వైద్యురాలి హత్య కేసులో అసలు విషయాలు వెలుగులోకి..భర్తే సుఫారీ ఇచ్చి!

మచిలీపట్నంలో సంచలనం సృష్టించిన డాక్టర్ రాధ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమెను భర్తే సుఫారి ఇచ్చి మరీ హత్య చేయించినట్లుగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

వైద్యురాలి హత్య కేసులో అసలు విషయాలు వెలుగులోకి..భర్తే సుఫారీ ఇచ్చి!
New Update

మచిలీపట్నంలో సంచలనం సృష్టించిన డాక్టర్ రాధ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమెను భర్తే సుఫారి ఇచ్చి మరీ హత్య చేయించినట్లుగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. జులై 26 వ తేదీన రాధను గుర్తు తెలియని వ్యక్తులు నగల కోసం హత్య చేసినట్లుగా చిత్రీకరించారు.

అయితే రాధ హత్య జరిగిన తరువాత నుంచి వారి వద్ద పని చేసే డ్రైవర్‌ ప్రవర్తన కొంచెం వింతగా అనిపించడంతో పాటు, డ్రైవర్ తల్లి కూడా గత కొన్ని రోజుల నుంచి రాధ భర్త గురించి మాట్లాడడంతో అనుమానం వచ్చిన పోలీసులు డ్రైవర్‌ ని అదుపులోనికి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

అసలేం జరిగిందంటే..
మచిలీపట్నం జవ్వారుపేటలోని శ్రీ వెంకటేశ్వర తల్లీపిల్లల ఆసుపత్రిని డాక్టర్ల రాధ, డాక్టర్‌ మహేశ్వరరావు నడుపుతున్నారు. గైనకాలజిస్టు అయిన రాధ కొంతకాలంగా ప్రాక్టీస్‌ మానేశారు. వీరి వద్ద నగరానికే చెందిన ఓ వ్యక్తి గత 15 ఏళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. హత్య జరిగిన రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ డ్రైవర్‌ ఆసుపత్రిలో హడావుడిగా తిరిగినట్టుగా పోలీసులు విచారణలో వెల్లడైంది.

దీంతో అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. రెండు, మూడురోజుల విచారణ అనంతరం డాక్టర్‌ రాధ భర్త సూచన తోనే తాను హత్య చేసినట్టుగా ఈ డ్రైవర్‌ పోలీసుల వద్ద నేరం అంగీకరించినట్టు విశ్వసనీయ సమాచారం. దీంతో డాక్టర్‌ రాధ భర్తను అదుపులోకి తీసుకుని పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించారు.

పైపులకు బిగించే ఇనుపరాడ్డుతో రాధ తలపై మోది హత్య చేసినట్లుగా నిందితుడు అంగీకరించాడు. ఆ తర్వాత అనుమానం రాకుండా ఆమె నగలను తీసుకుని…ఆధారాలు గుర్తుపట్టకుండా ఉండడం కోసం కారంపొడిచల్లినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. దీనికోసం మహేశ్వరరావు డ్రైవర్ కి భారీ మొత్తంలో సుఫారీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ హత్య కేసులో ఓ ల్యాబ్ అధినేతకు కూడా సంబంధం ఉందన్న అనుమానంతో పోలీసులు అతడిని విచారిస్తున్నారు.

డాక్టర్‌ రాధ హత్యకేసులో డ్రైవరే ఆమెను కొట్టి చంపాడని మృతురాలి భర్త చెప్పడంతో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా డ్రైవర్‌ మిగిలిపోయాడు. దీంతో డ్రైవర్‌ తల్లి.. తమ కుమారుడిని ఈ హత్యకేసులో ఇరికించారని బాహాటంగానే చెబుతుండటంతో డాక్టర్‌ రాధ హత్యకేసులో పాత్రదారులు, సూత్రదారుల పేర్లు బయటకు వచ్చాయి.

డ్రైవర్‌కి, వైద్యుడికి మధ్య వారం రోజులుగా నెలకొన్న విభేదాల కారణంగానే అసలు నిజం బయటకు వచ్చిందని నగరప్రజలు చెప్పుకుంటున్నారు. సలహాలు ఇచ్చినందుకు ఒక ప్రముఖ డ్రగ్‌ కంపెనీకి డీలరుగా ఉన్న మరో వైద్యుడికి జైలు ఊచలు తప్పేలా లేవు. ఈ కేసులో నిందితులను రెండు, మూడురోజుల్లో అరెస్ట్‌ చూపే అవకాశం ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.

#doctor #murder-case #machilipatnam
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe