AP BJP: వైసీపీ పాలనలో జరిగిన దారుణాలపై ఎప్పుడూ స్పందించని జగన్ ఇప్పుడు రాష్ట్ర పరిస్థితులపై ప్రధానికి లేఖ రాయడం విడ్డూరంగా ఉందన్నారు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి. ఐదేళ్ల పాలనలో జరిగిన అరాచకాలపై ఆత్మపరిశీలన చేసుకోవాలంటూ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు శుక్రవారం విలేకర్లతో మాట్లాడిన ఆమె.. వైసీపీ పాలనలో జరిగిన దారుణాలపై ఆ పార్టీ ఎప్పుడూ స్పందించలేదన్నారు. ఇప్పుడు రాష్ట్ర పరిస్థితులపై ప్రధానికి జగన్ లేఖ రాయడం విడ్డూరంగా ఉందని చెప్పారు. కొవిడ్ సమయంలో ఆక్సిజన్ కొరత ఉందని డాక్టర్ సుధాకర్ ప్రశ్నిస్తే ఆతన్ని తీవ్రంగా వేధించారని గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నెల్లూరులో నామినేషన్ వేయడానికి వెళ్లిన మా పార్టీ అభ్యర్థుల చేతుల్లో ఉన్న పత్రాలనూ వైసీపీ కార్యకర్తలు చింపేశారని తెలపారు.
అలాగే తమ పార్టీకి చెందిన మహిళా కార్యకర్తను గాయపరిచారని చెప్పారు. ఇక రాష్ట్రానికి కేంద్రం సాయం అందించిందని చెప్పేందుకు విశాఖలోని మెడ్‌టెక్ జోన్ ఉదాహరణగా పేర్కొన్నారు. ఈ విషయంలో జగన్ సహకారమేమీ లేదని ఆ సంస్థ ప్రతినిధులే స్వయంగా చెప్పారని తెలిపారు. ఈ విషయాలేవీ తెలియకుండా పేర్ని నాని ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదు. కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల పసలేని విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న దాడులు హేయమైనవి. సామాజిక మాధ్యమాల్లో అనైతిక వీడియోల కారణంగా చిన్నారులు పక్కదోవపడుతున్నారు. సోషల్ మీడియాలోని కంటెంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టాలని కోరారు.