాలు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. దీని కారణంగా ఈ ఏడు పంటల దిగుబడి బాగా తగ్గిపోయి ఇబ్బందులు ఎదుర్కొనే దుస్థితి తలెత్తనుంది.
గుజరాత్‌ను ముప్పతిప్పలు పెట్టిన బిపర్‌జాయ్ తుఫాను నైరుతి రుతుపవనంపై పెను ప్రభావమే చూపించింది. వాతావరణంలో వేడి ఉష్ణోగ్రత స్థిరంగా కొనసాగుతుండటం వల్ల చల్లదనం మాయమై నైరుతి కదలిక ఆగిపోయింది. దీంతో వానలు కురవడం లేదు. ప్రస్తుతానికైతే బిపర్‌జాయ్ తుపాను ప్రభావం తగ్గిపోయింది కనుక రుతుపవనాలు చురుగ్గా కదిలి వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెబుతున్నారు.
కూల్.. కూల్
రాష్ట్రంలో తీవ్రమైన వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. రేపటి నుంచి రాష్ట్రంలో చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ప్రస్తుతంరత్నగిరి, కొప్పల్, శ్రీహరికోట, పుట్టపర్తి, కర్ణాటక ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్న రుతుపవనాలు.. క్రమంగా కదులుతూ రాష్ట్రమంతటా విస్తరిస్తాయని పేర్కొంది. అటు అరేబియాలోని బిపర్‌జాయ్ తుఫాన్ బలహీనపడుతుండటంతో బంగాళాఖాతంలో దట్టమైన మేఘాలు ఏర్పడ్డాయని వాతావరణ అధికారులు తెలిపారు. ఇప్పటికే వైఎస్సార్, కర్నూల్, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో చిరు జల్లులు కురుశాయని.. వచ్చే 24 గంటల్లో రాయలసీమలోని ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని అనేక చోట్ల ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురవచ్చునని వాతావరణ శాఖ పేర్కొంది.
ఇదిలా ఉండగా.. నేడు రాష్ట్రంలోని 23 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు, 330 మండలాల్లో వడగాల్పులు, అలాగే మంగళవారం 16 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 264 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మధ్యాహ్నం వేళలో అవసరమైతేనే తప్ప.. ప్రజలు బయటకు వెళ్లొద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు అధికారులు.
తెలంగాణ ప్రజలకు అలెర్ట్
తెలంగాణలో వడగాలులు, అధిక ఉష్ణోగ్రతలు మరో మూడు రోజుల వరకు కొనసాగనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, వీలైనంత వరకూ ఎండ సమయంలో బయట పనులకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. అయితే రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు మాత్రం భారత వాతావరణ విభాగం ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నల్గొండ, సూర్యాపేట, కరీంనగర్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, వరంగల్, భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి జిల్లాల్లోని ప్రజలు వీలైనంత వరకు ఇళ్లు దాటకూడదన్నారు. మరోవైపు నైరుతి జోరందుకోవడంతో కేరళలోని పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కిలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.
Follow Us