PV Narasimha Rao: ఆర్ధిక మంత్రం.. విదేశీ విధాన తంత్రం.. ఇదే పీవీ చాణక్యం మాజీ ప్రధాని పీవీ నర్సింహరావుకు భారతరత్న ప్రకటించింది ప్రభుత్వం. అనూహ్య పరిస్థితుల్లో..ఆర్ధిక గందరగోళం..రాజకీయ స్థబ్ధత మధ్య ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన పీవీ భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఎలా పట్టాలెక్కించారో..విదేశీ విధానాన్ని ఎలా చక్కదిద్దారో ఈ కథనంలో తెలుసుకోవచ్చు By KVD Varma 09 Feb 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి PV Narasimha Rao Profile: రాజకీయం అంటే ఓట్ల కోసం.. పదవుల కోసం అని ఇప్పుడు మనం అనుకుంటాం. పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. కానీ.. ప్రజా సంక్షేమం కోసం కూడా రాజకీయాలు ఉపయోగపడాలి. రాజకీయ నాయకులుగా ఉన్నవారు.. ప్రజల కోసం ఏమి చేయగలమో అనే విషయాన్ని ఆలోచిస్తూనే ఉండాలి. ఒక పార్టీలో నాయకుడిగా ఉన్నపుడు ఆ పార్టీ విధానాలను సమర్థిస్తూనే.. ప్రజల బాగోగుల విషయంలో పార్టీ లైన్ దాటి కూడా పనిచేయడానికి వెనుకాడకూడదు. ఇప్పుడు ఇలా ప్రజల కోసం ఆలోచించే నాయకులు ఎవరైనా ఉన్నారా? చెప్పలేం. కానీ.. మన ఉమ్మడి తెలుగురాష్ట్రాలకు సంబంధించి అలాంటి నాయకుడు ఒకరున్నారు. విద్యావేత్తగా.. పండితుడిగా.. రాజకీయనాయకుడిగా.. ఎమ్మెల్యే దగ్గర నుంచి ప్రధాన మంత్రి వరకూ వివిధ స్థాయిల్లో ఉన్నత పదవుల్లో ఒదిగి.. ఆ పదవులకు వెలుగు ఇచ్చిన నాయకుడు ఆయన. ఆయనే పీవీ నర్సింహారావు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండడం.. ప్రజలకు.. దేశానికి మేలు చేస్తుంది అంటే.. దానిని ఎటువంటి అవాంతరాలు ఎదురైనా తప్పనిసరిగా చేయడం ఆయన నైజం. తనకు ఇష్టం లేని పరిస్థితి ఎదురైతే మౌనంగా పక్కకు జరగడం.. మీరు తప్పితే ఎవరూ లేరు అంటే.. ఆ బాధ్యతను ఇష్టం లేకపోయినా స్వీకరించి ప్రజల మన్ననలు పొందేలా పనిచేయడం పీవీ గొప్పతనం. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న (Bharat Ratna Award) ప్రకటించారు. రాజకీయాల మాట ఎలా ఉన్నా.. భారతరత్న పురస్కారానికి అన్నివిధాలుగానూ అర్హులైనవారు పీవీ. ఇప్పటి ఆర్ధిక అభివృద్ధి వెనుక ఉన్న శక్తి పీవీ నర్సింహారావు అనేది ఇప్పటి తరానికి తెలియదు. అందుకే.. పీవీనర్సింహారావు దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన నాటి పరిస్థితుల్లో ఆయన(PV Narasimha Rao) దేశానికి చేసిన మేలు ఏమిటనేది ఒకసారి చెప్పుకుందాం. అనూహ్యంగా... పీవీ నర్సింహారావు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైన నేతగా ఉండేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా (AP CM) వ్యవహరించారు. తరువాత కేంద్రమంత్రిగా చాలాకాలం ఉన్నారు. 1990 సమయంలో పీవీ నర్సింహారావు కొంతకాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. అప్పుడు రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నారు. 