భారతీయ రైల్వేలో ఇదొక చారిత్రాత్మక రోజుగా చెబుతున్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద దేశంలోని 508 రైల్వే స్టేషన్‌లను తిరిగి అభివృద్ధి చేస్తారు. 'చారిత్రక' కార్యక్రమంలో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్‌ల పునరాభివృద్ధికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ. 24,470కోట్లను కేంద్రం ప్రభుత్వం ఖర్చు చేస్తుందని పీఎంవో వెల్లడించింది.
కాగా ఈ విషయం గురించే శనివారం ప్రధాని మోదీ ఓ ట్వీట్ కూడా చేశారు. రేపు ఆగస్టు 6వ తేదీని రైల్వే రంగంలో చారిత్రాత్మక రోజు. దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్లను పునరుద్ధరించేందుకు ఉదయం 11గంటలకు పునాది రాయి పడుతుందంటూ మోదీ ట్వీట్ ద్వారా వెల్లడించారు. రైల్వే రంగంలో ఈ డెవలప్ మెంట్ అనేది విప్లవాత్మకంగా ఉంటుందన్నారు. ప్రజలకు మరింత సౌకర్యవంతమైన జీవితం లభిస్తుందని తెలిపారు. స్థానిక సంస్కృతులు, వారసత్వం, కళలను దృష్టిలో ఉంచుకొని...వాటికి తగ్గట్లుగా రైల్వే స్టేషన్ల పునురుద్ధరణ జరుగుతుందన్నారు. పీఎంఓ తెలిపిన వివరాల ప్రకారం రైల్వేస్టేషన్లను సిటి సెంటర్లుగా తీర్చిదిద్దనున్నారు. ప్రతి సిటీకి ప్రారంభం, చివరిలో రెండు స్టేషన్లను అభివ్రుద్ధి చేస్తారని తెలిపారు. దీనికోసం మాస్టర్ ప్లాన్స్ రెడీ అవుతున్నట్లు వెల్లడించింది.
ప్రధాన మంత్రి పునరాభివృద్ధికి శంకుస్థాపన చేయనున్న రైల్వే స్టేషన్లలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలో ఒక్కొక్కటి 55, బీహార్‌లో 49, మహారాష్ట్రలో 44, పశ్చిమ బెంగాల్‌లో 37, మధ్యప్రదేశ్‌లో 34, అస్సాంలో 32, ఒడిశాలో 25 ఉన్నాయి. పంజాబ్, గుజరాత్, తెలంగాణలో 22 స్టేషన్లు 21-21 స్టేషన్లు, జార్ఖండ్ 20, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు 18-18 స్టేషన్లు ఉన్నాయి. వీటిలో హర్యానాలో 15, కర్ణాటకలో 13 స్టేషన్లు ఉన్నాయి.రానున్న రెండేళ్లలో ఈ రైల్వే స్టేషన్లను ప్రపంచస్థాయికి తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ రైల్వేస్టేషన్లలో రూఫ్ ప్లాజాలను నిర్మాణంతోపాటు పూర్తి సౌకర్యాలతో కూడిన రన్నింగ్ రూమ్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు పీఎంవో తెలిపింది.
ప్రణాళిక ప్రయోజనం:
-స్టేషన్లను నగర కేంద్రాలుగా అభివృద్ధి చేయడం
-నగరం రెండు చివరల ఏకీకరణ
-స్టేషన్ భవనాల అభివృద్ధి, పునరాభివృద్ధి
- ప్రయాణీకులకు ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేయడం.
-మెరుగైన ట్రాఫిక్ వ్యవస్థ, ఇంటర్‌మోడల్ ఇంటిగ్రేషన్
-మాస్టర్ ప్లాన్‌లో సరైన అభివృద్ధి