తెలంగాణలో ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచార గడువు ముగియనుంది. సమయం తక్కువగా ఉండటంతో అధికార, విపక్ష నేతలు తమ ప్రచారాలను కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లోని వివిధ వర్గాల కార్మికులతో భేటీ అయ్యారు. పారిశుద్ధ్య కార్మికులు, ఆటోడ్రైవర్లు, డెలివరీ బాయ్స్‌తో చర్చించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అయితే తాము సంపాదించిందంతా ఆటోల పెట్రోల్, డీజీల్ ఖర్చులకే సరిపోతుందని ఆటోడ్రైవర్లు తమ బాధలు చెప్పుకున్నారు.
Also Read: కాంగ్రెస్‌ను నమ్మితే కన్నీళ్లే మిగులుతాయి.. ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా
ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. అలాగే ఈఎస్‌ఐ, ఫీఫ్ లాంటి సదుపాయాలు మాకు కూడా కల్పించాలని డెలివరీ బాయ్స్ రాహుల్‌గాంధీకి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన రాహుల్.. గిగ్ వర్కర్స్ సామాజిక భద్రత కోసం రాజస్థాన్‌లో ఒక పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతి ట్రాన్సాక్షన్‌లో కొంత సొమ్మును గిగ్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ కోసం కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీలో కాంట్రాక్టు ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తున్నారని.. 11 గంటల పాటు పనిచేయించుకుంటున్నారని పారిశుద్ధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. సదుపాయాలు అడిగితే ఉద్యోగం మానేయమని చెబుతున్నారని వాపోయారు. అలాగే డబుల్‌బెడ్ రూం ఇళ్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని రాహుల్‌కు చెప్పారు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవగానే కార్మికులతో కొత్త ముఖ్యమంత్రి సమావేశమవుతారని రాహుల్‌గాంధీ వారికి హామీ ఇచ్చారు.
Also read: మెదక్ లో తీవ్ర విషాదం.. నీట మునిగి ఐదుగురి మృతి