1991లో ఎన్నికల సమయంలో దురదృష్టవశాత్తూ రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలో (Congress Party) ఎవరిని ప్రధానిగా చేయాలి అనే పెద్ద సమస్య తలెత్తింది. అప్పుడు అనూహ్యంగా.. పీవీ నరసింహారావును ఎంపిక చేశారు సోనియా గాంధీ. రాజకీయాల నుంచి పక్కకు జరగాలని అనుకున్న పీవీ నర్సింహారావు తప్పనిసరి పరిస్థితుల్లో అలా ప్రధాని కావాల్సి వచ్చింది. గందరగోళ పరిస్థితులు.. పీవీ ప్రధానిగా (Prime Minister) బాధ్యతలు స్వీకరించే సమయానికి దేశ పరిస్థితులు చాలా గందరగోళంగా ఉన్నాయి. ఇటు రాజకీయంగానూ.. అటు ఆర్థికంగానూ కూడా దేశ పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు. ఒక పక్క గల్ఫ్ యుద్ధ మేఘాలు.. మరోపక్క టెర్రరిజం.. ఒకవైపు అప్పుల కుప్ప.. మరోవైపు అగమ్యగోచరంగా ఉన్న రాజకీయ పరిస్థితులు. ఇలాంటి సమయంలో పీవీ నర్సింహారావు ప్రధానిగా నిలదొక్కుకోగలుగుతారా? అన్నిటికన్నా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో గాంధీయేతర మొదటి ప్రధానిగా ఆయన ఎలా పార్టీ నుంచి వచ్చే ఒత్తిడులను తట్టుకుంటారు? ఎలాంటి అనుమానాలు రాజకీయ విశ్లేషకుల్లోనే కాదు.. సామాన్య ప్రజల్లో కూడా ఉండేవి. కానీ.. ఆయన పీవీ.. అవును.. చాణక్య నీతిని ఔపోసన పట్టిన నాయకుడు. అపర చాణుక్యుడిలా ఐదేళ్ల పాటు దేశాన్ని ఓక గాడిలో పెట్టడానికి మౌనంగానే పనిచేశారు. మాటలు తక్కువ.. పని ఎక్కువ. ఆయనకు తోడుగా ఆర్ధిక మంత్రిగా మన్మోహన్ సింగ్ ను (Manmohan Singh) ఎంపిక చేసుకున్నారు. ఇక అక్కడి నుంచి ఆర్థిక వ్యవస్థకు మరమత్తులు మొదలు పెట్టారు. సరికొత్త భారత ఆర్థిక వ్యవస్థకు (Indian Economy) శ్రీకారం చుట్టారు. ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే.. పీవీ ప్రధానిగా (PV Narasimha Rao)వచ్చేసరికి ప్రపంచంలోనే ఎక్కువ అప్పులతో ఉన్న దేశాల్లో మూడో స్థానంలో ఉంది భారత్. దాదాపుగా 72 బిలియన్ డాలర్ల విదేశీ అప్పుల భారం భారత్ పై వేలాడుతోంది. ఎంతటి హీనమైన పరిస్థితి ఉండేదంటే.. ఎక్కడా అప్పు పుట్టని పరిస్థితి.. ఏదేశమూ మనకు అప్పు ఇవ్వని స్థితి. ఆఖరుకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్‌లలో 67 మెట్రిక్ టన్నుల బంగారాన్ని తాకట్టు పెట్టి 607 మిలియన్ డాలర్ల అప్పు తెచ్చుకున్న దుస్థితి. అటువంటి పరిస్థితిని చాలా వేగంగా మార్చారు పీవీ. మన్మోహన్ సింగ్ తోడుగా అద్భుతాలే చేశారు. దేశ అభివృద్ధికి అడ్డుగా నిలుస్తున్న.. లైసెన్స్ ల విధానాన్ని సమూలంగా మార్చేశారు. విదేశీ వ్యాపారం సులభతరం అయింది. దీంతో 1992 కల్లా దేశ ఆర్థిక పరిస్థితి పట్టాలెక్కింది. పీవీ మార్కు ఏమిటి అని చెప్పాలంటే.. 1995లో ఆయన ప్రధానిగా తప్పుకునే నాటికి దేశ జీడీపీ వృద్ధి 7.6 శాతానికి చేరుకుంది. ఇదొక్కటి చాలు పీవీ దేశానికి ఎంత మేలు చేశారో చెప్పటానికి. పీవీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టేనాటికి మన జీడీపీ సుమారు 26 వేళా కోట్ల డయలర్లుగా ఉండేది. అది 2021 నాటికి సుమారు మూడు లక్షల కోట్ల డాలర్లు దాటింది. ఇంత వేగంగా దేశం వృద్ధిని సాధించడానికి పీవీ ఆర్ధిక సంస్కరణలే మూలం అని చెప్పొచ్చు. Also Read: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న! ఇప్పుడు మన చేతిలో ఉన్న సెల్ ఫోన్.. శాటిలైట్ టీవీలు.. మనం వాడుతున్న అపరిమిత ఇంటర్నెట్.. ఇప్పటి తరానికి సాఫ్ట్ వేర్ ఉద్యోగాల ఉపాధి