విజయవాడ డివిజన్ పరిధిలో కొన్ని రైళ్లను సౌత్ సెంట్రల్ రైల్వే రద్దు చేసింది. భద్రతా పరమైన ఆధునికీకరణ పనుల దృష్ట్యా రైళ్లను రద్దు చేస్తునట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి వివరించారు. నవంబర్ 6 వ తేదీ నుంచి 12 వ తేదీ వరకు గుంటూరు - విశాఖ ( 17239) సింహాద్రి ఎక్స్‌ప్రెస్ , రాజమండ్రి- విశాఖ (07466) మెమూ, విశాఖ- రాజమండ్రి (07467) మెమూ రద్దు చేసినట్లు అధికారులు వివరించారు.
అలాగే ఈ నెల 7 వ తేదీ నుంచి 13 వ తేదీ వరకు విశాఖ - గుంటూరు (17420) సింహాద్రి ఎక్స్ ప్రెస్ ను కూడా రద్దు చేసినట్లు ఆయన ప్రకటించారు. దీపావళి పండగ నేపథ్యంలో పలు స్పెషల్ ట్రైన్స్ ను నడుపుతున్నట్లు అధికారులు వివరించారు. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండటం వల్ల చెన్నై సెంట్రల్ నుంచి భువనేశ్వర్ కి ప్రత్యేక రైలును 13, 20, 27 తేదీల్లో నడుపుతున్నట్లు తెలిపారు.
రాత్రి 11.45 గంటలకు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి ఈ రైలు బయల్దేరి మరుసటి రోజు సాయంత్రం 6.30 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది.
ఇక ఈ నెల 14, 21, 28 తేదీల్లో భువనేశ్వర్ నుంచి చెన్నై సెంట్రల్ ప్రత్యేక రైలు రాత్రి 9 గంటలకు భువనేశ్వర్ లో మొదలై మరుసటి రోజు మధ్యాహ్ననికి చెన్నై చేరుకుంటుంది. ఈ ట్రైన్స్..గూడూరు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విజయనగరం, పలాస, ఖుర్ధా రోడ్డు స్టేషన్లలో ఆగుతాయని రైల్వే శాఖ తెలిపింది.
సౌత్ ఈస్టర్న్ రైల్వే..ఇక చెన్నై సెంట్రల్ -సంత్రాగచ్చి మధ్య ప్రత్యేక రైళ్లు నడపనుంది. ఈ నెల 11, 18, 25 తేదీల్లో చెన్నై సెంట్రల్ నుంచి సంత్రాగచ్చి ప్రత్యేక సూపర్ ఫాస్ట్ రైలును నడపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. చెన్నై సెంట్రల్ నుంచి రాత్రి 11.45 కి బయల్దేరి మూడో రోజు తెల్లవారు జామున 3.45 గంటలకు సంత్రాగచ్చి చేరుకోనుంది.
13, 20, 27 తేదీల్లో సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్.. సంత్రాగచ్చిలో ఉదయం 5 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 11 గంటలకు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ చేరుకోనుంది.. గూడూరు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విజయనగరం, పలాస, ఖుర్దా రోడ్డు, భువనేశ్వర్, భద్రక్, బాలాసోర్, ఖరగ్‌పూర్ స్టేషన్లలో ఆగుతాయని రైల్వేశాఖ వివరించింది.
విజయవాడ రైల్వే డివిజన్ లో మరమ్మతుల కారణంగా బిట్రగుంట- చెన్నై – బిట్రగుంట ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ ఈస్టర్న్ రైల్వే ప్రకటించింది. గతంలో ఈ నెల 5వ తేదీ వరకు ఆ రైలును రద్దు చేస్తున్నట్టు ప్రకటించినా.. తాజాగా 10వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు వెల్లడించింది.
అలాగే, కాట్పాడి-తిరుపతి-కాట్పాడి ప్యాసింజర్ రైళ్లను ఈ నెల 12వ తేదీ, అరక్కోణం-కడప-అరక్కోణం మెము రైళ్లను ఈ నెల 12వ తేదీ వరకు రద్దు చేసినట్లు తన ప్రకటనలో పేర్కొంది సౌత్ ఈస్టర్న్ రైల్వే.
Also read: ఊపిరి ఉన్నంత వరకు బీజేపీలోనే కొనసాగుతా: డీకే అరుణ!