Pawan Vs Stalin: సనాతన ధర్మంపై దక్షిణాదిలో ఇద్దరు డిప్యూటీ సీఎంల మధ్య మాటలయుద్ధం మరింత హీట్ పెంచుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధిస్టాలిన్ ఫైట్ తారాస్థాయికి చేరింది. సనాతన ధర్మం ఒక వైరస్ లాంటిది.. దీనిని సమూలంగా నిర్మూలిస్తామని ఉదయనిధిస్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యలకు.. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ప్రాణ త్యాగం చేసేందుకు వెనకాడమని పవన్ కళ్యాణ్ నిన్న తిరుపతి సభలో కౌంటర్ ఇచ్చారు. గురువారం తిరుపతి వారాహి సభలో స్వయంగా ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్‌పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన ధర్మాన్ని ఎవరూ తుడిచిపెట్టలేరని, అలా అనుకున్నవారే తుడిచిపెట్టుకుపోతారంటూ పవన్‌కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేయడం మరింత చర్చనీయాంశమైంది. దీంతో వెంటనే పవన్ కామెంట్స్‌పై స్పందించిన ఉదయనిధి స్టాలిన్ 'వెయిట్ అండ్ సీ' అంటూ కౌంటర్ ఇవ్వడం పొలిటికల్ హీట్ ను పెంచేసింది.
సనాతన ధర్మం వైరస్ లాంటిది..
ఈ మేరకు తమిళనాడు నటుడు, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కొద్ది నెలల క్రితం సనాతన ధర్మం వైరస్ లాంటిది, దానిని అరికట్టాలి అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఉదయనిధిపై బీజేపీ నేతలు, హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో వారాహి డిక్లరేషన్ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆ వ్యవహారంపై స్పందిస్తూ.. ఉదయనిధి స్టాలిన్ ఇతర మతాలపై ఆ తరహా వ్యాఖ్యలు చేసి ఉంటే ఈపాటికి దేశం తగలబడి పోయి ఉండేదని పవన్ అన్నారు. కానీ, హిందువులు మాత్రం మౌనంగా ఉండాలా అని ప్రశ్నించారు. దేవుడి ఆశీస్సులు తీసుకుని చెబుతున్నానని, సనాతన ధర్మాన్ని ఎవరూ ఏమీ చేయలేరన్న సంగతి గుర్తుంచుకోవాలని పవన్ చెప్పారు. ఉదయనిధి స్టాలిన్ వంటి వారు వస్తారు, పోతారు అని, కానీ సనాతన ధర్మం ఎప్పటికీ నిలిచి ఉంటుందన్నారు.
అది మన దౌర్భాగ్యం..
'భారత సనాతన ధర్మాన్ని అంతం చేయాలనుకోవడం ఒక కొండని ఉలి దెబ్బతో కూల్చేయాలనుకోవడమే. శ్రీరాముడి విగ్రహంపై చెప్పులతో దాడి చేశారు. శ్రీరాముడి విగ్రహం తల నరికేశారు. రామాయణం కల్పవృక్షం కాదు విషవృక్షం అన్నారు. అలా వ్యాఖ్యానిస్తే హిందువులకు కోపం రాదా? అయోధ్య రామ జన్మభూమిలో శ్రీరాముని ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంటే రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'నాచ్ గాన' కార్యక్రమం అని అవమానించారు. రాముడిపై జోకులు వేస్తే చూస్తూ కూర్చోవాలా? బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరిపి, దుర్గా నవరాత్రులు జరగకుండా అడ్డుకుంటుంటే సూడో సెక్యులరిస్ట్ లు ఒకరు కూడా మాట్లాడలేదు. రాముడు ఉత్తరాది దేవుడు, ఆర్యుడు అని కొంతమంది తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. రాముడు ఈ దేశానికి ఆదర్శ ప్రాయుడు. భారతీయ వారసత్వ సంపద. ఇస్లాం సమాజం అల్లా అంటే ఆగిపోతారు. మనం గోవిందా అంటే ఆగం. అది మన దౌర్భాగ్యం. హిందూ ధర్మానికి గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి. మిడిల్ ఈస్ట్ దేశాలు ఇస్లాం దేశాలుగా ప్రకటించుకుని ఇతర మతస్తులను తరిమేస్తుంటే ఒక్క సూడో సెక్యులరిస్ట్ మాట్లాడలేదు. కానీ ఇక్కడ మాత్రం సెక్యులరిజం అని చెబుతున్నారు' అంటూ పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్ లో విరుచుకుపడ్డారు.