ఇస్తున్న ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు పీవీ హయాంలో వేసిన ఆర్థిక మూలాల నుంచి ఎదిగినవే. అభివృద్ధి పేరుతొ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పోకూడదనేది పీవీ నర్సింహారావు గట్టి మాట. ఇప్పుడు మనం చూస్తున్న జాతీయ ఉపాధి హామీ పథకానికి అప్పట్లో పీవీ వేసిన పునాదులే కీలకం. అప్పట్లో సంవత్సరంలో 100 రోజుల పని గ్యారెంటీ పథకానికి ఆయనే రూపకర్త. విదేశాంగ విధానంలోనూ.. ఆర్థిక రంగంలోనే కాదు.. విదేశీ విధానంలోనూ పీవీ అప్పట్లో వేసిన ముద్ర చెరిగిపోనిది. ఆయన రాజనీతి విదేశీ విధానంలో అద్భుత ఫలితాలు ఇచ్చింది. లుక్ ఈస్ట్ (Look East) అనే విధానాన్ని తీసుకువచ్చిన పీవీ.. దానితో చైనాకు చెక్ పెట్టె ప్రయత్నం చేశారు. మన దేశంవైపు అందరూ చూసేలా చేశారు. భారత దేశానికి కొత్త మిత్రులను తీసుకువచ్చారు పీవీ. ఇజ్రాయెల్ (Israel) తో స్నేహం కోసం టెల్ అవీల్ లో భారత రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. పాకిస్తాన్ కి మిత్ర దేశంగా ఉన్న ఇరాన్ తో స్నేహబంధాన్ని ఏర్పాటు చేయడంలో పీవీదే కీలక పాత్ర. భారత దేశాన్ని అణ్వస్త్ర దేశంగా మార్చడంలో పీవీ విధానాలే ముఖ్యమైనవి. చైనా, పాకిస్తాన్ లకు గట్టి చెక్ పెట్టాలంటే అణు కార్యక్రమం భారత్ లో కొనసాగాలని ప్రయత్నాలు చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాకా వాజపేయి (Vajpayee) ప్రధానిగా ఉన్నపుడు అణుపరీక్షలు జరిగాయి. ఆ సందర్భంలో పరీక్షలు చేస్తున్నది మేమైనా.. దీని వెనుక శక్తి మాత్రం పీవీ నర్సింహారావే అని వాజ్ పేయీ చెప్పారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి.. పీవీ ప్రధానిగా ఉండగా ఐక్యరాజ్యసమితి సమావేశాలు జరిగాయి. దానికి భారత్ నుంచి ప్రతినిధిగా ప్రతిపక్షనేతగా ఉన్న అటల్ బిహారీ వాజ్ పేయిని పంపించి కొత్త చరిత్ర సృష్టించారు పీవీ. వ్యక్తిగతంగా ఏ మచ్చాలేని నేత.. పీవీ నర్సింహారావు ఎన్నో పదవులు అలంకరించారు. కానీ.. ఎక్కడా వ్యక్తిగతంగా ఆయనపై మచ్చ పడలేదు. పడనీయలేదు. ఆయన ఆస్తులే తిరిగిపోయాయి తప్ప.. ఎక్కడా ఆయన రాజకేయాల పేరు చెప్పి లేదా.. దేశ నేతగా ఆస్తులు కూడపెట్టుకున్న దాఖలాలు లేవు. ప్రధానిగా దిగిపోయిన తరువాత రాజకీయంగా ఆయనపై బురద జల్లే కార్యక్రమాలు జరిగాయి. ఈ నేపథ్యంలో కొన్ని కేసులు కూడా ఎదుర్కొన్నారు. వాటన్నిటినీ సొంత డబ్బుతో ఎదుర్కొన్నారు. ఏ కేసూ నిలబడలేదు. సరికదా ఆయనకు ప్రతి కేసులోనూ క్లీన్ చిట్ ఇచ్చాయి కోర్టులు. ఆ కోర్టు కేసుల కోసం తమ న్యాయవాదులకు హైదరాబాద్ లో ఉన్న ఇంటిని అమ్మి డబ్బు చెల్లించారు పీవీ. పీవీ జీవితం నుంచి ఇప్పటితరం రాజకీయనాయకులు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. పీవీ నర్సింహారావు దార్శనికతే.. మన దేశ అభివృద్ధికి కీలకంగా ఉందనే విషయం చాలా స్పష్టం. అందుకే భారతరత్న అవార్డును ఆయనకు ప్రకటించడం కచ్చితంగా సబబే. ఇది తెలుగు జాతికి దక్కిన అపురూప గౌరవంగా చెప్పుకోవచ్చు. Watch this interesting Video: #pv-narasimha-rao #bharata-ratna #pv-narasimha-rao-profile మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి