PM Kisan Samman Nidhi: మూడోసారి ఎన్డీయే సర్కారు కొలువు తీరింది. ప్రధానిగా మోదీ మూడోసారి ఆదివారం ప్రమాణాస్వీకారం చేశారు. ఆయనతో పాటు 71 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈరోజు సాయంత్రం క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈలోగా ప్రధానిగా మోదీ పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో ప్రధానమంత్రి కార్యాలయానికి మోదీ చేరుకున్నారు. పీఎంఓ సౌత్ బ్లాక్ లోని తన కార్యాలయానికి చేరుకున్న ప్రధానికి సౌత్ బ్లాక్ ఉద్యోగులు చప్పట్లతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రధాని మోదీ కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan Samman Nidhi) యోజన నిధుల విడుదల ఫైల్ పై తొలి సంతకం చేశారు.
ఈ సందర్భంగా రైతు సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. 9 కోట్ల మంది రైతులకు 20 వేల కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ప్రధాని మోదీ ఫైల్ పై సంతకం చేశారు. వ్యవసాయరంగానికి మరింత చేయూత ఇస్తామని ఈ సందర్భంగా మోదీ చెప్పారు.
సాయంత్రం క్యాబినెట్ భేటీ.. PMAY-G పై చర్చ..!
కొత్తగా ఏర్పాటైన మోడీ 3.0 క్యాబినెట్ తన మొదటి సమావేశాన్ని ప్రధాని నివాసం 7, లోక్ కళ్యాణ్ మార్గ్‌లో నిర్వహించనుంది. సాయంత్రం 5 గంటలకు జరగనున్న సమావేశంలో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన-గ్రామీన్ (PMAY-G) కింద రెండు కోట్ల అదనపు ఇళ్లను ఆమోదించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఇంకా, కేంద్ర మంత్రివర్గం PMAY-G కింద లబ్ధిదారులకు అందించే సహాయాన్ని దాదాపు 50 శాతం పెంచే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. జాతీయ మీడియాలోనూ ఈ విషయంపై కథనాలు వెలువడ్డాయి.
ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తన మధ్యంతర బడ్జెట్‌లో పౌరులందరికీ సరసమైన గృహాలను ఇచ్చే కార్యక్రమం గురించి ప్రస్తావించారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా వచ్చే ఐదేళ్లలో పీఎంఏవై-జీ కింద రెండు కోట్ల అదనపు ఇళ్లు నిర్మించనున్నట్లు ఆమె తెలిపారు. ఇదిలా ఉండగా, గత ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో, మురికివాడలు, గుట్టలు, అనధికార కాలనీలు,అద్దె ఇళ్లలో నివసించే పేద మరియు మధ్యతరగతి పౌరులు రుణ రేట్లలో ఉపశమనంతో త్వరలో బ్యాంకుల నుండి గృహ రుణాలు పొందగలరని ప్రధాని మోదీ చెప్పారు. ఇప్పుడు దీనికి అనుగుణంగా చర్యలు తీసుకునేందుకు పథకాన్ని రూపొందించే అవకాశం కనిపిస్తోంది.